సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు శుక్రవారం తెలంగాణలోకి ప్రవేశించాయి. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 4–8 తేదీల మధ్య రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశిస్తుందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా నిజమైంది. రుతుపవనాలు ఒకేసారి రాష్ట్రమంతటా విస్తరించడం శుభపరిణామమని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
భారీ వర్షాలు...
రుతుపవనాల రాకతో గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాలలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవగా, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 13 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో 10 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షం కురిసింది. జూన్ 1 నుంచి 8 వరకు రాష్ట్రంలో సాధారణంగా 24.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 53.4 మిల్లీమీటర్లు రికార్డయింది. అంటే 147 శాతం అధికంగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
14 వరకు సాధారణ వర్షాలు..
రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో సాధా రణం నుంచి అధిక వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. 15 నుంచి నెలాఖరు వరకు తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment