దూసుకొస్తున్న ‘వార్దా’
విశాఖకు 1,160 కి.మీల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
సాక్షి, విశాఖపట్నం: ఏపీ వైపు తుపాను దూసుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం సాయంత్రం వరకు స్థిరంగా ఉంది. ఆ తర్వాత నుంచి ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ బుధవారం రాత్రికి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,160, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1,220 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం మరో 24 గంటల్లో (శుక్రవారం నాటికి) తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది.
ఇది మచిలీపట్నం-నెల్లూరుల మధ్య ఈనెల 11న తీరం దాటే అవకాశం ఉందని నాసా వాతావరణ విభాగం పేర్కొంది. పెను ప్రభావం చూపనుందని, గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీయవచ్చని అంచనా వేస్తోంది. ఈ నెల 11నుంచి దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లోను వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఈ తుపానుకు హిందూ మహాసముద్ర బేసిన్ జాబితాలోని తదుపరి పేరు ’వార్దా’ను ఖరారు చేయనున్నారు.