ముంచుకొస్తోన్న ఫైలిన్ తుపాన్ ముప్పు | Phailin intensifies into severe cyclonic storm | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 11 2013 8:59 AM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

ఫైలిన్ ముంచుకొస్తోంది. పెను తుపానుగా మారింది. ప్రస్తుతం విశాఖ తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రెండ్రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను గురువారం రాత్రికల్లా పెను తుపానుగా మారినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు ఆగ్నేయ దిశగా పయణించి శనివారం నాటికి ఒడిశా-కళింగపట్నం-గోపాలపూర్ ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్న కారణంగా రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉదయం నుంచి కోస్తా అంతటా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. ఫైలిన్ తుపాను ‘సూపర్ సైక్లోన్’గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే గంటకు 175 నుంచి 185 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆస్తుల ధ్వంసం తప్పదు. సముద్రం ముందుకు వస్తుంది. 20, 30 అడుగుల వరకు అలలు ఎగిసిపడతాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుత తుపాను ఒడిశాకు సమీపంలో తీరం దాటొచ్చని, భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశా పైనే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా అక్టోబర్‌లో ఏర్పడే తుపాన్లకు అధిక ప్రభావం ఉంటుంది. 1950కి పూర్వం దసరాకు ముందు ఏటా అధికంగా తుపాన్లు ఏర్పడేవని వాతావరణ శాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ చెప్పారు. మూడు జిల్లాల్లో భారీ వర్షాలు ఫైలిన్ తుపాను ప్రభావంతో కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమ కృష్ణాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగుల్లో పడి జిల్లాలో ముగ్గురు మృతిచెందారు. ఆగిరిపల్లి మండలం కుంపిణీ వాగులో ఇద్దరు బాలికలు కరేటి శైలజ (15), నక్కనబోయిన పావని (14) గల్లంతు కాగా వారిలో శైలజ మృతదేహం లభించింది. కంభంపాటి శాంతమ్మ (46) అనే మహిళ తన పుట్టిల్లయిన ముసునూరు మండలంలోని యల్లాపురానికి వస్తుండగా.. తమ్మిలేటి కొట్టుకుపోయి మృతి చెందింది. మైలవరంలోని కొండవాగు, బుడమేరు, పోతులవాగు, నందిగామ సమీపంలోని మునేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో సుమారు 12 వేల ఎకరాలు వరి పంట మునిగిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని పిన్నెల్లి గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు గురై 120 గొర్రెలు మరణించాయి. నిజాంపట్నం ఓడరేవులో రెండో ప్రమాద హెచ్చరిక ఎగుర వేశారు. సూర్యలంక సమీపంలోని 28 లోతట్టు గ్రామాలను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతంలో గురువారం సముద్రం ముందుకువచ్చింది. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ నుంచి గుణుపల్లి వరకు బలమైన గాలులు వీయడంతో మంచినీళ్లపేట వద్ద సముద్రం 60 మీటర్ల ముందుకు వ చ్చింది. దీంతో సుమారు రూ.2 లక్షలు విలువైన ఫైబర్ బోటు ధ్వంసమైందని మత్స్యకారులు తెలిపారు. గార మండలం కళింగపట్నం, బందరువానిపేట గ్రామాల వద్ద సముద్రం 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. ఇచ్ఛాపురం మండలం డొంకూరులో అలలు ఎగసి పడడంతో ఒక పడవ, వలలు కొట్టుకుపోయాయి. అధికారులతో సీఎం కిరణ్ సమీక్ష ఫైలిన్ తుపాను నేపథ్యంలో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుపాను పరిస్థితిపై గురువారం ఆయన రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలవారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో విద్యుత్తు, తాగునీరు, ఆహారం తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు, కిరోసిన్, మంచినీరు ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షం పడిన ప్రాంతాలివే బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు విజయవాడ, నర్సాపురం, ఎస్‌కోటలలో 8 సెం.మీ, గుడివాడ, కోడూరులలో 7, చోడవరం, రెంటచింతల, తెర్లాం, నందిగామ, మచిలీపట్నం, బాపట్ల ప్రాంతాల్లో 6 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. చిత్తూరు, శ్రీశైలం, పలమనేరు ప్రాంతాల్లో ఒక్కో సెం.మీ చొప్పున వాన పడింది. ఇల్లెందు, హైదరాబాద్‌ల్లో 10 సెం.మీ, భద్రాచలం, దుబ్బాక, మేడ్చల్, చేవెళ్ల, మధిర, హకీంపేట ప్రాంతాల్లో 7 సెం.మీ, భీంగల్, వనపర్తి, ఖాన్‌పూర్, గోల్కొండ ప్రాంతాల్లో 6 సెం.మీ చొప్పున వర్షం పడింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ఫైలిన్ తుపాను నేపథ్యంలో కోస్తాలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలవారిని పునరావాస కేంద్రాలకు శుక్రవారం తరలించాలని ఆదేశించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement