High-temperature
-
నేడు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు
-
నేడు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు
ఆదిలాబాద్‌లో 44.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. రోజురోజుకూ వడగాడ్పుల తీవ్రత పెరుగుతూఉంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్‌కు మించి పగటి ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని వివరించింది. కాగా, మంగళవారం ఆదిలాబాద్‌లో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల లోనూ 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో 43, హైదరాబాద్, భద్రాచలం, రామగుండంలో 42, ఖమ్మంలో 41, హకీంపేటలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 4.7 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బతో 13 మంది మృతి సాక్షి, నెట్వర్క్: మండుతున్న ఎండలు మంగళవారం వేర్వేరుచోట్ల 13 మందిని బలిగొన్నాయి. వడదెబ్బకు తాళలేక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం ఐదుగురు మృత్యువాత పడ్డారు. వైరా మండలం జింకలగూడేనికి చెందిన షేక్ బేగంబీ(75), ఇదేమండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన తాటి జగన్నాథం(70), దుమ్ముగూడెం మండలం చినబండిరేవు గ్రామానికి చెందిన బుద్దా రామయ్య (60), సత్తుపల్లి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వేముల కొండమ్మ(85), తల్లాడ మండల పరిధిలోని అన్నారుగూడేనికి చెందిన తాళ్లూరి గోపులు (45) ఎండవేడిమికి తట్టుకోలేక చనిపోయారు. అలాగే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం వడదెబ్బతో ఐదుగురు మృత్యువా తపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం లోని అనుగొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్(60), నవాబుపేట మండలం కాకర్‌జాల్ తండాకు చెందిన టీక్యానాయక్ (42) అనే ఉపాధి కూలీ, నాగర్క ర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరుకు చెందిన ఉపాధి కూలీ పాశం మల్లయ్య(46) మృతిచెందారు. వనపర్తి జిల్లా వనపర్తి మండలం రాజపేటకు చెందిన గొడుగు కురుమయ్య(60), పెద్దమందడి మండలం వీరాయపల్లికి చెందిన బోయ లొట్టి చెన్నయ్య (60) మృతిచెందారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ దాసారపు భద్రమ్మ (37), రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం సర్ధాపూర్ గ్రామానికి చెందిన దడిగెల వెంకటమ్మ (60), పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన పోశవేని రాజమ్మ(70)కూడా వడదెబ్బతో మరణించారు. -
ఇప్పుడే ఇలా.. మేలో ఎలా?
రాష్ట్రంలో నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండ రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు పదేళ్లలో రికార్డు.. వడగాలులు తీవ్రం భయాందోళనలో ప్రజలు హైదరాబాద్/విశాఖపట్నం: రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉండటంతో మండు వేసవి(మే నెల)లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భానుడి భగభగలతో రాయలసీమ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తెలంగాణ, కోస్తాంధ్రలోనూ ఉష్ణోగ్రతలు వెనక్కి తగ్గడం లేదు. మార్చి నెలలో(25వ తేదీ లోపు) గత పదేళ్లలోనే అత్యధికంగా తిరుపతిలో 42.7, కర్నూలులో 42.6, అనంతపురంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2007 మార్చి 25న అనంతపురంలో 41.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఆయా జిల్లాల్లో రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు(26 నుంచి 28 డిగ్రీలు) కూడా అధికంగా ఉంటూ వేడి రాత్రుల(వార్మ్ నైట్స్) ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వర్షాభావం వల్ల ఇప్పటికే కోస్తా జిల్లాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. తాగునీరు అందించే జలాశయాలతో పాటు నీటివనరులు అడుగంటాయి. గతంలో ఏప్రిల్ చివర్లోనూ, మే నెలలోనూ వడదెబ్బ మరణాలు నమోదయ్యేవి. ఈ ఏడాది అప్పుడే వడదెబ్బ మరణాలు రికార్డవుతున్నాయి. వడదెబ్బ లక్షణాలు తలనొప్పి, వాంతులు, ఒంటి నొప్పులు, తీవ్ర నీరసం, కళ్లు తిరిగి పడిపోవడం వడదెబ్బ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రోగికి నాలుగు వైపులా గాలి తగిలే ఏర్పాటు చేయాలి. తక్షణం వైద్యులను సంప్రదించి వైద్య సేవలకు ఏర్పాటు చేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలు, వయోవృద్ధులు, గుండెజబ్బుల బాధితులు, వ్యాధిగ్రస్తులు త్వరగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటకు వెళ్లాల్సివస్తే తలకు, ముఖానికి వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేత రంగు కాటన్ దుస్తులే ధరించాలి. అధిక మోతాదులో మంచి నీరు తాగాలి. డీహైడ్రేషన్ బారినపడకుండా ఉప్పు వేసిన నీరు తీసుకోవాలి. చల్లదనం కోసం పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీరుతో పాటు తాజా పండ్లు తీసుకోవడం మంచిది. వ్యవసాయ కూలీలు తప్పనిసరిగా తలపాగా ధరించాలి. నివాస ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు చల్లగా ఉండేలా చూసుకోవాలి. బాగా గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. కిటికీలకు వట్టివేళ్ల కర్టెన్లు లేదా గోనెసంచులు వేలాడదీసి నీరు చల్లుతూ ఉండాలి. -
మళ్లీ చెలరేగిన వడగాడ్పులు
జగన్నాథపురం (కాకినాడ) :సూర్యుడు చండప్రచండుడై మళ్లీ చెలరేగాడు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఆపసోపాలు పడ్డారు. తీవ్రమైన వడగాడ్పులు వీయడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 30 మంది మరణించారు. కాకినాడలో వడగాడ్పులకు ముగ్గురు చనిపోయారు. స్థానిక దుమ్ములపేట రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన చుక్కల భీమశంకర్(55), ఏటిమొగకు చెందిన అంగాడి సూర్యకాంతం(65) వడగాడ్పులకు అస్వస్థతకు గురై ఆదివారం మరణించారు. స్థానిక డెయిరీ ఫారం సెంటర్ రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన రావూరి విజయకుమారి(46) వడదెబ్బకు గురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించింది. నలుగురి మృతి శంఖవరం : మండల కేంద్రమైన శంఖవరంలో ఆదివారం వడదెబ్బకు గురై నలుగురు చనిపోయారు. గ్రామానికి చెందిన చింతపల్లి లక్ష్మి(40), బీరా అప్పారావు(65), వెదురుపాక అచ్చియమ్మ(80) మరణించినట్టు స్థానికులు తెలిపారు. లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, అప్పారావుకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గవిరంపేటకు చెందిన అల్లి వెంకటరమణ (37) వడదెబ్బకు గురై మరణించాడు. ఇంటి వద్దే వృద్ధురాలు వి.సావరం(రాయవరం) : వడగాడ్పులకు గ్రామానికి చెందిన బండారు వీరయ్యమ్మ(73) ఆదివారం మధ్యాహ్నం చనిపోయింది. ఇంటి వద్ద ఉన్న ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలింది. బంధువులు సపర్యలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వడదెబ్బకు ఇద్దరి మృతి ప్రత్తిపాడు(ఏలేశ్వరం) : వడ దెబ్బకు గురై మండలంలో ఆదివారం ఇద్దరు మరణించారు. ప్రత్తిపాడు గ్రామంలోని ఇందిరకాలనీకి చెందిన కాకర దండెమ్మ(65) రెండు రోజులుగా ఎండలకు అస్వస్థతకు గురైంది. ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్టు ఆమె కుమారుడు షరా బందు తెలిపాడు. శరభవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ టి.వెంకట్రావు(55) పనులకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికి వచ్చి సొమ్మసిల్లి చనిపోయినట్టు ఉప సర్పంచ్ అమరాది వెంకట్రావు తెలిపారు. అస్వస్థతకు గురై.. తొండంగి : ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై ఆదివారం గోపాపట్నంలో మొగలితిత్తి త్రిమూర్తులు(55) చనిపోయాడు. ఇంటి పనుల కోసం బయటకు వెళ్లిన అతడు.. తిరిగొచ్చాక అస్వస్థతకు గురై పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అతడికి భార్య కామేశ్వరి, కుమారులు వెంకటకుమార్, సుబ్బారావు ఉన్నారు. ఎండవేడిమికి అస్వస్థతతో.. అచ్యుతాపురం (గోకవరం) : వడగాడ్పుల కారణంగా అచ్యుతాపురంలో ఆదివారం గ్రామానికి చెందిన మేడిది రాజమ్మాయి (70) మరణించింది. మధ్యాహ్నం ఇంట్లో ఉన్న సమయంలో ఎండ వేడిమికి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. లారీ డ్రైవర్ మృతి ధవళేశ్వరం : వడదెబ్బకు గురై స్థానిక క్వారీ లైన్‌కు చెందిన లారీ డైవర్ సుందరపల్లి వెంకటేశ్వరరావు(50) మరణించాడు. ప్రైవేటు సంస్థలో లారీ డ్రైవర్ అయిన వెంకటేశ్వరరావు డ్యూటీ ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం ఇంటికి చేరుకుని కుప్పకూలాడు. వైద్యునికి చూపించగా.. చనిపోయినట్టు ధ్రువీకరించారు. అతడికి భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గంటి చినపేటలో.. కొత్తపేట : మండలంలోని గంటి చినపేటకు చెందిన నేలమూర్తి చిట్టిమ్మ (70) ఆదివారం వడదెబ్బకు గురై మరణించినట్టు ఆమె బంధువులు తెలిపారు. తహశీల్దార్ ఎన్.శ్రీధర్, ఎస్సై ఎ.బాలాజీ మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. ఊడిమూడిలో.. పి.గన్నవరం : ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైన మండలంలోని ఊడిమూడికి చెందిన పసుపులేటి ముత్యాలమ్మ (55) ఆదివారం మరణించింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ప్రైవేట్ వైద్యుడి వద్దకు తరలిస్తుండగా చనిపోయింది. ఎండ తీవ్రతను తాళలేక.. పొన్నమండ(రాజోలు) : ఎండతీవ్రతను తట్టుకోలేక గ్రామానికి చెందిన బాలం సత్యనారాయణ(70) ఆదివారం వడదెబ్బతో చనిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయిన అతడికి ప్రాథమిక చికిత్స అందించేలోగా చనిపోయాడని బంధువులు తెలిపారు. మామిడికుదురు మండలం నగరానికి చెందిన ఉండ్రు సావిత్రి(76) సోంపల్లి గ్రామంలో ఉంటున్న చిన్నకుమారుడు ప్రభాకరరావు ఇంటికి వచ్చి వడదెబ్బతో చనిపోయింది. తోటకు వెళ్లొచ్చి.. అడ్డతీగల : మామిడితోట కాపు చేసే మండలంలోని గొంటువానిపాలేనికి చెందిన పల్లాల అప్పారావు(45) అనే గిరిజనుడు ఆదివారం వడదెబ్బతో చనిపోయాడు. ఉదయం తోటకు వెళ్లొచ్చిన అతడు నీరసంగా ఉందనిచెప్పి పడుకున్నాడు. సాయంత్రానికి అపస్మారక స్థితికి చేరుకుని చనిపోయాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్కవరంలో... మలికిపురం : మండలంలోని లక్కవరానికి చెందిన ముస్కూడి బలుసులు(35) ఆదివారం వడగాడ్పుల కారణంగా మరణించాడు. ఈ మేరకు అతడి కుటుంబ సభ్యులు వీఆర్వోకు సమాచారమిచ్చారు. గుడిమెళ్లంకకు చెందిన తిరుమల సత్యవతి(80), సఖినేటిపల్లిలోని జయపేట-2లో రావి చిట్టిబాబు(50) వడదెబ్బకు గురై మరణించారు. ఆస్పత్రికి తరలించేలోగా.. కోటనందూరు : మండలంలోని జగన్నాథపురంలో గోరింట నారాయణ(58) వడదెబ్బకు గురై చనిపోయాడు. ఇంటి వద్ద అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగా మరణించాడు. ఎ.కొత్తపల్లిలో.. తొండంగి : ఎ.కొత్తపల్లి ఎస్సీ కాలనీలో ఆదివారం వడదెబ్బ కారణంగా అంబుజాలపు కమ్మయమ్మ(75) మరణించింది. భర్త లేకపోవడంతో ఆమె కొంతకాలంగా కుమార్తె వద్ద ఉంటుంది. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయింది. పొలం పనులకు వెళ్లొచ్చి.. చెముడులంక (ఆలమూరు) : పొలం పనులకు వెళ్లిన కూలీ వడగాడ్పులకు అస్వస్థతకు గురై మరణించాడు. చెముడులంకకు చెందిన తమ్మన సత్యనారాయణ (52) స్థానిక లంక భూముల్లో ఆదివారం పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడికి స్థానిక వైద్యులు చికిత్స అందించేలోపే మరణించాడు. వేడిగాలులకు కుప్పకూలి.. చెల్లూరు(రాయవరం) : మండలంలోని చెల్లూరు గ్రామానికి చెందిన గుబ్బల వెంకయ్యమ్మ(69) ఆదివారం వడగాల్పులకు మృతిచెందింది. వేడిగాలులకు కుప్పకూలి పడిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వడగాడ్పులను తట్టుకోలేక.. కాపవరం (కోరుకొండ) : కాపవరం గ్రామానికి చెందిన కొండెటి సహదేవుడు (66) వడగాడ్పులు తట్టుకోలేక ఆదివారం మరణించాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరి మృతి రౌతులపూడి : వడగాడ్పులకు మండలంలో ఇద్దరు చనిపోయారు. ఎ.మల్లవరానికి చెందిన తగరపు రమణమ్మ(40), ఎస్.పైడిపాలకు చెందిన గొల్లు పెదఅప్పలనాయుడు(80) అస్వస్థతకు గురై ఆదివారం మరణించారు. రమణమ్మకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద అప్పలనాయుడుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిల్లంగిలో ఇద్దరు కిర్లంపూడి : వడగాడ్పులకు చిల్లంగి గ్రామంలో రిక్షా కార్మికుడు, వృద్ధురాలు మరణించారు. చిల్లంగికి చెందిన రిక్షా కార్మికుడు చెప్పుల బాబ్జీ(40) రిక్షా తొక్కుతూ ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బకు గురై చనిపోయాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన దిడ్డి సూర్యకాంతమ్మ (70) మధ్యాహ్నం కరెంటు లేని సమయంలో అస్వస్థతకు గురై చనిపోయింది. -
కాల్చే ఎండలు.. కరెంటు కోతలు!
యూపీలో విలవిల్లాడుతున్న ప్రజలు సబ్స్టేషన్లపై దాడి; విద్యుత్ అధికారుల నిర్బంధం మరో వారంపాటు ఇదే పరిస్థితంటున్న అధికారులు లక్నో: భానుడి భగభగలతో ఉత్తర భారతం మండిపోతూనే ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఢిల్లీల్లో శనివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూపీలోని అలహాబాద్‌లో 48.3 డిగ్రీలు, లక్నోలో 47 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాగపూర్‌లో 47.3 డిగ్రీలతో గత 11 ఏళ్లలో రికార్డు ఉష్ణోగ్రత నమోదయింది. దేశ రాజధాని ఢిల్లీలో 44.9 డిగ్రీల అత్యధిక.. 30.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది. జూన్ 10 వరకు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో వేడిమి ఈ వేసవిలోనే అత్యధికంగా 46.8 డిగ్రీలుగా ఉంది. ఎడారి ప్రాంతం చురులో 47.6, బికనూర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత హిల్‌స్టేషన్ డెహ్రాడూన్‌లోనూ శనివారం ఎండలు మండిపోయాయి. భరించలేని ఉష్ణోగ్రత, ఉక్కపోతలకు గంటల తరబడి విద్యుత్ కోతలు తోడవడంతో ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు అల్లాడుతున్నారు. మీరట్, వారణాసి, సుల్తాన్పూర్, కాన్పూర్ సహా దాదాపు రాష్ట్రమంతా శనివారం సగటు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. యూపీలోని గ్రామాల్లో 2 నుంచి 3 గంటలు, పట్టణాల్లో 10 - 12 గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్‌కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుచోట్ల ప్రజలు విధ్వంసానికి దిగారు. లక్నో దగ్గర్లోని ఒక సబ్‌స్టేషన్‌పై దాడిచేసి పలువురు ఉద్యోగస్తులను నిర్బంధించారు. గోరఖ్‌పూర్, గోండ ప్రాంతాల్లో సబ్స్టేషన్లను తగలబెట్టారు. యూపీలో సాధారణంగానే విద్యుత్ డిమాండ్ కన్నా సరఫరా తక్కువగా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పుడు డిమాండ్ మరింత పెరగడంతో అనధికార కోతలను అధికారులు అమలు చేస్తున్నారు. మరో వారంపాటు విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగుపడకపోవచ్చని ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ ప్రకటించింది. మరోవైపు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. వాటికి తోడు తీవ్రస్థాయి వేడిగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం శనివారం తేలికపాటి వర్షాలు కురిశాయని నాగ్‌పూర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. షాజపూర్‌లో 21 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది.