న్యూఢిల్లీ: అన్నదాతకు శుభవార్త. మరో నాలుగు లేదా అయిదు రోజుల్లో దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే ఈసారి అధిక వర్షాపాతం నమోదు అవుతుందని ఐఎండీ డైరెక్టర్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ గురువారమిక్కడ తెలిపారు.
దక్షిణ భారత దేశంలో 6 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించింది. దేశవ్యాప్తంగా జూలై నెలలో సుమారు 107 శాతం వర్షపాతం నమోదు అవుతుందని, ఆగస్టులో 104 శాతం, వాయవ్య ప్రాంతంలో 108 శాతం వర్షం నమోదు కానుంది. అలాగే మధ్య భారత్‌లో 113 శాతం, ద్వీప ప్రాంతాల్లో 113 శాతం, ఈశాన్య రాష్ర్టాల్లో 94 శాతం వర్షం నమోదు కానున్నట్లు ఐఎండీ తెలిపింది.
కాగా కేరళను తాకిన నాలుగైదు రోజుల్లో రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. ప్రవేశ సమయంలోనే రాష్ట్రమంతటా జల్లులు కురువనున్నాయి. నైరుతి రుతు పవనాలు క్రమంగా బలం పుంజుకుని జులై, ఆగస్టులో అధిక వర్షపాతం ఇస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. గతేడాది నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన తర్వాత కూడా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.