super cyclone
-
ఆంధ్రప్రదేశ్ తీరం దాటేసిన ఫొని
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో పెను విధ్వంసం సృష్టించే దిశగా పయనిస్తున్న ఫొని పెను తుపాన్ శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది. ఒడిశా రాష్ట్రంలోకి ప్రవేశించిన ఫొని తుపాను గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పెను తుపానుగా కొనసాగుతూ గురువారం రాత్రి ప్రచండ తుపాను (సూపర్ సైక్లోన్)గా బలపడిన ఫొని ప్రచండ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయ నిస్తూ బలం పుంజుకుంటోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని పెను తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. గురువారం రాత్రికి విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పూరీకి దక్షిణ నైరుతి దిశగా 275 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం ఉదయం 10–11 గంటల మధ్య ఒడిశాలోని పూరీ సమీపంలో బలుగోడు వద్ద పెను తుపానుగానే తీరాన్ని దాటనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది. పెను తుపాను తీరాన్ని దాటాక ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ తీవ్ర తుపానుగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ తీరంలోకి ప్రవేశించనుంది. క్రమంగా బలహీనపడుతూ బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 170–180 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 200 కిలోమీటర్లకు పైగా గరిష్ట వేగానికి చేరే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇవి 115 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు శుక్రవారం బయటకు వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) సూచించింది. ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఒడిశాలో తుపాను భూమిని తాకే (తీరం దాటే) ప్రాంతం చాలాదూరం సమతలంగా ఉన్నందున ఉప్పెన ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే జరిగితే ఒడిశాలో నష్టం తీవ్రంగా ఉండడం ఖాయం. పదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ భీమిలి, కళింగపట్నం పోర్టుల్లో అత్యంత ప్రమాదకరమైన పదో నంబరు ప్రమాద హెచ్చరికలను వాతావరణ శాఖ గురువారం జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో ప్రమాదకరమైన ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, వాడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గాలివానలు కొనసాగుతున్నాయి. కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది. శ్రీకాకుళంలో ఈదురు గాలుల ధాటికి ఊగుతున్న చెట్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గాలుల వేగం, వర్షం తీవ్రతకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూరిళ్లు నేలకూలుతాయని, పైకప్పు రేకులు ఉంటే లేచి పోయే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్తు స్తంభాలు వంగిపోవడం, నేలకూలడం వల్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొంది. రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించింది. మామిడి, అరటి, జీడి, కొబ్బరి వంటి తోటలు కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలిసింది. కోస్తా ప్రాంతాల్లో మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించింది. ఒడిశా నుంచి వచ్చే వరద నీటితో గండం ఒడిశాలో తుపాను తీరం దాటనుండడం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అక్కడి నుంచి వంశధార, మహేంద్రతనయ నదులు శ్రీకాకుళం జిల్లాలోకి ఉప్పొంగే ప్రమాదం ఉంది. పూరీ జిల్లా బ్రహ్మగిరి సమితి బలుకుండో వద్ద శుక్రవారం మధ్యాహ్నం 11–12 గంటల తుపాను మధ్య తీరం దాటే అవకాశం ఉందని గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ సమీక్షించింది. ఇప్పటికే శ్రీకాకుళం, ఒడిశా తీరం వెంబడి వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో ఉప్పెన తప్పదా? ఒడిశాకు తుపానుతో పాటు ఉప్పెన ముప్పు కూడా పొంచి ఉందని గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం అధికారులు బాంబు పేల్చారు. ఒడిశాలో ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ‘ఫొని’ తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకూ రాకాసి అలలు ఎగిసిపడే అవకాశముందని వాతావరణ అధికారులు అంటున్నారు. తుపాను తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసిన ఒడిశాలోని పూరీ జిల్లా బ్రహ్మగిరి సమితి బలుకుండో ప్రాంతం చాలా సమతలంగా ఉంటుంది. సాధారణంగా సమతల ప్రాంతంలో అధిక తీవ్రత గల తుపాన్లు సంభవిస్తే ఉప్పెన ప్రమాదం పొంచి ఉంటుంది. అలల తీవ్రతకు సముద్ర జలాలు గ్రామాల్లోకి పొంగిపొర్లడాన్ని ఉప్పెన అంటారు. సమతల భాగంలో తుపాను తీరం దాటితేనే ఇలా ఉప్పెన ముప్పు ఉంటుందని ఒడిశాలోని గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం డైరెక్టర్ ఉమాశంకర్ దాస్ తెలిపారు. ‘‘పూరీ నుంచి జగత్సింగ్పూర్ వరకు 175 కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీరం మొత్తం సమతల భూభాగమే ఉంది. అందువల్ల ఫోని తుపాను వల్ల ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నాం. పూరీ–జగత్సింగ్పూర్ మధ్య బ్రహ్మగిరి, కృష్ణప్రసాద్, యరసమ, మహాకాలపడ, పారాదీప్ ప్రాంతాల్లో ఈ ముప్పు పొంచి ఉంది’’ అని దాస్ పేర్కొన్నారు. ఒడిశాలో 5 నదులకు వరద ముప్పు ‘‘తుపాను ప్రభావం వల్ల ఒడిశా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తుపాను తీరం దాటే సమయంలో శుక్రవారం ఒక్కరోజే 25 నుంచి 30 సెంటీమీటర్లు (250 నుంచి 300 మిల్లీమీటర్ల) రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అకాశం ఉంది. దీంతో ఒడిశాలోని మహానది, వైతరణి, రుషికుయ్య, సురవర్ణరేఖ, దేవీ నదులతోపాటు వాటి ఉప నదులకు కూడా వరద ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి’’ అని ఐఎండీ హెచ్చరించింది. ఎక్కడి రైళ్లు అక్కడే.. ఫొని తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ అప్రమత్తమైంది. హౌరా, భువనేశ్వర్‌ల నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై వైపునకు వెళ్లే 74 రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న రైళ్లను ప్రధాన రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. సహాయక చర్యలకు నౌకాదళం సిద్ధం ఫొని తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధమైంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నం నుంచి ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ రణ్వీర్, ఐఎన్ఎస్ కద్మత్ యుద్ధ నౌకలను సహాయక సామగ్రితోపాటు వైద్య బృందాలను సిద్ధం చేసినట్లు ఈఎన్సీ అధికారులు తెలిపారు. దీంతో పాటు అదనపు సహాయక సామగ్రి, వైద్య బృందాలు, డైవింగ్ టీమ్‌లను విశాఖ నుంచి ఒడిశాకు రోడ్డు మార్గంలో పంపిస్తున్నట్లు వెల్లడించారు. తుపాను తీరం దాటే ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు ఒక ఎయిర్ క్రాఫ్ట్‌ని విశాఖలో సిద్ధంగా ఉంచామన్నారు. టెంట్లు, దుస్తులు, మందులు, దుప్పట్లను బాధిత ప్రాంతాల ప్రజలకు అందించనున్నట్లు నౌకాదళ వర్గాలు వివరించాయి. అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం ఫోని తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సహాయక కార్యక్రమాల నిమిత్తం జాతీయ విపత్తు సహాయక బృందాలు(ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు సహాయక దళాలు (ఎస్డీఆర్ఎఫ్)లను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలకు చెందిన 15,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. విద్యుత్ స్తంభాలు, వైర్లు పడిపోతే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు విద్యుత్తు శాఖ అవసరమైన పనిముట్లను, సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. -
తీరంలో క్షణక్షణం భయం భయం
సాక్షి నెట్వర్క్: ఫొని తుపాను ప్రభావంతో ఉగ్రరూపం దాల్చిన బంగాళాఖాతం గ్రామాలపై విరుచుకు పడుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక తీర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు ధ్వంసమయ్యాయి. గురువారం ఉదయం నుంచి సముద్ర కెరటాల ఉధృతి పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, పల్లిపేట, సుబ్బంపేట, కోనపాపపేట తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి దాదాపు 30 మత్స్యకారుల గృహాలు ధ్వంసమయ్యాయి. మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో తలదాచుకోడానికి తరలి వెళుతున్నారు. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఇళ్లు దెబ్బతింటున్నాయి. కాకినాడ లైట్‌హౌస్ నుంచి ఉప్పాడ వరకు ఉన్న బీచ్‌రోడ్డుపై సముద్ర కెరటాలు సుమారు ఐదు మీటర్ల ఎత్తున ఎగసి పడుతున్నాయి. బీచ్‌రోడ్డు కోతకు గురవుతూ ప్రమాదకరంగా మారింది. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారులోని కోనపాపపేట కెరటాల ఉధృతికి కొట్టుకుపోతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది బీచ్‌లో సముద్రం 300 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. ఇప్పటికే కోత దశకు చేరుకుంటున్న వరి పంట భారీ వర్షాలు, ఈదురు గాలులకు నేలకొరిగే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో భారీగా ఈదురు గాలులు విజయనగరం జిల్లాలో ఫొని తుపాను ప్రతాపం చూపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని గ్రామాల వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. జిల్లాలో గురువారం భారీగా ఈదురుగాలులు వీచాయి. సముద్ర తీర ప్రాంతాలైన పూసపాటిరేగ, భోగాపురంతోపాటు డెంకాడ, నెల్లిమర్ల, విజయనగరం, గుర్ల, చీపురుపల్లి, గరివిడి మండలాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సాయంత్రం 5 గంటల నుంచి 70 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. తీర ప్రాంతాల్లో ఉన్న ఆరు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 2 వేల మందికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు. శ్రీకాకుళం జిల్లాలో 126 పునరావాస కేంద్రాలు తిత్లీ తుపాను తాకిడితో అల్లాడిన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి ‘ఫొని’ రూపంలో మరో ముప్పు ఏర్పడింది. ఈ తుపాను ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రానికి ఈదురు గాలులు మరింత ఉధృతమయ్యాయి. తుపాను తీరం దాటిన తర్వాత గంటకు 160 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ జె.నివాస్ ఎప్పటికప్పుడు పరిస్థితులను, సహాయక పునరావాస చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితుల కోసం జిల్లాలో 126 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వంశధార, నాగావళి, బాహుదా నదులకు వరద ముంపు ప్రమాదం ఉన్నందున పరివాహక గ్రామాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టారు. గురువారం శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 412 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఎక్కువగా వర్షం కురిసింది. టెక్కలి మండలం భగీరథిపేట గ్రామానికి చెందిన జనపాన ఈశ్వరమ్మ(65) అనే మహిళ భారీ ఈదురు గాలులకు భయపడి గుండె ఆగి మృతి చెందింది. గుంటూరు జిల్లాలో బీభత్సం తుపాను కారణంగా గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మిర్చి, మామిడి, అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రత్తిపాడు ప్రాంతంలో కల్లాల్లో ఉన్న మిర్చి రాశులు తడిసిపోయాయి. రైతులు ముందు జాగ్రత్తగా పట్టాలు కప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈదురుగాలులకు పట్టాలు లేచిపోయి మిర్చి తడిసిపోయింది. యడ్లపాడు మండలంలో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. అరటి తోటలు విరిగి పడిపోయాయి. వినుకొండ, ఈపూరు, బొల్లాపల్లి, క్రోసూరు, బెల్లంకొండ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి 11 విమానాలు రద్దు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 11 విమానాలను తుపాను ప్రభావం వల్ల ఈదురు గాలులు, వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. ఒక విమానాన్ని దారి మళ్లించారు. ప్రయాణికులతో సందడిగా ఉండే విశాఖ విమానాశ్రయం గురువారం బోసిపోయింది. ఇక్కడి నుంచి 28 విమానాలు రాకపోకలు సాగించాల్సి ఉండగా 11 ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన సర్వీసులు యథాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఫొని తుపాను ప్రభావంతో శుక్రవారం నుంచి ఒడిశాలోని గంజాం, గజపతి, ఖుర్దా, పూరీ, జగత్సింగ్పూర్, కేంద్రపార, భద్రక్, జైపూర్, బాలాసోర్, పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు, పశ్చిమ మేదినపూర్, దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, హౌరా, హూగ్లీ, ఝార్గ్రామ్, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ఫొని తుపాను వాయువేగంతో ఒడిశా తీరం వైపు దూసుకొచ్చింది. తీర ప్రాంతంలో గురువారం విపరీతంగా ఈదురు గాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. ‘ఫొని’పై ప్రధాని మోదీ సమీక్ష సాక్షి, న్యూఢిల్లీ: ఫొని తుపాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ఆయన గురువారం ఢిల్లీలో తుపాను సహాయక చర్యలను సమీక్షించారు. తుపాను గమనాన్ని అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. ప్రస్తుతం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, చేపడుతున్న సన్నాహక చర్యలను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు తుపాను ప్రభావిత రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రధాని మోదీ సూచించారు. నష్ట నివారణ చర్యలను తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి వైద్య సహాయం అందజేయాలని చెప్పారు. విద్యుత్తు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం కలిగితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఫొని తుపానుపై న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
తీరం దాటనున్న పెను తుపాను
-
పడగెత్తిన ‘ఫొని’
సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: పెను తుపాను ‘ఫొని’ పడగెత్తింది. ఉత్తరాంధ్ర, ఒడిశాలపై పెను ప్రభావం చూపడానికి దూసుకెళుతోంది. తుపాను, తీవ్ర తుపాను, అతి తీవ్ర తుపానుగా బలపడుతూ వచ్చి చివరకు పెను తుపానుగా మారింది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో వీచే భీకర గాలులు, భారీ వర్షాలతో ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందోనన్న భయాందోళనలు ఇటు ఉత్తరాంధ్ర, ఒడిశా వాసుల్లో వ్యక్తమవు తున్నాయి. ఇప్పటికే తిత్లీ దెబ్బకు అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఆరు నెలల్లోనే ‘ఫొని’ రూపంలో మరో పెను తుపాను దూసుకువ స్తుండడం ఆ ప్రాంతం వారిని కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇది బుధవారం రాత్రికి పూరీకి దక్షిణ నైరుతి దిశగా 570, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ ఒడిశాలోని గోపాల్పూర్– చాంద్‌బలీ మధ్య పూరీకి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం తీరాన్ని దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇవి ఒక దశలో 210 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని తాకుతాయని పేర్కొంది. వీటి ధాటికి కచ్చా ఇళ్లు, గుడిసెలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయని, రోడ్లు, రైలు పట్టాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, సమాచార వ్యవస్థ స్తంభించిపోవచ్చని తెలిపింది. ఈ నెల 5 వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, ఓడరేవు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో ఈ ప్రాంతాల ప్రజలు బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మంగినపూడిబీచ్‌లో ఎగసిపడుతున్న అలలు మధ్యలో పడవ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (20 సెం.మీకుపైగా), శుక్రవారం అతి భారీ వర్షాలు, పెనుగాలులు వీస్తాయని ఐఎండీ తన వెబ్సైట్లో పేర్కొంది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకంటే శ్రీకాకుళం జిల్లాపై తుపాను ప్రభావం అత్యధికంగా ఉండనుంది. ఆ జిల్లాలో గార, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పోలాకి, నందిగాం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం మండలాల్లో, విజయనగరం జిల్లాలో భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోనూ తుపాను తీవ్ర ప్రభావం చూపనుంది. అందువల్ల ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. సహాయక చర్యల నిమిత్తం ఈ మూడు జిల్లాలకు 15 జాతీయ విపత్తు సహాయక దళాలను విపత్తు నిర్వహణ శాఖ పంపించింది. తూర్పు నావికాదళం కూడా సన్నద్ధమైంది. విశాఖపట్నంలో తుపాను సహాయ సామగ్రితో యుద్ధనౌకలను సిద్ధం చేసింది. ఇంకా ఏరియల్ సర్వే కోసం నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను, ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గజ ఈతగాళ్లు, వైద్య బృందాలను అందుబాటులో ఉంచింది. మరోవైపు తుపాను తీరాన్ని దాటాక పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల వైపు పయనిస్తూ అతి తీవ్ర తుపానుగా, 4న తుపానుగా, 5న వాయుగుండం, అల్పపీడనంగా ఇలా క్రమంగా బలహీనపడనుంది. రైళ్లు, విమాన సర్వీసులూ రద్దు తుపాను నేపథ్యంలో హౌరా–చెన్నై–హైదరాబాద్‌ల మధ్య నడిచే అనేక రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. తూర్పు కోస్తా రైల్వే.. విశాఖపట్నం, విజయనగరం, రాయగడ రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే కొన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతానికి వీటిలో చెన్నై–వైజాగ్, వైజాగ్–చెన్నై, ఢిల్లీ–వైజాగ్, వైజాగ్–ఢిల్లీ తదితర సర్వీసులున్నాయి. గురువారం మరికొన్ని విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశాలున్నాయి. ‘చిక్కోలు ’ తీరంలో గంటకు 90 – 115 కిలోమీటర్ల వేగంతో గాలులు తుపాను తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్రలో గంటకు 90 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ బుధవారం రాత్రి ప్రకటించింది. 2018, అక్టోబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను తీరం దాటిన సందర్భంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. 2014, అక్టోబర్‌లో విశాఖపట్నం జిల్లాలో హుద్‌హుద్ తుపాను తీరం దాటిన సందర్భంగా గంటకు 220 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. ‘తిత్లీ, హుద్‌హుద్ తుపాన్లు రెండూ రాష్ట్రంలోనే తీరం దాటాయి. అందువల్ల గాలుల వేగం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఫొని తుపాను ఒడిశాలో తీరం దాటుతున్నందున అప్పుడంత ప్రభావం ఉండదు. తీరం దాటే ప్రాంతంలోనూ, సమీపంలోనూ ఎప్పుడైనా గాలుల తీవ్రత, వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటాయి. ‘ఫొని తుపాను ఒడిశాలోని గోపాల్పూర్ ప్రాంతంలో తీరం దాటుతున్నందున అక్కడ గంటకు 170 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవి ఒక దశలో 210 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కూడా తాకవచ్చని అంచనా వేస్తున్నాం. హుద్‌హుద్‌తో పోల్చితే దీని ప్రభావం తక్కువే’ అని వాతావరణ నిపుణులు తెలిపారు. ‘ఫొని’ ప్రభావంతో ఈదురు గాలులు, వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విజయనగరం జిల్లాలో సముద్రకెరటాలు ఉవ్వెత్తున ఎగసి తీర ప్రాంత గ్రామాలను తాకాయి. జిల్లాలో తీర ప్రాంత గ్రామాలైన కోనాడ, తిప్పలవలస, పులిగెడ్డ, పతివాడ బర్రిపేట, చింతపల్లి, చేపలకంచేరు, ముక్కాం గ్రామాల్లో సముద్రం 20 మీటర్ల ముందుకు వచ్చింది. జిల్లాలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అన్ని ముందు జాగ్రత్త చర్యలతో సిద్ధంగా ఉంది. 48 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు, కిరోసిన్, గ్యాస్ సిలిండర్లను కలెక్టర్ జె.నివాస్ అందుబాటులో ఉంచారు. జిల్లాలో ప్రవహించే వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తే ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తుపాను గమనాన్ని తెలుపుతున్న చిత్రం ‘పశ్చిమ’ తీర ప్రాంతాల్లో అలజడి ఫొని తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, భీమవరం తీర ప్రాంత గ్రామాల్లో అలజడి నెలకొంది. సముద్రపు అలలు ముందుకు చొచ్చుకొస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నరసాపురం మండలం పెదమైనవానిలంక, మొగల్తూరు మండలం పేరుపాలెంలో సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం 10 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. బుధవారం సాయంత్రం నుంచే వాతావరణం మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేరుపాలెం బీచ్‌లో సందర్శకుల అనుమతిని రద్దు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 8 పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్టు ఆర్డీవో ఎన్.సలీంఖాన్ చెప్పారు. నియోజకవర్గంలో దాళ్వా పంటకు సంబంధించి ఇంకా 20 శాతం కోతలు పూర్తి కాలేదు. దీంతో రైతులు హడావిడిగా వరి కోతలు ప్రారంభించారు. కొయ్యలగూడెంలో విపరీతమైన ఈదురుగాలులు వీయడంతో ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు కూలిపోయాయి. తణుకు రూరల్ గ్రామాల్లో కురిసిన వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. మత్స్యకారులను రక్షించిన అధికారులు కృష్ణా జిల్లా బందరు రూరల్ మండలం మంగినపూడి వద్ద సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతి పెరిగింది. బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం 9 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మచిలీపట్నం తీరంలోని తాళ్లపాలెం, కానూరు, కరగ్రహారం, చిన కరగ్రహారం గ్రామాల మత్స్యకారులు మూడు రోజుల క్రితమే చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకోగా వీరిని రక్షించారు. వీరి నాలుగు బోట్లు చిన కరగ్రహారం సముద్ర తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కనిపించడంతో స్థానికులు ఆర్డీవో జె.ఉదయభాస్కర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన తీరానికి చేరుకుని మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి మత్స్యకారులను బోట్లతో సహా సురక్షితంగా తీరానికి చేర్చారు. కర్నూలు జిల్లాలో నష్టం రూ.35 కోట్లు కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెనుగాలుల తీవ్రతకు దాదాపు 650 ఎకరాల్లో అరటి, మామిడి, బొప్పాయి తదితర పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. రూ.35 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా హాలహర్వి మండలంలోని బిలేహాల్ చెరువుకు గండి పడింది. వెనక్కి మళ్లిన ఇండిగో విమానం ఫొని తుపాను కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో విమానం వెనుదిరిగింది. హైదరాబాద్ నుంచి ఉదయం 11.30కు విశాఖ చేరుకుని, చెన్నైకి మధ్యాహ్నం 12.15కు వెళ్లాల్సిన ఈ విమానం విశాఖ విమానాశ్రయానికి వచ్చేసరికి గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో అధికారులు తిరిగి హైదరాబాద్‌కు మళ్లించారు. దీంతో చెన్నైకి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
సూపర్ సైక్లోనే..!
సాక్షి, విశాఖపట్నం: ఫొని తుపాను అంతకంతకు తీవ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు ఉధృతమవుతోంది. ఊహించిన విధంగానే సూపర్ సైక్లోన్‌గా మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను వాయవ్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం రాత్రికి చెన్నైకి ఆగ్నేయంగా 910, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగాను, అనంతరం 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను మారనుంది. ఇలా మే ఒకటో తేదీ సాయంత్రం వరకు క్రమంగా వాయవ్య దిశగా పయనించనుంది. ఆ తర్వాత మలుపు (రీకర్వ్) తీసుకుని ఉత్తర ఈశాన్య దిశలో కదులుతుంది. మే ఒకటో తేదీన సూపర్ సైక్లోన్ (ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్)గా బలపడనుందని భారత వాతావరణ విభాగం ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. తీవ్ర తుపానుగా ఉన్న సమయంలో బంగాళాఖాతంలో గంటకు 110–125, అతి తీవ్ర తుపానుగా మారాక 130–155, సూపర్ సైక్లోన్ అయ్యాక 160–195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. అదే సమయంలో కోస్తాంధ్ర, పుదుచ్చేరి, తమిళనాడు తీర ప్రాంతాల్లో గంటకు 50–70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడతాయి. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ‘ఫొని’ తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని విశాఖపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 2వ నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 5వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 30 నుంచి ‘ఫొని’ ప్రభావం! తుపాను ప్రభావం ఈనెల 30 నుంచి రాష్ట్రంపై కనిపించనుంది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మే 2వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖ ఏజెన్సీలో వర్షాలు విశాఖ ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి. హుకుంపేట, డుంబ్రిగుడ, అరుకులోయ మండలాల్లో వర్షం పడింది. మిగిలిన ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మధ్యాహ్నం మాత్రం తీవ్రమైన ఎండతో జనం అవస్థలు పడ్డారు. కాగా శనివారం వీచిన గాలులతో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నర్సీపట్నం ప్రాంతంలో ఆదివారం కూడా సరఫరాను అధికారులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేకపోయారు. వానలకు బదులు ఎండలు.. వాస్తవానికి తుపానులు వచ్చినప్పుడు భారీ వర్షాలు కురుస్తాయి. కానీ ఈ తుపానుకు మాత్రం వానలకంటే ఎండలే ఎక్కువగా ప్రభావం చూపించనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తుపాను వాయవ్య దిశగా పయనించడం వల్ల అటు నుంచి వీస్తున్న వేడిగాలులను తుపాను శక్తి రాష్ట్రంపైకి లాక్కుని వస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న మూడు, నాలుగు రోజులు సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. -
వణికిస్తున్న సూపర్ సైక్లోన్
* వరికోతలు నిలుపుదల * హడావుడిగా కుప్పులు వేసిన రైతులు తెనాలి టౌన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్‌తో రైతులు వణికిపోతున్నారు. ఏడాది పాటు కష్టపడి పండించి పంట చేతికి వచ్చే తరుణంలో తుపాను వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను దక్షిణాకోస్తాకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పడంతో రైతులు కోతలు కోయకుండా నిలుపుదల చేశారు. ఇప్పటికి కోతలు కోసిన రైతులు హడావుడిగా కుప్పలు వేసుకున్నారు. రూరల్ మండలంలో 21, 550 ఎకరాల్లో వరిపైరును రైతులు సాగు చేశారు. ఇప్పటికి 2,500 ఎకరాల్లో వరి కోతలు కోశారు. మూడు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం(నాడా తుపాను) తీరం దాటడంతో రైతులు ఊపిరి పిల్చుకున్నారు. కానీ మళ్లీ సూపర్ సైక్లోన్ ఉందని తెలియడంతో రైతుల్లో భయం నెలకొంది. చేతికి వచ్చిన పంట దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోయిన ఏదో విధంగా పొలాలను సాగుచేసి పంట దక్కించుకునే పరిస్థితి ఉంది. దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. ఎకరానికి 30 నుంచి 35బస్తాలు దిగుబడులు ఇస్తాయని రైతులు ఆశతో ఉన్నారు. సూపర్ సైక్లోన్ తీరం దాటిపోవాలని రైతులు కోరుకుంటున్నారు. కోతలు కోయకుండా ఆపేశాం.. పది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నా. పంట కోసే దశకు వచ్చింది. సూపర్ సైక్లోన్ ఉందని తెలియడంతో వరి కోతలు కోయకుండా ఆపేశాం. పైరు కోయకపోతే గింజలు రాలిపోయే ప్రమాదం ఉంది. కోతలు కోయాలంటే భయంగా ఉంది. తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలియజేయడంతో ఈ నెల 8వ తేదీ వరకు కోతలు కోసే పరిస్థితి లేదు. – మోర వెంకటేశ్వరరెడ్డి, రైతు, కొలకలూరు -
పెను తుపాన్‌గా మారిన హుదూద్
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ హుదూద్ తుపాన్ పెను తుపాన్‌గా మారింది. దీనివల్ల ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు పొంచి ఉంది. విశాఖపట్నం జిల్లాలో 57 గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచిఉందని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. 30 వేలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. 220 మంది సైనికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుందని తెలిపారు. విశాఖలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సహాయ కార్యక్రమాల కోసం నౌకలు, హెలీకాప్టర్లను సిద్దంగా ఉంచారు. -
పై-లీన్ గండం!
-
ముంచుకొస్తోన్న ఫైలిన్ తుపాన్ ముప్పు
-
తీరానికి పెనుముప్పు!
విశాఖకు700 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన ‘ఫైలిన్’ పెను తుపానుగా మారి మున్ముందుకు.. రేపు ఒడిశాకు సమీపంలో తీరం దాటే అవకాశం ‘సూపర్ సైక్లోన్’గా మారే అవకాశం అదే జరిగితే తీవ్ర విధ్వంసం తప్పదని ఆందోళన కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరులో భారీ వర్షాలు కృష్ణాలో వాగుల్లో కొట్టుకుపోయి ఇద్దరి మృతి సాక్షి నెట్వర్క్: ఫైలిన్ ముంచుకొస్తోంది. పెను తుపానుగా మారింది. ప్రస్తుతం విశాఖ తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రెండ్రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను గురువారం రాత్రికల్లా పెను తుపానుగా మారినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు ఆగ్నేయ దిశగా పయణించి శనివారం నాటికి ఒడిశా-కళింగపట్నం-గోపాలపూర్ ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్న కారణంగా రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉదయం నుంచి కోస్తా అంతటా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. ఫైలిన్ తుపాను ‘సూపర్ సైక్లోన్’గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే గంటకు 175 నుంచి 185 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆస్తుల ధ్వంసం తప్పదు. సముద్రం ముందుకు వస్తుంది. 20, 30 అడుగుల వరకు అలలు ఎగిసిపడతాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుత తుపాను ఒడిశాకు సమీపంలో తీరం దాటొచ్చని, భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశా పైనే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా అక్టోబర్‌లో ఏర్పడే తుపాన్లకు అధిక ప్రభావం ఉంటుంది. 1950కి పూర్వం దసరాకు ముందు ఏటా అధికంగా తుపాన్లు ఏర్పడేవని వాతావరణ శాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ చెప్పారు. మూడు జిల్లాల్లో భారీ వర్షాలు ఫైలిన్ తుపాను ప్రభావంతో కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమ కృష్ణాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగుల్లో పడి జిల్లాలో ముగ్గురు మృతిచెందారు. ఆగిరిపల్లి మండలం కుంపిణీ వాగులో ఇద్దరు బాలికలు కరేటి శైలజ (15), నక్కనబోయిన పావని (14) గల్లంతు కాగా వారిలో శైలజ మృతదేహం లభించింది. కంభంపాటి శాంతమ్మ (46) అనే మహిళ తన పుట్టిల్లయిన ముసునూరు మండలంలోని యల్లాపురానికి వస్తుండగా.. తమ్మిలేటి కొట్టుకుపోయి మృతి చెందింది. మైలవరంలోని కొండవాగు, బుడమేరు, పోతులవాగు, నందిగామ సమీపంలోని మునేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో సుమారు 12 వేల ఎకరాలు వరి పంట మునిగిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని పిన్నెల్లి గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు గురై 120 గొర్రెలు మరణించాయి. నిజాంపట్నం ఓడరేవులో రెండో ప్రమాద హెచ్చరిక ఎగుర వేశారు. సూర్యలంక సమీపంలోని 28 లోతట్టు గ్రామాలను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతంలో గురువారం సముద్రం ముందుకువచ్చింది. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ నుంచి గుణుపల్లి వరకు బలమైన గాలులు వీయడంతో మంచినీళ్లపేట వద్ద సముద్రం 60 మీటర్ల ముందుకు వ చ్చింది. దీంతో సుమారు రూ.2 లక్షలు విలువైన ఫైబర్ బోటు ధ్వంసమైందని మత్స్యకారులు తెలిపారు. గార మండలం కళింగపట్నం, బందరువానిపేట గ్రామాల వద్ద సముద్రం 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. ఇచ్ఛాపురం మండలం డొంకూరులో అలలు ఎగసి పడడంతో ఒక పడవ, వలలు కొట్టుకుపోయాయి. అధికారులతో సీఎం కిరణ్ సమీక్ష ఫైలిన్ తుపాను నేపథ్యంలో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుపాను పరిస్థితిపై గురువారం ఆయన రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలవారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో విద్యుత్తు, తాగునీరు, ఆహారం తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు, కిరోసిన్, మంచినీరు ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షం పడిన ప్రాంతాలివే బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు విజయవాడ, నర్సాపురం, ఎస్కోటలలో 8 సెం.మీ, గుడివాడ, కోడూరులలో 7, చోడవరం, రెంటచింతల, తెర్లాం, నందిగామ, మచిలీపట్నం, బాపట్ల ప్రాంతాల్లో 6 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. చిత్తూరు, శ్రీశైలం, పలమనేరు ప్రాంతాల్లో ఒక్కో సెం.మీ చొప్పున వాన పడింది. ఇల్లెందు, హైదరాబాద్‌ల్లో 10 సెం.మీ, భద్రాచలం, దుబ్బాక, మేడ్చల్, చేవెళ్ల, మధిర, హకీంపేట ప్రాంతాల్లో 7 సెం.మీ, భీంగల్, వనపర్తి, ఖాన్పూర్, గోల్కొండ ప్రాంతాల్లో 6 సెం.మీ చొప్పున వర్షం పడింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ఫైలిన్ తుపాను నేపథ్యంలో కోస్తాలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలవారిని పునరావాస కేంద్రాలకు శుక్రవారం తరలించాలని ఆదేశించారు.