వణికిస్తున్న సూపర్ సైక్లోన్
వణికిస్తున్న సూపర్ సైక్లోన్
Published Sun, Dec 4 2016 10:54 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
* వరికోతలు నిలుపుదల
* హడావుడిగా కుప్పులు వేసిన రైతులు
తెనాలి టౌన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్‌తో రైతులు వణికిపోతున్నారు. ఏడాది పాటు కష్టపడి పండించి పంట చేతికి వచ్చే తరుణంలో తుపాను వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను దక్షిణాకోస్తాకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పడంతో రైతులు కోతలు కోయకుండా నిలుపుదల చేశారు. ఇప్పటికి కోతలు కోసిన రైతులు హడావుడిగా కుప్పలు వేసుకున్నారు. రూరల్ మండలంలో 21, 550 ఎకరాల్లో వరిపైరును రైతులు సాగు చేశారు. ఇప్పటికి 2,500 ఎకరాల్లో వరి కోతలు కోశారు. మూడు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం(నాడా తుపాను) తీరం దాటడంతో రైతులు ఊపిరి పిల్చుకున్నారు. కానీ మళ్లీ సూపర్ సైక్లోన్ ఉందని తెలియడంతో రైతుల్లో భయం నెలకొంది. చేతికి వచ్చిన పంట దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోయిన ఏదో విధంగా పొలాలను సాగుచేసి పంట దక్కించుకునే పరిస్థితి ఉంది. దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. ఎకరానికి 30 నుంచి 35బస్తాలు దిగుబడులు ఇస్తాయని రైతులు ఆశతో ఉన్నారు. సూపర్ సైక్లోన్ తీరం దాటిపోవాలని రైతులు కోరుకుంటున్నారు.
కోతలు కోయకుండా ఆపేశాం..
పది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నా. పంట కోసే దశకు వచ్చింది. సూపర్ సైక్లోన్ ఉందని తెలియడంతో వరి కోతలు కోయకుండా ఆపేశాం. పైరు కోయకపోతే గింజలు రాలిపోయే ప్రమాదం ఉంది. కోతలు కోయాలంటే భయంగా ఉంది. తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలియజేయడంతో ఈ నెల 8వ తేదీ వరకు కోతలు కోసే పరిస్థితి లేదు.
– మోర వెంకటేశ్వరరెడ్డి, రైతు, కొలకలూరు
Advertisement