ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దాంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఒడిశా నుంచి దక్షణి తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దక్షిణ కోస్తా తీరం వెంబడి ఈదురు గాలులు వేగం తగ్గనున్నట్లు పేర్కొన్నారు. ఈ అల్పపీడనం పూర్తిగా బలహీనమయ్యాకగానీ తర్వాత పరిస్థితి తెలియవన్నారు. గురువారం కోస్తాంధ్రలోని సోంపేటలో గరిష్టంగా 6 సెం.మీ, పాతపట్నం 5, టెక్కలి, విజయవాడలో 4, పాలకొండ, కళింగపట్నం, మందస, పలాసలో మూడు సెం.మీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది.