
‘అవకాశం, కరువు’ ఇక వినపడవు!
భారత వాతావరణ శాఖ ‘అవకాశం’ అన్న పదానికి కత్తెర వేసింది. వాతావరణ సూచనల్లో వర్షం కురిసే ‘అవకాశం’
వాతావరణ సూచనల నిర్వచనాలకు మార్పులు
సాక్షి, హైదరాబాద్: భారత వాతావరణ శాఖ ‘అవకాశం’ అన్న పదానికి కత్తెర వేసింది. వాతావరణ సూచనల్లో వర్షం కురిసే ‘అవకాశం’ ఉంది.. వడగాల్పులు వీయవచ్చు వంటి పదాలను తొలగించి కచ్చితమైన అంచనాలు జారీ చేయాలని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) నిర్ణయించింది. మరికొన్ని నిర్వచనాలకూ మార్పులు చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ‘అసాధారణ’, ‘దేశవ్యాప్త వర్షాలు’ పదాలను వాడనున్నారు. శాస్త్రీయ విశ్లేషణతో నిర్వచనాలను సరిచేశామని కేంద్ర ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వశాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే వీలుందని చెప్పడం మానేసి ఎక్కడెక్కడ వానలు పడతాయో తెలపనున్నారు.
‘కరువు’కు బైబై...
దేశంలో కరువు ఛాయలు నెలకొన్నాయన్న మాటలు ఇకపై ఉండవు. కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువ వర్షం నమోదైనా దేశమంతా కరువు ఉండదన్న ఆలోచనతో ఐఎండీ ఈ నిర్ణయం తీసుకుంది. రుతుపవనాల వర్షపాతాన్ని 5 భాగాలుగా వర్గీకరించారు. దీర్ఘకాలపు సగటుకు పది శాతం వరకూ ఎక్కువ లేదా తక్కువ వానలు కురిస్తే దాన్ని ‘సాధారణ’ వర్షపాతం అని, పదిశాతం కంటే తక్కువ నమోదైతే ‘సాధారణ వర్షపాతం కంటే తక్కువ’ అని, సాధారణ వర్షపాతం కంటే పది శాతం ఎక్కువ వర్షాలు కురిస్తే ‘సాధారణం కంటే ఎక్కువ’ అని అంటారు. దేశంలో 40 శాతం కంటే ఎక్కువ ప్రాంతాల్లో పది నుంచి 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైతే ‘వర్షపాతం లోటు’ అని, పదిశాతం కంటే తక్కువ వర్షపాతం కురిస్తే ‘అతి వర్షపాతం లోటు’ అని అంటారు. అతిభారీ వర్షపాతం అన్న అంశానికి ఇకపై 20 సెంటీమీటర్ల వర్షాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.
వడగాడ్పులు, చలిగాలులకూ కోతలు..
దేశమంతా వడగాడ్పులు, చలిగాలుల పరిస్థితులున్నాయని చెప్పే ఉష్ణోగ్రతలను ఐఎండీ ప్రామాణీకరించింది. ఇప్పటివరకూ ఆయా ప్రాంతాల్లోని గరిష్ట, కనిష్ట సగటులను బట్టి 40 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే వడగాడ్పులని, పది డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలుంటే చలిగాలులు అని పిలిచేవారు. ఇకపై ఇలా కాకుండా సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎంత తక్కువ, లేదా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అన్న విషయం ఆధారంగా వీటిని నిర్ణయించనున్నారు. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే 4.5 - 6.4 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల ఉంటే వడగాడ్పుగా, కనిష్ట ఉష్ణోగ్రతకు ఇంతే స్థాయిలో తక్కువ ఉష్ణోగ్రత నమోదైతే చలిగాలిగా వర్ణిస్తారు. 6.4 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైతే తీవ్రమైన వడగాడ్పుగా, తక్కువ నమోదైతే అతిశీతలగాలులుగా పేర్కొంటారు. 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పరిస్థితులను వడగాడ్పులుగానూ, నాలుగు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న పరిస్థితులను కోల్డ్‌వేవ్/ చలిగాలులుగా వర్ణిస్తారు.