మళ్లీ ముసిరిన వాన | Weather Report: Heavy Rains Lashes Telangana | Sakshi
Sakshi News home page

మళ్లీ ముసిరిన వాన

Published Fri, Oct 7 2022 1:52 AM | Last Updated on Fri, Oct 7 2022 1:52 AM

Weather Report: Heavy Rains Lashes Telangana - Sakshi

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో దొడగుంటపల్లి ఊరచెరువుకు పడిన గండి  

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రంపై వాన ముసురుకుంది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలూ నమోదయ్యా యి. దసరా పండుగ రోజూ మధ్యాహ్నం నుంచి వాన ప్రతాపం చూపించింది. దీనితో సాధారణ జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇళ్లకే పరిమి తమయ్యారు. నైరుతి సీజన్‌ ముగిసి ఈశాన్య రుతుపవనా ల సీజన్‌ మొదలైనా.. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసా గుతోందని వాతావరణ నిపుణు లు తెలిపారు.

దీనికితోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం మధ్యా హ్నం మొదలైన వాన లు మధ్యలో కాస్త తెరిపినిస్తూ.. గురువారం రాత్రి వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లో అత్యధికంగా 12.18 సెంటీమీటర్లు, చుక్కాపూర్‌లో 11.70 సెంటీమీటర్లు వర్షపాతం నమోంది. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్‌ జిల్లాలతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో చాలాచోట్ల భారీ వర్షం పడింది. హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట)కు వరద వస్తోంది.


 పాలమూరులోని రాయచూర్‌ రహదారిపై వర్షపునీటిలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు 

తడిసిముద్దయిన పాలమూరు
కుండపోత వానలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తడిసి ముద్దయింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి, రోడ్లపై భారీగా వరద నిలిచింది. బండర్‌పల్లి వాగు పొంగడంతో మహబూబ్‌ నగర్‌–రాయచూర్‌ ప్రధాన రహదారి భారీగా వరద చేరింది. జిల్లావ్యాప్తంగా సగటున 3.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వందల ఎకరాల పంటలు నీటమునిగాయి. ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దుందుభి, నల్లవాగు, పెద్దవాగు ప్రమాదకర స్థాయిలో పారు తున్నాయి. భారీగా పంటలకు నష్టం జరిగింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి చెరువుకు గండిపడింది. మంత్రి నిరంజన్‌రెడ్డి నీట మునిగిన పంటలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.


ధారూరు మండలం నాగారం వాగులో కొట్టుకుపోయిన కారు 

వికారాబాద్‌లో కుండపోత
వికారాబాద్‌ జిల్లాలో బుధవారం రాత్రి మొదలైన వాన గురువారం రాత్రివరకు కురుస్తూనే ఉంది. దీనితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొడంగల్‌లో చెరువు కట్ట తెగిపోవడంతో కుమ్మరి గేరి, బాలాజీనగర్‌ కాలనీలు నీట మునిగాయి. మరికొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. మూసీ, కాగ్నా, వాటి ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ధారూరు మండలం నాగరం సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. కొంతదూరంలో కారు చెట్టుకు తట్టుకోవటంతో అందులోని ఇద్దరు చెట్లకొమ్మలు పట్టుకుని బయటపడ్డారు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీలో మహాదేవలింగేశ్వర స్వామి ఆలయం నీట మునిగింది.


వికారాబాద్‌ జిల్లా జీవన్గీలో మహాదేవలింగేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుముట్టిన కాగ్నానది 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ..
రెండు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. దసరా వేడుకలకు ఇబ్బంది ఎదురైంది. మధిరలో రైల్వే అండర్‌ బ్రిడ్జి నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏన్కూరు, సత్తు పల్లి, నేలకొండపల్లి మండలాల్లోనూ రహదారులపై వరద పారింది. వర్షాలతో పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటి ల్లుతోందని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ చాలా ప్రాంతాల్లో వానలు పడ్డాయి. వాన ధాటికి కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన సగ్గిల శ్రీనివాస్‌ ఇల్లు కూలిపోయింది.

మరో 2 రోజులూ వానలు
కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురుస్తాయ ని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, మహబూబ్‌ నగర్, నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు.. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement