ధాన్యం కొనుగోలుకు రెడీ..!
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ ముందస్తు వరి కోతలు ప్రారంభమయ్యాయి. అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో ఊపందుకుంటున్నాయి. మరో పది రోజుల వ్యవధిలో మరికొన్ని ప్రాంతాల్లో వేగం పుంజుకునే ఆవస్యకత ఉంది. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసి దన్నుగా నిలవాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
దిగుబడి అందే నాటి కంటే ముందుగానే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసువచ్చేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సేకరణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలైంది. కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులు, యంత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం
ఉంది.
4.55 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యం
జిల్లా వ్యాప్తంగా రబీ సాధారణ సాగు 83,880 హెక్టార్లు. అత్యధికంగా వరి సాగవుతోంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 56,433 హెక్టార్లు కాగా.. 55,095 హెక్టార్లు సాగై 95 శాతానికి పైగా లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా.
ఇందులో రైతులు, స్థానిక అవసరాలకు మినహాయించగా 4,55,845 మెట్రిక్ టన్నులు కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రైతులకు అనుకూలమైన మద్దతు ధర నిర్ణయించింది. సాధారణ రకం బస్తాకు (75 కిలోల బస్తా) రూ.1530, గ్రేడ్–ఏ రకానికి రూ.1545గా నిర్ణయించింది.
233 ఆర్బీకేల్లో..
జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 315 ఆర్బీకేలుండగా 233 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిని 147 మిల్లులకు అనుసంధానం చేశారు. ఆయా కేంద్రాలకు నియమించిన సాంకేతిక సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. సేకరణకు జిల్లా వ్యాప్తంగా 70 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉందని, ఏ మండలానికి ఎన్ని కావాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు.
ఆర్బీకేల వద్ద సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ–క్రాప్, తేమ శాతం నిబంధనల ప్రకారం ధాన్యం సేకరిస్తారు. అనంతరం మొబైల్ యాప్‌లో రైతులకు కూపన్లు ఇస్తారు. కొనుగోళ్లకు మండల వ్యవసాయ అధికారులు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. గ్రామ వలంటీర్లను సైతం భాగస్వాముల్ని చేస్తున్నారు. ధాన్యం రవాణా చేసే వాహనాలపై నిఘా పెడుతున్నారు. రవాణా చార్జీలు ఎవరికి చెల్లించాలనే విషయమై జాగ్రత్తలు తీసు
కుంటున్నారు.
ఎకరానికి 53 బస్తాల దిగుబడి
రబీ ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. ఎకరానికి 52 నుంచి 53 బస్తాల దిగుబడి అందుతోంది. జిల్లాలో అత్యధికంగా ఎంటీయూ–1121 రకం ధాన్యం సేకరించనున్నారు. 3.39 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 76,000 మెట్రిక్ టన్నులు బోండాలు, 30 వేల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉత్పత్తి అయ్యే సూచనలున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. పెట్టుబడులకు పోను లాభాలు గడించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్లుగా దిగుబడులు టాప్..
జిల్లాలో 2021 ఖరీఫ్‌లో 82,695 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఎకరానికి (75 కిలోల బస్తా) 28 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే.. 2022 ఖరీఫ్‌లో 73,606 హెక్టార్లలో వరి సాగయ్యింది. ఎకరానికి 33 బస్తాల దిగుబడి వచ్చింది. ఏడాది వ్యవధిలో ఎకరం పొలానికి 5 బస్తాలు వృద్ధి చెందింది. 2021 ఖరీఫ్‌లో మొత్తం 4,29,990 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అందితే.. 2022లో 4,52,368 మెట్రిక్ టన్నులు.. అంటే 22,378 మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి వచ్చింది. గత ఐదేళ్లుగా ఇలాంటి దిగుబడులు ఎప్పుడూ నమోదు కాలేదని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇప్పటికే 2321 హెక్టార్లలో కోతలు పూర్తయినట్లు సమాచారం.
ప్రతి గింజా కొంటాం:–
రబీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేశాం. ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి సేకరణపై అధికారులు, సిబ్బందికి సలహాలు సూచనలు చేశాం. ముందస్తు కోతలు వచ్చే ప్రాంతాల్లో కేంద్రాలు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నాం. 4.55 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 233 ఆర్బీకేలు సిద్ధం చేస్తున్నాం. వారం రోజుల తర్వాత కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. –ఎన్.తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్