తుపాను గాలులకు విశాఖలో పోలీస్‌బ్యారెక్స్ వద్ద కూలిపోయిన చెట్టు
సాక్షి నెట్‌వర్క్: ఫొని తుపాను ప్రభావంతో ఉగ్రరూపం దాల్చిన బంగాళాఖాతం గ్రామాలపై విరుచుకు పడుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక తీర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు ధ్వంసమయ్యాయి. గురువారం ఉదయం నుంచి సముద్ర కెరటాల ఉధృతి పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, పల్లిపేట, సుబ్బంపేట, కోనపాపపేట తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి దాదాపు 30 మత్స్యకారుల గృహాలు ధ్వంసమయ్యాయి. మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో తలదాచుకోడానికి తరలి వెళుతున్నారు. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఇళ్లు దెబ్బతింటున్నాయి. కాకినాడ లైట్‌హౌస్ నుంచి ఉప్పాడ వరకు ఉన్న బీచ్‌రోడ్డుపై సముద్ర కెరటాలు సుమారు ఐదు మీటర్ల ఎత్తున ఎగసి పడుతున్నాయి. బీచ్‌రోడ్డు కోతకు గురవుతూ ప్రమాదకరంగా మారింది. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారులోని కోనపాపపేట కెరటాల ఉధృతికి కొట్టుకుపోతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది బీచ్‌లో సముద్రం 300 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. ఇప్పటికే కోత దశకు చేరుకుంటున్న వరి పంట భారీ వర్షాలు, ఈదురు గాలులకు నేలకొరిగే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో భారీగా ఈదురు గాలులు
విజయనగరం జిల్లాలో ఫొని తుపాను ప్రతాపం చూపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని గ్రామాల వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. జిల్లాలో గురువారం భారీగా ఈదురుగాలులు వీచాయి. సముద్ర తీర ప్రాంతాలైన పూసపాటిరేగ, భోగాపురంతోపాటు డెంకాడ, నెల్లిమర్ల, విజయనగరం, గుర్ల, చీపురుపల్లి, గరివిడి మండలాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సాయంత్రం 5 గంటల నుంచి 70 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. తీర ప్రాంతాల్లో ఉన్న ఆరు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 2 వేల మందికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు.
శ్రీకాకుళం జిల్లాలో 126 పునరావాస కేంద్రాలు
తిత్లీ తుపాను తాకిడితో అల్లాడిన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి ‘ఫొని’ రూపంలో మరో ముప్పు ఏర్పడింది. ఈ తుపాను ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రానికి ఈదురు గాలులు మరింత ఉధృతమయ్యాయి. తుపాను తీరం దాటిన తర్వాత గంటకు 160 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ జె.నివాస్ ఎప్పటికప్పుడు పరిస్థితులను, సహాయక పునరావాస చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితుల కోసం జిల్లాలో 126 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వంశధార, నాగావళి, బాహుదా నదులకు వరద ముంపు ప్రమాదం ఉన్నందున పరివాహక గ్రామాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టారు. గురువారం శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 412 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఎక్కువగా వర్షం కురిసింది. టెక్కలి మండలం భగీరథిపేట గ్రామానికి చెందిన జనపాన ఈశ్వరమ్మ(65) అనే మహిళ భారీ ఈదురు గాలులకు భయపడి గుండె ఆగి మృతి చెందింది.
గుంటూరు జిల్లాలో బీభత్సం
తుపాను కారణంగా గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మిర్చి, మామిడి, అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రత్తిపాడు ప్రాంతంలో కల్లాల్లో ఉన్న మిర్చి రాశులు తడిసిపోయాయి. రైతులు ముందు జాగ్రత్తగా పట్టాలు కప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈదురుగాలులకు పట్టాలు లేచిపోయి మిర్చి తడిసిపోయింది. యడ్లపాడు మండలంలో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. అరటి తోటలు విరిగి పడిపోయాయి. వినుకొండ, ఈపూరు, బొల్లాపల్లి, క్రోసూరు, బెల్లంకొండ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.
విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి 11 విమానాలు రద్దు
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 11 విమానాలను తుపాను ప్రభావం వల్ల ఈదురు గాలులు, వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. ఒక విమానాన్ని దారి మళ్లించారు. ప్రయాణికులతో సందడిగా ఉండే విశాఖ విమానాశ్రయం గురువారం బోసిపోయింది. ఇక్కడి నుంచి 28 విమానాలు రాకపోకలు సాగించాల్సి ఉండగా 11 ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన సర్వీసులు యథాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఫొని తుపాను ప్రభావంతో శుక్రవారం నుంచి ఒడిశాలోని గంజాం, గజపతి, ఖుర్దా, పూరీ, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపార, భద్రక్, జైపూర్, బాలాసోర్, పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు, పశ్చిమ మేదినపూర్, దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, హౌరా, హూగ్లీ, ఝార్‌గ్రామ్, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ఫొని తుపాను వాయువేగంతో ఒడిశా తీరం వైపు దూసుకొచ్చింది. తీర ప్రాంతంలో గురువారం విపరీతంగా ఈదురు గాలులు, కుండపోత వర్షాలు కురిశాయి.
‘ఫొని’పై ప్రధాని మోదీ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఫొని తుపాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ఆయన గురువారం ఢిల్లీలో తుపాను సహాయక చర్యలను సమీక్షించారు. తుపాను గమనాన్ని అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. ప్రస్తుతం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, చేపడుతున్న సన్నాహక చర్యలను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు తుపాను ప్రభావిత రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రధాని మోదీ సూచించారు. నష్ట నివారణ చర్యలను తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి వైద్య సహాయం అందజేయాలని చెప్పారు. విద్యుత్తు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం కలిగితే వెంటనే పునరుద్ధరించాలన్నారు.
ఫొని తుపానుపై న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
Comments
Please login to add a commentAdd a comment