
ఏపీలో 3 రోజులు నిప్పులే
తెల్లవారడమే ఆలస్యం రాష్ట్రంలో నిప్పుల వాన కురుస్తోంది. దీనికి తోడు వడగాడ్పుల బెడద కూడా కొనసాగుతోంది.
28 వరకు తీవ్ర వడగాడ్పులు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ
సాక్షి, హైదరాబాద్/ నెట్‌వర్క్: తెల్లవారడమే ఆలస్యం రాష్ట్రంలో నిప్పుల వాన కురుస్తోంది. దీనికి తోడు వడగాడ్పుల బెడద కూడా కొనసాగుతోంది. వీటికి ఉపరితల ద్రోణి తోడై వేడి సెగలకు మరింత ఆజ్యం పోస్తోంది. దీంతో సాధారణంకంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలు భగభగలాడుతున్నాయి. తాజాగా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రమంతా మంగళవారం నుంచి 28 వరకు తీవ్ర వడగాడ్పులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సోమవారం హెచ్చరించింది. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలకు తీవ్ర వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం. తిరుపతిలో సోమవారం రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం నమోదైన 45.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత (ఆల్‌టైమ్ రికార్డు)ను చెరిపేసి సోమవారం 46.2 డిగ్రీలునమోదైంది.
భానుడి ప్రతాపానికి 77 మంది బలి: భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సోమవారం ఒక్క రోజే 77 మందిని వడదెబ్బ బలితీసుకుంది. కాగా హాల్‌టికెట్ కోసం కాలేజీకి వెళ్లిన కనికిచర్ల మణికంఠ(20) అనే విద్యార్థి వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగింది.