మళ్లీ చెలరేగిన వడగాడ్పులు | 30 People Died Due To Sunstroke In Jagannath Puram | Sakshi
Sakshi News home page

మళ్లీ చెలరేగిన వడగాడ్పులు

Published Mon, Jun 16 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

మళ్లీ చెలరేగిన వడగాడ్పులు

మళ్లీ చెలరేగిన వడగాడ్పులు

 జగన్నాథపురం (కాకినాడ) :సూర్యుడు చండప్రచండుడై మళ్లీ చెలరేగాడు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఆపసోపాలు పడ్డారు. తీవ్రమైన వడగాడ్పులు వీయడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 30 మంది మరణించారు. కాకినాడలో వడగాడ్పులకు ముగ్గురు చనిపోయారు. స్థానిక దుమ్ములపేట రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన చుక్కల భీమశంకర్(55), ఏటిమొగకు చెందిన  అంగాడి సూర్యకాంతం(65) వడగాడ్పులకు అస్వస్థతకు గురై ఆదివారం మరణించారు. స్థానిక డెయిరీ ఫారం సెంటర్ రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన రావూరి విజయకుమారి(46) వడదెబ్బకు గురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించింది.
 
 నలుగురి మృతి
 శంఖవరం : మండల కేంద్రమైన శంఖవరంలో ఆదివారం వడదెబ్బకు గురై నలుగురు చనిపోయారు. గ్రామానికి చెందిన చింతపల్లి లక్ష్మి(40), బీరా అప్పారావు(65), వెదురుపాక అచ్చియమ్మ(80) మరణించినట్టు స్థానికులు తెలిపారు. లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, అప్పారావుకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గవిరంపేటకు చెందిన అల్లి వెంకటరమణ (37) వడదెబ్బకు గురై మరణించాడు.
 
 ఇంటి వద్దే వృద్ధురాలు
 వి.సావరం(రాయవరం) : వడగాడ్పులకు గ్రామానికి చెందిన బండారు వీరయ్యమ్మ(73) ఆదివారం మధ్యాహ్నం చనిపోయింది. ఇంటి వద్ద ఉన్న ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలింది. బంధువులు సపర్యలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
 
 వడదెబ్బకు ఇద్దరి మృతి
 ప్రత్తిపాడు(ఏలేశ్వరం) : వడ దెబ్బకు గురై మండలంలో ఆదివారం ఇద్దరు మరణించారు. ప్రత్తిపాడు గ్రామంలోని ఇందిరకాలనీకి చెందిన కాకర దండెమ్మ(65) రెండు రోజులుగా ఎండలకు అస్వస్థతకు గురైంది. ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్టు ఆమె కుమారుడు షరా బందు తెలిపాడు. శరభవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ టి.వెంకట్రావు(55) పనులకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికి వచ్చి సొమ్మసిల్లి చనిపోయినట్టు ఉప సర్పంచ్ అమరాది వెంకట్రావు తెలిపారు.
 
 అస్వస్థతకు గురై..
 తొండంగి : ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై ఆదివారం గోపాపట్నంలో మొగలితిత్తి త్రిమూర్తులు(55) చనిపోయాడు. ఇంటి పనుల కోసం బయటకు వెళ్లిన అతడు.. తిరిగొచ్చాక అస్వస్థతకు గురై పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అతడికి భార్య కామేశ్వరి, కుమారులు వెంకటకుమార్, సుబ్బారావు ఉన్నారు.
 
 ఎండవేడిమికి అస్వస్థతతో..
 అచ్యుతాపురం (గోకవరం) : వడగాడ్పుల కారణంగా అచ్యుతాపురంలో ఆదివారం గ్రామానికి చెందిన మేడిది రాజమ్మాయి (70) మరణించింది. మధ్యాహ్నం ఇంట్లో ఉన్న సమయంలో ఎండ వేడిమికి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది.
 
 లారీ డ్రైవర్ మృతి
 ధవళేశ్వరం : వడదెబ్బకు గురై స్థానిక క్వారీ లైన్‌కు చెందిన లారీ డైవర్ సుందరపల్లి వెంకటేశ్వరరావు(50) మరణించాడు. ప్రైవేటు సంస్థలో లారీ డ్రైవర్ అయిన వెంకటేశ్వరరావు డ్యూటీ ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం ఇంటికి చేరుకుని కుప్పకూలాడు. వైద్యునికి చూపించగా.. చనిపోయినట్టు ధ్రువీకరించారు. అతడికి భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
 గంటి చినపేటలో..
 కొత్తపేట : మండలంలోని గంటి చినపేటకు చెందిన నేలమూర్తి చిట్టిమ్మ (70) ఆదివారం వడదెబ్బకు గురై మరణించినట్టు ఆమె బంధువులు తెలిపారు. తహశీల్దార్ ఎన్.శ్రీధర్, ఎస్సై ఎ.బాలాజీ మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.
 
 ఊడిమూడిలో..
 పి.గన్నవరం : ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైన మండలంలోని ఊడిమూడికి చెందిన పసుపులేటి ముత్యాలమ్మ (55) ఆదివారం మరణించింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ప్రైవేట్ వైద్యుడి వద్దకు తరలిస్తుండగా చనిపోయింది.
 
 ఎండ తీవ్రతను తాళలేక..
 పొన్నమండ(రాజోలు) : ఎండతీవ్రతను తట్టుకోలేక గ్రామానికి చెందిన బాలం సత్యనారాయణ(70) ఆదివారం వడదెబ్బతో చనిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయిన అతడికి ప్రాథమిక చికిత్స అందించేలోగా చనిపోయాడని బంధువులు తెలిపారు. మామిడికుదురు మండలం నగరానికి చెందిన ఉండ్రు సావిత్రి(76) సోంపల్లి గ్రామంలో ఉంటున్న చిన్నకుమారుడు ప్రభాకరరావు ఇంటికి వచ్చి వడదెబ్బతో చనిపోయింది.
 
 తోటకు వెళ్లొచ్చి..
 అడ్డతీగల : మామిడితోట కాపు చేసే మండలంలోని గొంటువానిపాలేనికి చెందిన పల్లాల అప్పారావు(45) అనే గిరిజనుడు ఆదివారం వడదెబ్బతో చనిపోయాడు. ఉదయం తోటకు వెళ్లొచ్చిన అతడు నీరసంగా ఉందనిచెప్పి పడుకున్నాడు. సాయంత్రానికి అపస్మారక స్థితికి చేరుకుని చనిపోయాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
 లక్కవరంలో...
 మలికిపురం : మండలంలోని లక్కవరానికి చెందిన ముస్కూడి బలుసులు(35) ఆదివారం వడగాడ్పుల కారణంగా మరణించాడు. ఈ మేరకు అతడి కుటుంబ సభ్యులు వీఆర్వోకు సమాచారమిచ్చారు. గుడిమెళ్లంకకు చెందిన తిరుమల సత్యవతి(80), సఖినేటిపల్లిలోని జయపేట-2లో రావి చిట్టిబాబు(50) వడదెబ్బకు గురై మరణించారు.
 
 ఆస్పత్రికి తరలించేలోగా..
 కోటనందూరు : మండలంలోని జగన్నాథపురంలో గోరింట నారాయణ(58) వడదెబ్బకు గురై చనిపోయాడు. ఇంటి వద్ద అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగా మరణించాడు.
 
 ఎ.కొత్తపల్లిలో..
 తొండంగి : ఎ.కొత్తపల్లి ఎస్సీ కాలనీలో ఆదివారం వడదెబ్బ కారణంగా అంబుజాలపు కమ్మయమ్మ(75) మరణించింది. భర్త లేకపోవడంతో ఆమె కొంతకాలంగా కుమార్తె వద్ద ఉంటుంది. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయింది.
 
 పొలం పనులకు వెళ్లొచ్చి..
 చెముడులంక (ఆలమూరు) : పొలం పనులకు వెళ్లిన కూలీ వడగాడ్పులకు అస్వస్థతకు గురై మరణించాడు. చెముడులంకకు చెందిన తమ్మన సత్యనారాయణ (52) స్థానిక లంక భూముల్లో ఆదివారం పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడికి స్థానిక వైద్యులు చికిత్స అందించేలోపే మరణించాడు.
 
 వేడిగాలులకు కుప్పకూలి..
 చెల్లూరు(రాయవరం) : మండలంలోని చెల్లూరు గ్రామానికి చెందిన గుబ్బల వెంకయ్యమ్మ(69) ఆదివారం వడగాల్పులకు మృతిచెందింది. వేడిగాలులకు కుప్పకూలి పడిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
 
 వడగాడ్పులను తట్టుకోలేక..
 కాపవరం (కోరుకొండ) : కాపవరం గ్రామానికి చెందిన కొండెటి సహదేవుడు (66) వడగాడ్పులు తట్టుకోలేక ఆదివారం మరణించాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
 ఇద్దరి మృతి

 రౌతులపూడి : వడగాడ్పులకు మండలంలో ఇద్దరు చనిపోయారు. ఎ.మల్లవరానికి చెందిన తగరపు రమణమ్మ(40), ఎస్.పైడిపాలకు చెందిన గొల్లు పెదఅప్పలనాయుడు(80) అస్వస్థతకు గురై ఆదివారం మరణించారు. రమణమ్మకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద అప్పలనాయుడుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
 
 చిల్లంగిలో ఇద్దరు
 కిర్లంపూడి : వడగాడ్పులకు చిల్లంగి గ్రామంలో రిక్షా కార్మికుడు, వృద్ధురాలు మరణించారు. చిల్లంగికి చెందిన రిక్షా కార్మికుడు చెప్పుల బాబ్జీ(40) రిక్షా తొక్కుతూ ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బకు గురై చనిపోయాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన దిడ్డి సూర్యకాంతమ్మ (70) మధ్యాహ్నం కరెంటు లేని సమయంలో అస్వస్థతకు గురై చనిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement