యాదాద్రి భువనగిరి జిల్లా నెమలికాల్వ వద్ద మూసీ ఉధృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని వాన కష్టాలు వీడటంలేదు. మూసీ నది ఉగ్రరూపం దా ల్చడంతో దాని పరీవాహక ప్రాంతాలతో పాటు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరదనీ టిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలి అత్యవసర బృందాలు శ్రమిస్తున్నాయి. బుధవా రం సుమారు 200కు పైగా బస్తీల్లో వరదనీరు చేరింది. మూసీ ఉధృతి కారణంగా చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జి, మూసారాంబాగ్ ప్రాంతాల్లో నదిపై ఉన్న వంతెనల పైనుంచి వరద నీరు ఉప్పొంగింది. దీంతో ఆయా మార్గాల్లో పలు బ్రిడ్జిలను మూసివేశారు. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దారులు మూసుకు పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముంచెత్తిన వరద..
బుధవారం గండిపేట్ జలాశయానికి సంబంధించి 13 గేట్లు, హిమాయత్‌సాగర్‌లో 8 గేట్లను ఎత్తివేశా రు. దీంతో మూసీలో వరదనీటి ఉధృతి అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్‌లో మూసీ ప్రవహించే బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ) మార్గంలో మునుపెన్నడూ లేనివిధంగా వరద ముంచెత్తింది. అలాగే మూసానగర్, కమలానగర్ పరిసరాలను వరదనీరు చుట్టేసింది. అంబర్‌పేట్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి సు మారు 2 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
వచ్చే 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం
బుధవారం రాత్రి 7 గంటల వరకు నగరంలో పలుచోట్ల 5 నుంచి 8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి.
మూసీ ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తివేత
కేతేపల్లి: నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు పోటెత్తింది. దీంతో బుధవారం రాత్రి ఎనిమిది క్రస్ట్ గేట్లను రెండు అడుగులు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 636.80 అడుగుల వద్ద ఉంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. అక్కడి నుంచి వచ్చే వరదనీరు బుధవారం రాత్రి మూసీ రిజర్వాయర్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment