ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీరం దాటేసిన ఫొని | Cyclone Fani Turns Extremely Severe Cyclone | Sakshi
Sakshi News home page

ప్రచండ తుపానుగా మారిన ఫొని

Published Fri, May 3 2019 3:15 AM | Last Updated on Fri, May 3 2019 11:45 AM

Cyclone Fani Turns Extremely Severe Cyclone - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో పెను విధ్వంసం సృష్టించే దిశగా పయనిస్తున్న  ఫొని పెను తుపాన్‌ శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ తీరం దాటింది. ఒడిశా రాష్ట్రంలోకి ప్రవేశించిన ఫొని తుపాను గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పెను తుపానుగా కొనసాగుతూ గురువారం రాత్రి ప్రచండ తుపాను (సూపర్‌ సైక్లోన్‌)గా బలపడిన ఫొని ప్రచండ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయ నిస్తూ బలం పుంజుకుంటోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని పెను తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది.

గురువారం రాత్రికి విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పూరీకి దక్షిణ నైరుతి దిశగా 275 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం ఉదయం 10–11 గంటల మధ్య ఒడిశాలోని పూరీ సమీపంలో బలుగోడు వద్ద పెను తుపానుగానే తీరాన్ని దాటనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది. పెను తుపాను తీరాన్ని దాటాక ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ తీవ్ర తుపానుగా బలహీనపడి పశ్చిమ బెంగాల్‌ తీరంలోకి ప్రవేశించనుంది. క్రమంగా బలహీనపడుతూ బంగ్లాదేశ్‌ మీదుగా అస్సాంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. 

తీర ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ 
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 170–180 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 200 కిలోమీటర్లకు పైగా గరిష్ట వేగానికి చేరే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇవి 115 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు శుక్రవారం బయటకు వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్టీజీఎస్‌) సూచించింది. ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. ఒడిశాలో తుపాను భూమిని తాకే (తీరం దాటే) ప్రాంతం చాలాదూరం సమతలంగా ఉన్నందున ఉప్పెన ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు గోపాల్‌పూర్‌ డాప్లర్‌ రాడార్‌ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే జరిగితే ఒడిశాలో నష్టం తీవ్రంగా ఉండడం ఖాయం.  

పదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ 
భీమిలి, కళింగపట్నం పోర్టుల్లో అత్యంత ప్రమాదకరమైన పదో నంబరు ప్రమాద హెచ్చరికలను వాతావరణ శాఖ గురువారం జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో ప్రమాదకరమైన ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, వాడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గాలివానలు కొనసాగుతున్నాయి. కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది. 


శ్రీకాకుళంలో ఈదురు గాలుల ధాటికి ఊగుతున్న చెట్లు 

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి 
విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గాలుల వేగం, వర్షం తీవ్రతకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూరిళ్లు నేలకూలుతాయని, పైకప్పు రేకులు ఉంటే లేచి పోయే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్తు స్తంభాలు వంగిపోవడం, నేలకూలడం వల్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొంది. రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించింది. మామిడి, అరటి, జీడి, కొబ్బరి వంటి తోటలు కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలిసింది. కోస్తా ప్రాంతాల్లో మొబైల్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించింది.
 
ఒడిశా నుంచి వచ్చే వరద నీటితో గండం  
ఒడిశాలో తుపాను తీరం దాటనుండడం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అక్కడి నుంచి వంశధార, మహేంద్రతనయ నదులు శ్రీకాకుళం జిల్లాలోకి ఉప్పొంగే ప్రమాదం ఉంది. పూరీ జిల్లా బ్రహ్మగిరి సమితి బలుకుండో వద్ద శుక్రవారం మధ్యాహ్నం 11–12 గంటల తుపాను మధ్య తీరం దాటే అవకాశం ఉందని గోపాల్‌పూర్‌ డాప్లర్‌ రాడార్‌ కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ సమీక్షించింది. ఇప్పటికే శ్రీకాకుళం, ఒడిశా తీరం వెంబడి వర్షాలు కురుస్తున్నాయి.

ఒడిశాలో ఉప్పెన తప్పదా? 
ఒడిశాకు తుపానుతో పాటు ఉప్పెన ముప్పు కూడా పొంచి ఉందని గోపాల్‌పూర్‌ డాప్లర్‌ రాడార్‌ కేంద్రం అధికారులు బాంబు పేల్చారు. ఒడిశాలో ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ‘ఫొని’ తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకూ రాకాసి అలలు ఎగిసిపడే అవకాశముందని వాతావరణ అధికారులు అంటున్నారు. తుపాను తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసిన ఒడిశాలోని పూరీ జిల్లా బ్రహ్మగిరి సమితి బలుకుండో ప్రాంతం చాలా సమతలంగా ఉంటుంది. సాధారణంగా సమతల ప్రాంతంలో అధిక తీవ్రత గల తుపాన్లు సంభవిస్తే ఉప్పెన ప్రమాదం పొంచి ఉంటుంది. అలల తీవ్రతకు సముద్ర జలాలు గ్రామాల్లోకి పొంగిపొర్లడాన్ని ఉప్పెన అంటారు. సమతల భాగంలో తుపాను తీరం దాటితేనే ఇలా ఉప్పెన ముప్పు ఉంటుందని ఒడిశాలోని గోపాల్‌పూర్‌ డాప్లర్‌ రాడార్‌ కేంద్రం డైరెక్టర్‌ ఉమాశంకర్‌ దాస్‌ తెలిపారు. ‘‘పూరీ నుంచి జగత్‌సింగ్‌పూర్‌ వరకు 175 కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీరం మొత్తం సమతల భూభాగమే ఉంది. అందువల్ల ఫోని తుపాను వల్ల ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నాం. పూరీ–జగత్‌సింగ్‌పూర్‌ మధ్య బ్రహ్మగిరి, కృష్ణప్రసాద్, యరసమ, మహాకాలపడ, పారాదీప్‌ ప్రాంతాల్లో ఈ ముప్పు పొంచి ఉంది’’ అని దాస్‌ పేర్కొన్నారు. 

ఒడిశాలో 5 నదులకు వరద ముప్పు 
‘‘తుపాను ప్రభావం వల్ల ఒడిశా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తుపాను తీరం దాటే సమయంలో శుక్రవారం ఒక్కరోజే 25 నుంచి 30 సెంటీమీటర్లు (250 నుంచి 300 మిల్లీమీటర్ల) రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అకాశం ఉంది. దీంతో ఒడిశాలోని మహానది, వైతరణి, రుషికుయ్య, సురవర్ణరేఖ, దేవీ నదులతోపాటు వాటి ఉప నదులకు కూడా వరద ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి’’ అని ఐఎండీ హెచ్చరించింది. 

ఎక్కడి రైళ్లు అక్కడే.. 
ఫొని తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ అప్రమత్తమైంది. హౌరా, భువనేశ్వర్‌ల నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై వైపునకు వెళ్లే 74 రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న రైళ్లను ప్రధాన రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు.   

సహాయక చర్యలకు నౌకాదళం సిద్ధం 
ఫొని తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధమైంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నం నుంచి ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్, ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ యుద్ధ నౌకలను సహాయక సామగ్రితోపాటు వైద్య బృందాలను సిద్ధం చేసినట్లు ఈఎన్‌సీ అధికారులు తెలిపారు. దీంతో పాటు అదనపు సహాయక సామగ్రి, వైద్య బృందాలు, డైవింగ్‌ టీమ్‌లను విశాఖ నుంచి ఒడిశాకు రోడ్డు మార్గంలో పంపిస్తున్నట్లు వెల్లడించారు. తుపాను తీరం దాటే ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు ఒక ఎయిర్‌ క్రాఫ్ట్‌ని విశాఖలో సిద్ధంగా ఉంచామన్నారు. టెంట్‌లు, దుస్తులు, మందులు, దుప్పట్లను బాధిత ప్రాంతాల ప్రజలకు అందించనున్నట్లు నౌకాదళ వర్గాలు వివరించాయి.
 
అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం 
ఫోని తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సహాయక కార్యక్రమాల నిమిత్తం జాతీయ విపత్తు సహాయక బృందాలు(ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు సహాయక దళాలు (ఎస్డీఆర్‌ఎఫ్‌)లను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలకు చెందిన 15,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. విద్యుత్‌ స్తంభాలు, వైర్లు పడిపోతే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు విద్యుత్తు శాఖ అవసరమైన పనిముట్లను, సిబ్బందిని సిద్ధంగా ఉంచింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement