CM KCR Review Meeting Highlights Over Floods Situations In Telangana, Details Inside - Sakshi
Sakshi News home page

CM KCR Review Meeting: ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలి 

Published Tue, Jul 12 2022 12:49 AM | Last Updated on Tue, Jul 12 2022 2:58 PM

CM KCR Holds Review Meeting On Flood Situations In Telangana - Sakshi

భారీ వర్షాలపై ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచనలు ఇస్తున్న సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మరో రెండు మూడురోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, అప్రమత్తతతో వ్యవహరించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

గోదావరి పరీవాహక ప్రాంతాలతో పాటు జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ ప్రాంతాల పరిధిలో ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలు, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్‌లో ఆదివారం నాటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని సోమవారం కూడా సీఎం కొనసాగించారు. మంత్రులు, ప్రజాప్రతి నిధులతో ఫోన్‌లో మాట్లాడారు. వరద ముప్పు ఉన్న జిల్లాల అధికారులను అడిగి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. గోదావరి, ఉప నదుల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు. సమాచారాన్ని స్క్రీన్‌ మీద పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. 

గోదావరి వరదను ఎప్పటికప్పుడు దిగువకు వదలాలి.. 
మహారాష్ట్రలో, రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఇరిగేషన్‌ శాఖ ఈఎన్సీ సి.మురళీధర్‌ రావుకు కేసీఆర్‌ సూచించారు. బ్యాక్‌ వాటర్‌తో ముంపునకు గురికాకుండా చూసుకోవాలన్నారు. మరో వారం పదిరోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అధికారులకు సహకరిస్తూ, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.  

పువ్వాడకు ఫోన్‌.. 
గడచిన రెండురోజుల్లో వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన రక్షణ చర్యలను సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. నిజామాబాద్, ములుగు, రామన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అయినా పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. దీంతో అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి మూడవ ప్రమాద హెచ్చరిక ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం కూడా భద్రాచలంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, భద్రాచలం పర్యటనలో వున్న స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కేసీఆర్‌ ఫోన్లో ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండండి 
రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, జనగాం తదితర ప్రాంతాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఆ ప్రాంతాలను విడిచి వెళ్లొద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో సమీక్షించుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి సూచించారు. గోదావరి వరదల నేపథ్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని, స్థానిక మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డిలకు చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement