
న్యూఢిల్లీ: దేశంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కంటే సగటున 20 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య భారతంలో 29 శాతం వర్షపాతం తక్కువగా నమోదవగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
వాయువ్య రాష్ట్రాల్లో ఏకంగా సాధారణం కంటే 68 శాతం తక్కువ వర్షపాతం రికార్డవగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 20 శాతం తక్కువ వర్షం పడింది. సాధారణంగా జూన్ 1 నుంచి జులై 8వ తేదీ దాకా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో పడే వర్షాలను సమ్మర్ వర్షాలుగా పిలుస్తారు.
ఇవి రైతులు విత్తనాలు విత్తుకునేందుకు కీలకమైన వర్షాలు. ‘రుతుపవనాల విస్తరణకు కాస్త బ్రేక్ పడింది. అవి కాస్త బలహీనమయ్యాయి. అయితే అవి ఎప్పుడు బలపడతాయో అప్పుడు కొద్ది సమయంలోనే కుండపోత వర్షాలు కురుస్తాయి’అని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు.