నేడు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు
ఆదిలాబాద్‌లో 44.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. రోజురోజుకూ వడగాడ్పుల తీవ్రత పెరుగుతూఉంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్‌కు మించి పగటి ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని వివరించింది. కాగా, మంగళవారం ఆదిలాబాద్‌లో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల లోనూ 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో 43, హైదరాబాద్, భద్రాచలం, రామగుండంలో 42, ఖమ్మంలో 41, హకీంపేటలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 4.7 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బతో 13 మంది మృతి
సాక్షి, నెట్‌వర్క్: మండుతున్న ఎండలు మంగళవారం వేర్వేరుచోట్ల 13 మందిని బలిగొన్నాయి. వడదెబ్బకు తాళలేక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం ఐదుగురు మృత్యువాత పడ్డారు. వైరా మండలం జింకలగూడేనికి చెందిన షేక్ బేగంబీ(75), ఇదేమండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన తాటి జగన్నాథం(70), దుమ్ముగూడెం మండలం చినబండిరేవు గ్రామానికి చెందిన బుద్దా రామయ్య (60), సత్తుపల్లి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వేముల కొండమ్మ(85), తల్లాడ మండల పరిధిలోని అన్నారుగూడేనికి చెందిన తాళ్లూరి గోపులు (45) ఎండవేడిమికి తట్టుకోలేక చనిపోయారు.
అలాగే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం వడదెబ్బతో ఐదుగురు మృత్యువా తపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం లోని అనుగొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్(60), నవాబుపేట మండలం కాకర్‌జాల్ తండాకు చెందిన టీక్యానాయక్ (42) అనే ఉపాధి కూలీ, నాగర్‌క ర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరుకు చెందిన ఉపాధి కూలీ పాశం మల్లయ్య(46) మృతిచెందారు.
వనపర్తి జిల్లా వనపర్తి మండలం రాజపేటకు చెందిన గొడుగు కురుమయ్య(60), పెద్దమందడి మండలం వీరాయపల్లికి చెందిన బోయ లొట్టి చెన్నయ్య (60) మృతిచెందారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ దాసారపు భద్రమ్మ (37), రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం సర్ధాపూర్ గ్రామానికి చెందిన దడిగెల వెంకటమ్మ (60), పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన పోశవేని రాజమ్మ(70)కూడా వడదెబ్బతో మరణించారు.