వరి కోతలు ప్రారంభమై నెల దాటింది. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో రాశులు పోసి అమ్మేందుకు సిద్ధం చేశారు. గతంలో మాదిరిగా ఈ ఏడు కూడా కల్లం వద్దే మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమశాతం పేరుతో అధికారులు ధర తగ్గిస్తున్నారు.
ఇదే అదనుగా తీసుకుని దళారులు, మిల్లర్లు.. రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. నాలుగు రోజులు ఆగితే పరిస్థితులు మారకపోతాయా, ప్రభుత్వం పట్టించుకోకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న మీదికి పులిమీద పుట్రలా ఫెంగల్ తుపాన్ వచ్చిపడింది. రైతు కష్టాలను రెట్టింపు చేసింది.
తుపాను వస్తుందని నాలుగు రోజుల ముందే వాతావరణశాఖ హెచ్చరించినా సర్కారు మొద్దు నిద్ర కారణంగా తడిసిన ధాన్యపు రాశుల వద్ద రైతు చేష్టలుడిగి చూస్తున్నాడు. ఇంత పెద్ద ఆపద వస్తే సీఎం కనీసం అధికారులతో సమీక్షించిన పాపానపోలేదు. మంత్రులు ట్వీట్లకు, నాయకులు మాటలకు పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి దయనీయంగా మారింది.
పరిస్థితులు అంచనావేసి ప్రభుత్వం సకాలంలో స్పందించి ధాన్యం కొనుగోలు చేస్తే ఈ చింత మాకెందుకంటూ రైతన్న గోడు వెళ్లబోసుకుంటున్నాడు. వచ్చిందే అవకాశమనుకుని కళేబరాన్ని పీక్కుతినే రాబందుల్లా దళారులు, నాయకులు ఏకమై రక్తాన్ని పీల్చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతన్న కల్లం వద్ద కన్నీరు కారుస్తున్నాడు.
రహదారుల పక్కన టార్పాలిన్లపై తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుని ఎప్పుడు కొంటారో, ఎంతకి కొంటారో తెలియక బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నాడు. – సాక్షి నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment