పడగెత్తిన ‘ఫొని’ | Cyclone Fani danger warning issued in all ports | Sakshi
Sakshi News home page

పడగెత్తిన ‘ఫొని’

Published Thu, May 2 2019 4:39 AM | Last Updated on Thu, May 2 2019 11:58 AM

Cyclone Fani danger warning issued in all ports - Sakshi

విశాఖ ఆర్కేబీచ్‌లో భారీగా ఎగసిపడుతున్న సముద్రపు అలలు

సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: పెను తుపాను ‘ఫొని’ పడగెత్తింది. ఉత్తరాంధ్ర, ఒడిశాలపై పెను ప్రభావం చూపడానికి దూసుకెళుతోంది. తుపాను, తీవ్ర తుపాను, అతి తీవ్ర తుపానుగా బలపడుతూ వచ్చి చివరకు పెను తుపానుగా మారింది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో వీచే భీకర గాలులు, భారీ వర్షాలతో ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందోనన్న భయాందోళనలు ఇటు ఉత్తరాంధ్ర, ఒడిశా వాసుల్లో వ్యక్తమవు తున్నాయి. ఇప్పటికే తిత్లీ దెబ్బకు అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఆరు నెలల్లోనే ‘ఫొని’ రూపంలో మరో పెను తుపాను దూసుకువ స్తుండడం ఆ ప్రాంతం వారిని కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇది బుధవారం రాత్రికి పూరీకి దక్షిణ నైరుతి దిశగా 570, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ ఒడిశాలోని గోపాల్‌పూర్‌– చాంద్‌బలీ మధ్య పూరీకి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం తీరాన్ని దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

ఇవి ఒక దశలో 210 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని తాకుతాయని పేర్కొంది. వీటి ధాటికి కచ్చా ఇళ్లు, గుడిసెలు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోతాయని, రోడ్లు, రైలు పట్టాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, సమాచార వ్యవస్థ స్తంభించిపోవచ్చని తెలిపింది. ఈ నెల 5 వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, ఓడరేవు పోర్టుల్లో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో ఈ ప్రాంతాల ప్రజలు బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 
మంగినపూడిబీచ్‌లో ఎగసిపడుతున్న అలలు మధ్యలో పడవ   

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (20 సెం.మీకుపైగా), శుక్రవారం అతి భారీ వర్షాలు, పెనుగాలులు వీస్తాయని ఐఎండీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకంటే శ్రీకాకుళం జిల్లాపై తుపాను ప్రభావం అత్యధికంగా ఉండనుంది. ఆ జిల్లాలో గార, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పోలాకి, నందిగాం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం మండలాల్లో, విజయనగరం జిల్లాలో భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోనూ తుపాను తీవ్ర ప్రభావం చూపనుంది.

అందువల్ల ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. సహాయక చర్యల నిమిత్తం ఈ మూడు జిల్లాలకు 15 జాతీయ విపత్తు సహాయక దళాలను విపత్తు నిర్వహణ శాఖ పంపించింది. తూర్పు నావికాదళం కూడా సన్నద్ధమైంది. విశాఖపట్నంలో తుపాను సహాయ సామగ్రితో యుద్ధనౌకలను సిద్ధం చేసింది. ఇంకా ఏరియల్‌ సర్వే కోసం నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను, ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గజ ఈతగాళ్లు, వైద్య బృందాలను అందుబాటులో ఉంచింది. మరోవైపు తుపాను తీరాన్ని దాటాక పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల వైపు పయనిస్తూ అతి తీవ్ర తుపానుగా, 4న తుపానుగా, 5న వాయుగుండం, అల్పపీడనంగా ఇలా క్రమంగా బలహీనపడనుంది. 

రైళ్లు, విమాన సర్వీసులూ రద్దు
తుపాను నేపథ్యంలో హౌరా–చెన్నై–హైదరాబాద్‌ల మధ్య నడిచే అనేక రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. తూర్పు కోస్తా రైల్వే.. విశాఖపట్నం, విజయనగరం, రాయగడ రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే కొన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతానికి వీటిలో చెన్నై–వైజాగ్, వైజాగ్‌–చెన్నై, ఢిల్లీ–వైజాగ్, వైజాగ్‌–ఢిల్లీ తదితర సర్వీసులున్నాయి. గురువారం మరికొన్ని విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశాలున్నాయి. 

‘చిక్కోలు ’ తీరంలో గంటకు 90 – 115 కిలోమీటర్ల వేగంతో గాలులు
తుపాను తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్రలో గంటకు 90 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ బుధవారం రాత్రి ప్రకటించింది. 2018, అక్టోబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను తీరం దాటిన సందర్భంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. 2014, అక్టోబర్‌లో విశాఖపట్నం జిల్లాలో హుద్‌హుద్‌ తుపాను తీరం దాటిన సందర్భంగా గంటకు 220 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. ‘తిత్లీ, హుద్‌హుద్‌ తుపాన్లు రెండూ రాష్ట్రంలోనే తీరం దాటాయి. అందువల్ల గాలుల వేగం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఫొని తుపాను ఒడిశాలో తీరం దాటుతున్నందున అప్పుడంత ప్రభావం ఉండదు. తీరం దాటే ప్రాంతంలోనూ, సమీపంలోనూ ఎప్పుడైనా గాలుల తీవ్రత, వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటాయి. ‘ఫొని తుపాను ఒడిశాలోని గోపాల్‌పూర్‌ ప్రాంతంలో తీరం దాటుతున్నందున అక్కడ గంటకు 170 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవి ఒక దశలో 210 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కూడా తాకవచ్చని అంచనా వేస్తున్నాం. హుద్‌హుద్‌తో పోల్చితే దీని ప్రభావం తక్కువే’ అని వాతావరణ నిపుణులు తెలిపారు. 

‘ఫొని’ ప్రభావంతో ఈదురు గాలులు, వర్షాలు 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విజయనగరం జిల్లాలో సముద్రకెరటాలు ఉవ్వెత్తున ఎగసి తీర ప్రాంత గ్రామాలను తాకాయి. జిల్లాలో తీర ప్రాంత గ్రామాలైన కోనాడ, తిప్పలవలస, పులిగెడ్డ, పతివాడ బర్రిపేట, చింతపల్లి, చేపలకంచేరు, ముక్కాం గ్రామాల్లో సముద్రం 20 మీటర్ల ముందుకు వచ్చింది. జిల్లాలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అన్ని ముందు జాగ్రత్త చర్యలతో సిద్ధంగా ఉంది. 48 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు, కిరోసిన్, గ్యాస్‌ సిలిండర్లను కలెక్టర్‌ జె.నివాస్‌ అందుబాటులో ఉంచారు. జిల్లాలో ప్రవహించే వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తే ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 
 తుపాను గమనాన్ని తెలుపుతున్న చిత్రం   

 ‘పశ్చిమ’ తీర ప్రాంతాల్లో అలజడి 
ఫొని తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, భీమవరం తీర ప్రాంత గ్రామాల్లో అలజడి నెలకొంది. సముద్రపు అలలు ముందుకు చొచ్చుకొస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నరసాపురం మండలం పెదమైనవానిలంక, మొగల్తూరు మండలం పేరుపాలెంలో సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం 10 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. బుధవారం సాయంత్రం నుంచే వాతావరణం మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేరుపాలెం బీచ్‌లో సందర్శకుల అనుమతిని రద్దు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 8 పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్టు ఆర్డీవో ఎన్‌.సలీంఖాన్‌ చెప్పారు. నియోజకవర్గంలో దాళ్వా పంటకు సంబంధించి ఇంకా 20 శాతం కోతలు పూర్తి కాలేదు. దీంతో రైతులు హడావిడిగా వరి కోతలు ప్రారంభించారు. కొయ్యలగూడెంలో విపరీతమైన ఈదురుగాలులు వీయడంతో ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు కూలిపోయాయి. తణుకు రూరల్‌ గ్రామాల్లో కురిసిన వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది.        
మత్స్యకారులను రక్షించిన అధికారులు 
కృష్ణా జిల్లా బందరు రూరల్‌ మండలం మంగినపూడి వద్ద సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతి పెరిగింది. బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం 9 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మచిలీపట్నం తీరంలోని తాళ్లపాలెం, కానూరు, కరగ్రహారం, చిన కరగ్రహారం గ్రామాల మత్స్యకారులు మూడు రోజుల క్రితమే చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకోగా వీరిని రక్షించారు. వీరి నాలుగు బోట్లు చిన కరగ్రహారం సముద్ర తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కనిపించడంతో స్థానికులు ఆర్డీవో జె.ఉదయభాస్కర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన తీరానికి చేరుకుని మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి మత్స్యకారులను బోట్లతో సహా సురక్షితంగా తీరానికి చేర్చారు.
 
కర్నూలు జిల్లాలో నష్టం రూ.35 కోట్లు 
కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెనుగాలుల తీవ్రతకు దాదాపు 650 ఎకరాల్లో అరటి, మామిడి, బొప్పాయి తదితర పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. రూ.35 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. వందలాది విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా హాలహర్వి మండలంలోని బిలేహాల్‌ చెరువుకు గండి పడింది. 

వెనక్కి మళ్లిన ఇండిగో విమానం 
ఫొని తుపాను కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో విమానం వెనుదిరిగింది. హైదరాబాద్‌ నుంచి ఉదయం 11.30కు విశాఖ చేరుకుని, చెన్నైకి మధ్యాహ్నం 12.15కు వెళ్లాల్సిన ఈ విమానం విశాఖ విమానాశ్రయానికి వచ్చేసరికి గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో అధికారులు తిరిగి హైదరాబాద్‌కు మళ్లించారు. దీంతో చెన్నైకి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement