ముంబై : ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గురువారం ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం కూడా స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని నగరవాసులను వాతావరణ శాఖ హెచ్చరించింది. పుణేలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. ఈ హెచ్చరికతో బొంబై మున్సిపల్ కార్పొరేషన్ తన ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు రద్దు చేసింది. ఈ భారీ వర్షాలకు ఇబ్బందులు పడే ప్రజలకు సేవలందించాలని ఆదేశాలు జారీచేసింది.
అంతేకాక అత్యవసర సమయంలో తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానిక వాతావరణ కేంద్ర ఇచ్చే వెదర్ అప్‌డేట్లను ఎప్పడికప్పుడూ తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జూన్ 8 నుంచి జూన్ 12 వరకు అరేబియా సముద్రంలోని పలుచోట్ల వేటకు వెళ్లవద్దని చెప్పింది. కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
మరోవైపు కుండపోతగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ముంబైకి ఎయిర్‌లైన్ సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. లండన్ నుంచి ముంబై వచ్చే జెట్‌ఎయిర్‌వేస్ విమానాన్ని కూడా అహ్మదాబాద్ విమానశ్రయానికి తరలించారు. ముందస్తుగా వచ్చిన ఈ రుతుపవనాలతో థానే, పాల్గఢ్, రాయ్‌ఘడ్, రత్నగిరి ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో, భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. అత్యవసర సమయంలో ముంబైవాసులు 1916కు, ముంబై బయటివారు 1077కు ఫోన్ చేయవచ్చని బీఎంసీ తెలిపింది. సెంట్రల్ అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాలు, గోవా, మరిన్ని కర్ణాటక, రాయమలసీమ ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రానున్న 24 గంటల్లో రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment