మాస్కెరేన్ ద్వీపం
..::కంచర్ల యాదగిరిరెడ్డి
ఈ ఏడాది రుతుపవనాలు గతంకంటే ముందే పలకరిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా ప్రకటించడం తెలిసిందే. రుతుపవనాల రాకకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నందున మునుపటి కంటే వేగంగానే రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ... దేశంలో కోట్ల మంది రైతులతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలను ఐఎండీ ఎలా అంచనా వేస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆసక్తికరమైన ఈ సమాచారం మీ కోసమే...
దేశ ఆర్థిక రంగానికి దిక్సూచి...
నైరుతి రుతుపవనాలు ఈ దేశానికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సకాలంలో వచ్చే వానలే దేశం ఆర్థికంగా, సామాజికంగా బలపడేందుకు అత్యంత కీలకం.
ఇందులో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా కోట్ల మంది రైతులు, రైతు కూలీలకు పస్తులే మిగులుతాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంత ముఖ్యమైన వ్యవహారం కాబట్టే భారత వాతావరణ విభాగం రుతుపవనాల ముందస్తు అంచనాకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. ఏటా ఏప్రిల్‌లో ఒకసారి, ఆ తరువాత రుతుపవనాల రాకకు ముందు, రుతుపవనాల ఆగమనం తరువాత అంచనాలను ప్రకటిస్తుంది.
లెక్కలోకి ఐదు అంశాలు...
రుతుపవనాల అంచనాకు ‘ద ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ (ఈఎస్‌ఎస్‌ఓ)తో కలసి భారత వాతావరణ విభాగం కనీసం 5 అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అవి ఏమిటంటే...
►ఉత్తర అట్లాంటిక్, ఉత్తర పసిఫిక్ మహాసముద్ర భాగాల ఉపరితల ఉష్ణోగ్రతల గ్రేడియంట్ (మారే తీరు) ఒకటి. ఇందుకోసం గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలల్లోని లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారు.
►హిందూ మహాసముద్రంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉపరితల ఉష్ణోగ్రతల వివరాలు.
►తూర్పు ఆసియా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోని సగటు సముద్రమట్ట పీడనం.
►వాయవ్య యూరప్ ప్రాంతంలో జనవరి నెలలో ఉండే ఉపరితల గాలి ఉష్ణోగ్రతలు.
►ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూమధ్య రేఖ వెంబడి పసఫిక్ మహాసముద్రంలో నులివెచ్చటి నీటి పరిమాణం.
వానలు సక్రమంగా పడాలంటే ఈ ఐదు అంశాలు సంతృప్తికరంగా ఉంటేనే సరిపోదు. వాటికి తోడుగా మరికొన్ని అంశాలూ సహకరించాలి. నైరుతి నుంచి మేఘాలతో వీచే గాలులే మన రుతుపవనాలన్నది తెలిసిన విషయమే. మరి ఈ గాలులకు కేంద్రం ఏమిటో తెలుసా? భారత్‌కు సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉండే మాస్కెరేన్ ద్వీప ప్రాంతం! హిందూ మహా సముద్రంలో మడగాస్కర్‌కు ఇది సమాంతరంగా ఉంటుంది.
సాధారణంగా ఏప్రిల్ మధ్యలో అక్కడ అత్యధిక పీడనం ఏర్పడుతుంది. దీన్ని మాస్కెరేన్ హై అంటారు. ఈ పీడనం ఎంత ఎక్కువ ఉంటుందన్న అంశంపై మన రుతుపవనాల తీవ్రత ఆధారపడి ఉంటుంది. పీడనం ఎక్కువగా ఉంటే రుతుపవన గాలులూ బలంగా ఉంటాయి. మాస్కెరేన్ ద్వీపం ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడటం ఆలస్యమైతే రుతుపవనాల రాక కూడా ఆలస్యమవుతుంది. ఎక్కడో అంటార్కిటికా ప్రాంతంలో జరిగే కొన్ని అంశాల ఆధారంగా ఈ మాస్కెరేన్ ద్వీపం వద్ద అధిక పీడనం ఏర్పడుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
దిశ మార్చుకొని..
మాస్కరేన్ ద్వీపం వద్ద అధిక పీడనంతో ఏర్పడే గాలులు వాయవ్య దిశగా కదిలి ఆఫ్రికాలోని సొమాలియా ప్రాంతాన్ని ఢీకొంటాయి. అక్కడి ఎత్తుపల్లాలు, స్థల ఆకృతి ఆధారంగా గాలులు తూర్పు వైపునకు కదులుతాయి. భూమధ్య రేఖను దాటాక భూభ్రమణం వల్ల కలిగే కొరియాలిస్ శక్తి ప్రభావానికి లోనవుతాయి.
దీని ప్రభావం వల్ల గాలులు దిశ మార్చుకొని నైరుతి దిక్కుగా కదులుతాయి. ఈ గాలుల్లో ఒక భాగం అరేబియా సముద్రం వైపు, ఇంకో భాగం బంగాళాఖాతం వైపు విడిపోతాయి. నైరుతి రుతుపవనాలు దేశంలో మొట్టమొదట తాకే కేరళ రాష్ట్రం అరేబియా సముద్ర తీరంలోనే ఉంటుంది.
వేసవి మంట దారి చూపుతుంది
రోహిణి కార్తెలో రోకళ్లు పగిలేంత ఎండ ఉంటే... రుతుపవనాల్లో అంతేస్థాయిలో వానలూ ఉంటాయని రైతులు అంచనా వేసుకుంటారు. అయితే దీని వెనుక శాస్త్రీయత కూడా లేకపోలేదు. ఎందుకంటే అరేబియా సముద్రం వైపు నుంచి కదులుతున్న రుతుపవనాలను ఆకర్షించేందుకు వేసవి ఎండలు ఉపయోగపడుతాయి. తుపానులు, వాయుగుండాలు, అల్పపీడనాలు కూడా రుతుపవనాలను సముద్రం నుంచి నేలమీదకు తీసుకొచ్చేందుకు ఉపయోగపడతాయి. గాలులు ఎప్పుడైనా అధిక పీడనం నుంచి తక్కువ పీడనం ఉన్న వైపునకు ప్రయాణిస్తాయి. నీరు పల్లం వైపు ప్రవహించినట్లు.
వేసవిలో దేశం ఉత్తర దిక్కు నుంచి వీచే చల్లటిగాలులను హిమాలయ పర్వత శ్రేణి అడ్డుకుంటూ నేల బాగా వేడెక్కేందుకు సాయప డుతూంటుంది. దేశానికి ఇరువైపులా ఉన్న సముద్రాల ఉపరితల జలాలూ వేడెక్కుతాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా కారణంగా నేలపై పీడనం తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో అటు అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం ఇటు బంగాళాఖాతంలోనూ పీడనం ఎక్కువగా ఉంటుంది. తగిన సమయంలో అరేబియా సముద్రం వైపు నుంచి రుతుపవన గాలులు దేశం మీదకు వీస్తాయి.
ఎల్ నినో, లా నినా ఎఫెక్ట్
ఎక్కడో దక్షిణ అమెరికా ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు వెచ్చబడినా (ఎల్ నినో) లేక చల్లబడినా (లా నినా) దాని ప్రభావం మన రుతుపవనాలపై ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు కరవులు ఏర్పడ్డ ప్రతిసారీ ఎల్ నినో పరిస్థితులే ఉన్నాయి. అయితే ఈ రెండు పరిస్థితులను గుర్తించడం ఎంతో సంక్లిష్టం. దీంతోపాటు హిందూ మహాసముద్రంలోనూ ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు రుతుపవనాలపై ప్రభావం చూపుతాయని 1999లో జపాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఎన్.హెచ్.సాజీ పరిశోధన ద్వారా నిరూపించారు.
దీనినే ఇండియన్ ఓషియన్ డైపోల్ అని పిలుస్తారు ‘పాజిటివ్, నెగెటివ్, న్యూట్రల్ అని మూడు దశలుంటాయి. పాజిటివ్ దశలో హిందూ మహాసముద్రం పశ్చిమ ప్రాంతంలో ఉపరితల జలాలు వెచ్చగా ఉంటాయి. ఈ పరిణామం రుతుపవనాలకు ఊపునిస్తుంది. దీనికి భిన్నంగా ఉంటే నెగెటివ్. మార్పులేవీ లేకపోతే న్యూట్రల్. 1994, 2006లలో ఎన్ నినో ఏర్పడ్డా దేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడకపోవడానికి ఇండియన్ డైపోల్ పాజిటివ్‌గా ఉండటమే కారణం’ అని ఆయన అంచనా వేశారు.
రుతుపవనాల లెక్కలిలా..
►నైరుతీ రుతుపవనాలు దక్షిణాసియాలోని 25 దేశాలపై ప్రభావం చూపుతాయి. రుతుపవనాల వల్ల తూర్పు నుంచి పశ్చిమంగా 18 వేల కి.మీ. మేర, దక్షిణం నుంచి ఉత్తరానికి సుమారు 6 వేల కి.మీ. మేర వానలు కురుస్తాయి.
►దేశ తొలి రుతుపవన అంచనా 1886 జూన్ 4న వెలువడింది. 1871 నుంచి 2006 వరకూ రుతుపవనాలు 94 సార్లు సాధారణంగా ఉంటే 23 ఏళ్లు కరువులు ఏర్పడ్డాయి.
►50 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా కురిసిన సగటు వర్షపాతంలో 96–104 శాతం పడితే సాధారణ వర్షపాతంగా లెక్కిస్తారు. 90 శాతం కంటే తక్కువగా ఉంటే (వర్షాభావం) కరువు కింద లెక్క.
►సాధారణ పరిస్థితుల్లో జూన్ తొలి వారానికల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణాదిని మొత్తాన్ని కమ్మేస్తాయి. ఆ తరువాత 15 రోజుల్లో దేశంలోని సగం ప్రాంతానికి విస్తరిస్తాయి. జూలై మధ్య నాటికి దేశం మొత్తమ్మీద ప్రభావం చూపుతాయి.
Comments
Please login to add a commentAdd a comment