
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. భూతాపం కారణంగా సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుందని తెలిపింది. నడి వేసవిలో నిప్పుల వాన కురిపించేంతలా ఎండలు కాస్తాయని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూ తాపంతో వాతావరణంలో వస్తున్న పెను మార్పులే దీనికి కారణమని చెబుతున్నారు. ఎండల తీవ్రత మార్చి 2వ వారం నుంచే మొదలుకానుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
మే నెల నుంచి వడగాడ్పుల ప్రభావం: వాతావరణ శాఖ నివేదిక ప్రకారం... మే నెల మొదటి వారం నుంచి వడగాడ్పుల ప్రభావం మొదలు కానుంది. గతేడాదితో పోల్చిచూస్తే.. వడగాడ్పుల ప్రభావం అంతగా ఉండకపోవడం ఉపశమనం కల్గించినా.. అదే సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కానుండడంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధిక రోజులు నమోదు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment