రాష్ట్రంలో నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండ
రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు
పదేళ్లలో రికార్డు.. వడగాలులు తీవ్రం
భయాందోళనలో ప్రజలు
హైదరాబాద్/విశాఖపట్నం: రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉండటంతో మండు వేసవి(మే నెల)లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భానుడి భగభగలతో రాయలసీమ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తెలంగాణ, కోస్తాంధ్రలోనూ ఉష్ణోగ్రతలు వెనక్కి తగ్గడం లేదు. మార్చి నెలలో(25వ తేదీ లోపు) గత పదేళ్లలోనే అత్యధికంగా తిరుపతిలో 42.7, కర్నూలులో 42.6, అనంతపురంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2007 మార్చి 25న అనంతపురంలో 41.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది.
ఆయా జిల్లాల్లో రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు(26 నుంచి 28 డిగ్రీలు) కూడా అధికంగా ఉంటూ వేడి రాత్రుల(వార్మ్ నైట్స్) ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వర్షాభావం వల్ల ఇప్పటికే కోస్తా జిల్లాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. తాగునీరు అందించే జలాశయాలతో పాటు నీటివనరులు అడుగంటాయి. గతంలో ఏప్రిల్ చివర్లోనూ, మే నెలలోనూ వడదెబ్బ మరణాలు నమోదయ్యేవి. ఈ ఏడాది అప్పుడే వడదెబ్బ మరణాలు రికార్డవుతున్నాయి.
వడదెబ్బ లక్షణాలు
తలనొప్పి, వాంతులు, ఒంటి నొప్పులు, తీవ్ర నీరసం, కళ్లు తిరిగి పడిపోవడం వడదెబ్బ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రోగికి నాలుగు వైపులా గాలి తగిలే ఏర్పాటు చేయాలి. తక్షణం వైద్యులను సంప్రదించి వైద్య సేవలకు ఏర్పాటు చేయాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిల్లలు, వయోవృద్ధులు, గుండెజబ్బుల బాధితులు, వ్యాధిగ్రస్తులు త్వరగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది.
బయటకు వెళ్లాల్సివస్తే తలకు, ముఖానికి వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేత రంగు కాటన్ దుస్తులే ధరించాలి.
అధిక మోతాదులో మంచి నీరు తాగాలి. డీహైడ్రేషన్ బారినపడకుండా ఉప్పు వేసిన నీరు తీసుకోవాలి.
చల్లదనం కోసం పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీరుతో పాటు తాజా పండ్లు తీసుకోవడం మంచిది.
వ్యవసాయ కూలీలు తప్పనిసరిగా తలపాగా ధరించాలి.
నివాస ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు చల్లగా ఉండేలా చూసుకోవాలి. బాగా గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. కిటికీలకు వట్టివేళ్ల కర్టెన్లు లేదా గోనెసంచులు వేలాడదీసి నీరు చల్లుతూ ఉండాలి.