summar effect
-
మట్టికుండ.. సల్లగుండ
మియాపూర్: రోజు రోజుకూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉపశమనం కోసం ఎక్కువగా జనం దప్పిక తీర్చుకునేందుకు మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక సంఖ్యలో జనం ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతూ సంప్రదాయ పద్ధతులను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా మట్టి పాత్రలు, మట్టి కుండలలో వంటకాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మట్టి కుండలు, మట్టి పాత్రలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. రకరకాల డిజైన్న్లతో కుండలు ఆకర్షిస్తున్నాయి. టీ కప్పు నుంచి వాటర్ బాటిళ్లు, వంట పాత్రలు అందుబాటులోకి రావడంతో ఆరోగ్యానికి మేలు చేస్తోందని జనం వాటిని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మట్టి కుండలలో సహజంగా చల్ల బరిచే ప్రత్యేకత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం అధికంగా ఉగాది పండుగకు పచ్చడి చేసేందుకు కొత్త కుండలు కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు గత పదిహేను రోజుల నుండి ఎండలు మండిపోతుండటంతో చల్లటి నీరు తాగేందుకు ముందుగానే మట్టి కుండలను విక్రయాలు చేస్తున్నారు. చందానగర్లోని గంగారం గ్రామంలో మట్టి కుండలు తయారు చేసి విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. మట్టి కుండలలో నీరు తాగడం వలన శరీరానికి చల్లదనం కలగడంతోపాటు ఆరోగ్య పరంగా ఎంతో మంచిదని మన పూర్వీకులు చెప్పడమే కాకుండా డాకర్లు సైతం సూచిస్తున్నారు. టీ కప్పులు, వాటర్ జగ్లు, వంట పాత్రలు, రంజన్లు, కూజాలు, వాటర్ బాటిళ్లు వాటిలో మట్టితో చేసిన వస్తువులు వివిధ రకాల సైజులతో అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా మట్టి వస్తువుల పై రంగు రంగుల చిత్రాలు చిత్రీకరించి పలు రకాల డిజైన్లలో ఆకర్షణీయంగా తయారు చేస్తూవిక్రయిస్తున్నారు. ఎక్కువగా మట్టి పాత్రలను రాజస్థాన్, గుజరాత్, కోల్కత్తా నుండి పలు రకాల డిజైన్ల పాత్రలను తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారు. వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగించే కుండలకు ట్యాప్ ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. వాటికి గిరాకి ఉంది. -
ఈసారి నడి వేసవిలో నిప్పుల వాన
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. భూతాపం కారణంగా సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుందని తెలిపింది. నడి వేసవిలో నిప్పుల వాన కురిపించేంతలా ఎండలు కాస్తాయని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూ తాపంతో వాతావరణంలో వస్తున్న పెను మార్పులే దీనికి కారణమని చెబుతున్నారు. ఎండల తీవ్రత మార్చి 2వ వారం నుంచే మొదలుకానుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మే నెల నుంచి వడగాడ్పుల ప్రభావం: వాతావరణ శాఖ నివేదిక ప్రకారం... మే నెల మొదటి వారం నుంచి వడగాడ్పుల ప్రభావం మొదలు కానుంది. గతేడాదితో పోల్చిచూస్తే.. వడగాడ్పుల ప్రభావం అంతగా ఉండకపోవడం ఉపశమనం కల్గించినా.. అదే సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కానుండడంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధిక రోజులు నమోదు కానున్నాయి. -
చిచ్చరపిడుగు మోగ్లీ.. విన్యాసాలు
తిరువనంతపురం : వేసవి కాలం వస్తోందంటే అందరూ హడలెత్తిపోతారు.. కానీ చిన్న పిల్లలు మాత్రం పండగ చేసుకుంటారు. ఎందుకంటే అపుడే కదా వారికి సెలవులు వచ్చేది. అప్పటివరకూ బడిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులు వేసవి సెలవుల్లో తమ చేష్టలతో తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తారు. అటువంటి చిచ్చర పిడుగుల అల్లరికి అంతే ఉండదు. ‘నోస్టాలిగా’ అనే ఫేస్బుక్ పేజీలో కేరళకు చెందిన ఓ చిన్నారి భయం లేకుండా కొమ్మను పట్టుకుని కొబ్బరి చెట్టెక్కేందుకు ప్రయత్నిస్తోన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘రానున్న రెండు నెలల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో దేవుడా’ అంటూ చేసిన కామెంట్ లైక్లు, షేర్లతో దూసుకుపోతోంది. అయితే ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరి నవ్వు తెప్పిచ్చినా.. జాగ్రత్త వహించకపోతే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచడం మర్చిపోకండి సుమా. -
మోగ్లీ చేసిన విన్యాసాలు..వైరల్!
-
ఇప్పుడే ఇలా.. మేలో ఎలా?
రాష్ట్రంలో నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండ రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు పదేళ్లలో రికార్డు.. వడగాలులు తీవ్రం భయాందోళనలో ప్రజలు హైదరాబాద్/విశాఖపట్నం: రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉండటంతో మండు వేసవి(మే నెల)లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భానుడి భగభగలతో రాయలసీమ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తెలంగాణ, కోస్తాంధ్రలోనూ ఉష్ణోగ్రతలు వెనక్కి తగ్గడం లేదు. మార్చి నెలలో(25వ తేదీ లోపు) గత పదేళ్లలోనే అత్యధికంగా తిరుపతిలో 42.7, కర్నూలులో 42.6, అనంతపురంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2007 మార్చి 25న అనంతపురంలో 41.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఆయా జిల్లాల్లో రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు(26 నుంచి 28 డిగ్రీలు) కూడా అధికంగా ఉంటూ వేడి రాత్రుల(వార్మ్ నైట్స్) ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వర్షాభావం వల్ల ఇప్పటికే కోస్తా జిల్లాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. తాగునీరు అందించే జలాశయాలతో పాటు నీటివనరులు అడుగంటాయి. గతంలో ఏప్రిల్ చివర్లోనూ, మే నెలలోనూ వడదెబ్బ మరణాలు నమోదయ్యేవి. ఈ ఏడాది అప్పుడే వడదెబ్బ మరణాలు రికార్డవుతున్నాయి. వడదెబ్బ లక్షణాలు తలనొప్పి, వాంతులు, ఒంటి నొప్పులు, తీవ్ర నీరసం, కళ్లు తిరిగి పడిపోవడం వడదెబ్బ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రోగికి నాలుగు వైపులా గాలి తగిలే ఏర్పాటు చేయాలి. తక్షణం వైద్యులను సంప్రదించి వైద్య సేవలకు ఏర్పాటు చేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలు, వయోవృద్ధులు, గుండెజబ్బుల బాధితులు, వ్యాధిగ్రస్తులు త్వరగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటకు వెళ్లాల్సివస్తే తలకు, ముఖానికి వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేత రంగు కాటన్ దుస్తులే ధరించాలి. అధిక మోతాదులో మంచి నీరు తాగాలి. డీహైడ్రేషన్ బారినపడకుండా ఉప్పు వేసిన నీరు తీసుకోవాలి. చల్లదనం కోసం పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీరుతో పాటు తాజా పండ్లు తీసుకోవడం మంచిది. వ్యవసాయ కూలీలు తప్పనిసరిగా తలపాగా ధరించాలి. నివాస ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు చల్లగా ఉండేలా చూసుకోవాలి. బాగా గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. కిటికీలకు వట్టివేళ్ల కర్టెన్లు లేదా గోనెసంచులు వేలాడదీసి నీరు చల్లుతూ ఉండాలి.