సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడురోజులు అక్కడక్కడ అతిభారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తు తం రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ద్రోణి బికనీర్, కోటా, రైసెన్, రాయ్‌పూర్, దిఘా మీదుగా ఆగ్నేయ దిశ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఉపరితల ద్రోణికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి సగటున 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వివరించింది. ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో గత రెండ్రోజులుగా భారీ వర్షా లు నమోదవుతుండగా.. రానున్న మూడు రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..
వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి సీజన్ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మరింత జోరందుకునే అవకాశం ఉందని పేర్కొంది.
ఈనెల రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 40.42 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయానికి 74.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటు సాధారణ వర్షపాతం కంటే 84 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
ఇక నైరుతి సీజన్ పూర్తయ్యే నాటికి రాష్ట్రవ్యాప్తంగా 72.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటికే అంతకు మించి వర్షపాతం నమోదు అయింది. ఈ నేపథ్యంలో సీజన్ ముగిసే నాటికి రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment