maximum temperature
-
సూర్యుడి భగభగ.. ఎండ వేడి తట్టుకోలేక 54 మంది మృత్యువాత
న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీతో సహా తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే ముచ్చెమటలు పడుతున్నాయి. కాళ్లకు చెప్పులు లేకుండా, నెత్తి మీద రుమాలు లేకుండా బయట అడుగు పెడితేా.. అంతే సంగతులు. కాళ్లకు బొబ్బలు కట్టడం ఖాయం, మాడు పగలడం ఖరార్. పైగా, వేడి గాలుల బీభత్సం. తెల్లారింది మొదలు రాత్రి 10 గంటల దాకా భానుడి భగభగలే.ఎంత వేడిని తట్టుకోలేక దేశ వ్యాప్తంగా 54 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 32 మంది వడదెబ్బతో మరణించారు. ఔరంగాబాద్‌లో 17 మంది, అర్రాలో ఆరుగురు, గయాలో ముగ్గురు, రోహతాస్‌లో ముగ్గురు, బక్సర్‌లో ఇద్దరు, పాట్నాలో ఒకరు మరణించారు.. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోయారు. జార్ఖండ్‌లోని పాలము, రాజస్థాన్‌లలో ఐదుగురు చొప్పున మరణించగా, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒకరు మరణించారు.ఇక ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు 45.6 డిగ్రీలను దాటేసింది. సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో మే 31 నుంచి జూన్ 1 మధ్య.. హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో మే 31న దుమ్ము తుఫాను రానున్నట్లు భారత వాతావరణశాఖ అంచనా వేసింది. మే 31, జూన్ 1న వాయువ్య భారత్‌లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షతం నమోదుకానున్నట్లు పేర్కొంది. రోహిణి కార్తె తన ప్రతాపాన్ని చూపుతుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. రుతుపవనాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు మాడు అదిరిపోయేలా ఎండలు అదరగొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోయారు. ఒక ఢిల్లీలోనే కాదు..ఉత్తర భారత దేశంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ప్రజలు విల విలాడిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. బుధవారం తొలిసారిగా రికార్డు స్థాయిలో మంగేష్ పూర్లో ఏకంగా 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏడారి ప్రాంతమైన రాజస్థాన్ కన్నా ఎక్కువగా రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఢిల్లీలోని నజాఫ్ గడ్, పిఠంపుర సహా మరికొన్ని ప్రాంతాల్లో నేడు 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ భారతదేశంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పలకరిస్తుంటే.. ఉత్తర భారతం భానుడి భగభగలతో ఠారెత్తిపోతోంది.ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎండతీవ్రతకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. జనాలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఏసీలు, కూలర్లు వాడకం ఎక్కువ అయ్యింది. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో 8వేల302 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడింది. నీటిని వృధా చేసిన వారికి రెండు వేల జరిమానా విధిస్తున్నారు. రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి. వేసవి విడిదికోసం ఉత్తర భారతం వెళ్లిన పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో ఇంతటి మార్పులు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు జనం.రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో సహా అనేక ప్రాంతాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ మాదిరిగానే వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోని ఫలొదిలో 51 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
అధిక ఉష్ణోగ్రత... ఆపై ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాడుపగిలే ఎండ, వడగాడ్పులు... మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోత. ఇదీ శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణ పరిస్థితి. రాష్ట్రంలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్లో ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ♦ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఈ నెల 28 నుంచి 30 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ప్రచండ భానుడు.. రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లురులో 45.2 డిగ్రీల సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే మహబూబ్‌నగర్‌లో 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు మించి నమోదయ్యాయి.మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 3.2 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మిగతా ప్రాంతాల్లో ఒక డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పెద్దలు, పిల్లలు, దీర్ఘకాలిక సమస్యలున్న వారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.ఆకు రాల్చిన అభయారణ్యం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల అభయారణ్యం వేలాది ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అన్ని రకాల జంతువులు, పక్షులకు నిలయమిది. సరస్సు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం పచ్చదనంతో అన్ని రకాల పక్షుల అలజడితో చూడముచ్చటగా ఉండేది. వేసవిలో మండుతున్న ఎండలతో చెట్లన్నీ ఆకురాలడంతో అటవీ ప్రాంతమంతా బోసిపోయి ఇలా కనిపిస్తోంది. – నర్సంపేట -
అగ్ని‘గుండం’.. రామగుండంలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మంగళవారం మండిపోయింది. అత్యధికంగా రామగుండంలో 44.8డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 43.8డిగ్రీలు నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణల మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాగల మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
వేసవి ప్రయాణానికి రెడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు ప్రయాణం కడుతున్నారు. వరుసగా రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు.. ఈ విడత లేకపోవడం కూడా పర్యాటక రంగంలో సందడిని పెంచింది. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు పట్టణ వాసులు మొగ్గు చూపిస్తున్నారు. పర్వత, కొండ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు ఈ విడత డిమాండ్ అనూహ్యంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, ఫ్లయిట్ బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఈ వేసవిలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది విహార యాత్రలకే మొగ్గు చూపిస్తున్నట్టు ఓయో సర్వేలో తెలిసింది. 64 శాతం మంది వేసవిలో సెలవులు పెట్టేసి నచ్చిన ప్రదేశానికి వెళ్లొద్దామని అనుకుంటుంటే.. 94 శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఉత్తరాదిలో వీటికి డిమాండ్.. ఆన్లైన్లో వివిధ పోర్టళ్లపై బుకింగ్ తీరును పరిశీలిస్తే.. ఉత్తరాదిలో రిషికేష్, హరిద్వార్, సిమ్లా, ముస్సోరీ, డెహ్రాడూన్ ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లోని హోటల్స్, రిసార్ట్‌ల్లో దాదాపు గదులన్నీ బుకింగ్ అయిపోయాయి. రూమ్ టారిఫ్‌లు కరోనాకు ముందుతో పోలిస్తే 10–15 శాతం అధికంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్‌లోని అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హోటళ్లలో మే నుంచి జూన్ చివరికి నాటికి బుకింగ్‌లు పూర్తిగా అయిపోయాయి. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డిమాండ్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు, సగటు రూమ్ చార్జీలు 10 శాతం పెరిగినట్టు ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూపు సీఈవో అఖిల్ అరోరా తెలిపారు. ఎస్సైర్ గ్రూపునకు బిమ్టల్, జిమ్‌కార్బెట్ ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నా ప్రయాణాలకు డిమాండ్ తగ్గలేదని అరోరా చెప్పారు. పుంజుకున్న బుకింగ్‌లు.. వేసవి కోసం కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అరుణాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలు ఆకర్షణీయంగా (అధిక డిమాండ్) మారిపోయాయి. దేశం బయట దుబాయి, మాల్దీవులు, థాయిలాండ్, యూఎస్‌కు డిమాండ్ నెలకొంది. ‘‘మే, జూన్ నెలలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రజలు ఎక్కువ రోజుల పాటు విడిది కోసం వెళ్లాలని చూస్తున్నారు’’అని ఈజ్‌మైట్రిప్ ప్రెసిడెంట్ హిమంక్ త్రిపాఠి తెలిపారు. ఫ్లయిట్ బుకింగ్‌లు కరోనా ముందు నాటికి చేరినట్టు మేక్మైట్రిప్ సీఈవో రాజేష్ మాగోవ్ వెల్లడించారు. సులభ వాయిదాల్లో రుణాలు లభించడం డిమాండ్‌కు తోడ్పడుతున్నట్టు ఆయన చెప్పారు. రికవరీ బలంగా.. 2022 ఏప్రిల్ నెలలో సగటు రోజువారీ ఫ్లయిట్ డిపార్చర్లు 2,726గా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో రోజువారీ 2,000తో పోలిస్తే మంచి వృద్ధి కనిపిస్తోంది. మార్చి నెలలో రోజువారీ డిపార్చర్లు 2,588తో పోల్చి చూసినా ఏప్రిల్‌లో 5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విమానాల్లో ప్రయాణికుల భర్తీ కూడా గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో 36 శాతం అధికంగా ఉంది. గత నెలలో ఒక ఫ్లయిట్లో సగటు ప్రయాణికుల సంఖ్య 128గా ఉంది. కరోనాకు ముందు సగటు ప్రయాణికులు 135 కంటే కొంచెం తక్కువగా ఉంది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏప్రిల్‌లో వార్షికంగా చూస్తే 83 శాతం పెరిగి 10.5 మిలియన్లుగా ఉంది. కరోనాకు ముందున్న 11 మిలియన్ల కంటే ఇది స్వల్పంగానే తక్కువ. పెంటప్ డిమాండ్ ఈ ఏడాది పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రా స్థలాలకు డిమాండ్ గణనీయంగా ఉండడానికి.. గత రెండు వేసవి సీజన్లలో ప్రయాణం చేయలేని వారు ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తుండడం వల్లేనని అనుకోవాలి. గుడ్ ఫ్రైడే, విసు వీక్ సందర్భంగా 8 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయని.. 2022లో ఇదే అత్యధికమని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ షీరంగ్ గాడ్బోల్ తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
మండుతున్న సూర్యుడు
సాక్షి, హైదరాబాద్: ఇంకా జనవరి నెల కూడా ముగియలేదు కానీ, అప్పుడే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సోమవారం రాష్ట్రంలో అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో ఏకంగా 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మం, నిజామాబాద్‌ల్లో 34 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, రామగుండంలలో 33 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్, మెదక్‌ల్లో 32 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఇదిలావుండగా మధ్య భారతం నుంచి తుపాన్ వ్యతిరేక గాలులు వీస్తుండటంతో వేడి వాతావరణం నెలకొని ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితి రానున్న మరో రెండ్రోజులు ఉంటుందని తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగానే నమోదవుతాయని వెల్లడించారు. -
అప్పుడే ‘సన్’స్ట్రోక్
సాక్షి,సిటీబ్యూరో: వేసవి ప్రారం భంలోనే ప్రచండ భానుడి ప్రతాపానికి గ్రేటర్ సిటీజన్లు విలవిల్లాడుతున్నారు. ఆదివారం అత్యధికంగా 36.9 డిగ్రీలు, కనిష్టంగా 20.3 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటి దాకా నమోదైన అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచే ఎండ చుర్రు మనిపించడంతో వివాహాది శుభకార్యాల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లిన వృద్ధులు, చిన్నారులు ఎండ తీవ్రతకు సొమ్మసిల్లారు. ఎండ తీవ్రత పెరగడంతో కొబ్బరి బొండాలు, లస్సీ, బటర్‌మిల్క్, పండ్ల రసాలకు గిరాకీ అమాంతం పెరి గింది. మరో 48 గంటల్లో గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ సీజన్లో ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని.. వేడిగాలుల ఉధృతి అధికంగా ఉంటుందని బేగం పేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. -
భగ భగ ...సూర్య@ 42.4
నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీఠారెత్తిస్తున్నాయి. మంగళవారం గరిష్టంగా 42.4 డిగ్రీలు, కనిష్టంగా 28.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎండతీవ్రత అధికంగా ఉండడంతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పలువురు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కొందరు వడదెబ్బ బారిన పడ్డారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. -
రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు
సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు అధికం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఆకాశం మేఘావృతమై ఉండ టంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఆరు డిగ్రీల వరకు అధికంగా నమోద య్యాయని వాతావరణ అధికారులు తెలి పారు. భద్రాచలం, రామగుండంలలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు కాగా, ఈ రెండు చోట్ల 23, 21 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యారుు. హైద రాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల చొప్పున అధికంగా నమోదయ్యాయి. హన్మకొండ, నల్లగొండ ల్లో 4 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యారుు. హకీంపేట్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో 3 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు భద్రాచలం, హకీంపేట్, ఖమ్మం, హన్మకొండ, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యారుు. ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా.. 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 3 డిగ్రీలు అధికంగా 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలావుండగా గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ విభాగం తెలిపింది. అరుుతే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని... కేవలం ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో కాస్తంత ఉష్ణోగ్రతలు పెరగనున్నారుు. -
భానుడు భగభగ
మండుతున్న సూరీడు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు రహదారులు నిర్మానుష్యం పెరుగుతున్న వడదెబ్బ మృతులు పోచమ్మమైదాన్ : భానుడు భగ్గు మంటున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు గరిష్టస్థారుుకి చేరుకుంటున్నారుు. వాతావరణంలో పెనుమార్పులు సంభవించడంతో ఏప్రిల్ చివరి వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మొదటి వారంలోనే నమోదవుతున్నాయి. ప్రజలు ఉదయం 10 గంటల తరువాత బయటకురావడానికి జంకుతున్నారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు వస్తున్నారు. సూర్య ప్రతాపానికి మధ్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నారుు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సూర్య @40 డిగ్రీలు వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నారుు. శుక్రవారం 39.5 డిగ్రీలు నమోదు కాగా, శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వేడి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ప్రజలు ముందస్తుగా శీతల పానీయూల వైపు పరుగులు తీస్తున్నా రు. ఇళ్లలో కూలర్లు, ఏసీ లు అమర్చుకుంటున్నా రు. బయటకు వెళ్లేటప్పు డు గొడుగు, టోపీలు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్తున్నారు. ఇప్పటికి ఐదుగురి మృతి ఈ వేసవి సీజన్లో ఇప్పటివరకు వడదెబ్బతో ఐదుగురు మృతి చెందారు. ఈ నెల 2న నెక్కొండకు చెందిన పసునూటి రాములు(65), గుడూరుకు చెందిన గుగులోతు దాని (70), మార్చి 28న కురవి మండలం మోద్గులగూడేనికి చెందిన చింతిరాల రాములు (58) మృతిచెందారు. తాజాగా ఆదివారం నర్సింహులపేటకు చెందిన బిక్షం(60), కొడకండ్ల మండలం రత్యాతండాకు చెందిన సునీత మృతిచెందారు. -
మండిపడ్డ సూరీడు
సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి! సాక్షి, విశాఖపట్నం : వర్షాకాలం వచ్చినా ఉష్ణోగ్రతల తీవ్రత మాత్రం తగ్గుముఖం పట్టలేదు. పగటిపూట బయటికెళ్లేందుకు భయపడే పరిస్థితి మళ్లీ నెలకొంది. శుక్రవారం ఎండ వేడికి తీవ్ర ఉక్కబోత తోడై జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా 37.2 డిగ్రీలు నమోదయింది. వాతావరణంలో తేమ కూడా 69 నుంచి 72 శాతంగా ఉంది. దీంతో శరీరం జిడ్డుబారి జిల్లావాసులు అవస్థలు పడ్డారు. వేసవి తర్వాత ఈ మధ్య కాలంలో ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే ప్రథమమని వాతావరణ నిఫుణులు చెబున్నారు. గతేడాది ఈ సమయానికే రుతుపవనాలు చురుగ్గా ఉండి, భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం పూర్తిగా ఆంధ్రపై లేకపోవడం, అల్పపీడనం, వాయుగుండాలు కూడా రాష్ట్రంపై కరుణ చూపకపోవడం ఉష్ణతీవ్రతకు కారణమని నిపుణులు తెలిపారు. మరో రెండ్రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఖరీఫ్ ముందుకు సాగడం లేదు. అల్పపీడనాలు ముఖం చాటేయడంతో రైతుల కష్టాలు ప్రారంభమయ్యాయి. కార్తెలన్నీ అవిరైనా సేద్యం మాత్రం కదలడం లేదు. -
పగలు గరం గరం - సాయంత్రం వర్ష రాగం
రోజూలాగే మంగళవారం పగలంతా భానుడు భగభగలాడి నగరజీవుల్ని ‘ఉక్క’రి బిక్కిరి చేశాడు.42 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రతాపం చూపాడు. సాయంత్రం నాలుగు గంటల వరకూ నిప్పులు చెరిగాడు. అప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా నల్లని మేఘాలు దట్టంగా అలముకుని చల్లటి గాలులతో ఆహ్లాదాన్ని కలిగించాయి. ఉరుములు, మెరుపులతో అరగంటపాటు భారీగానే వర్షం కురిసి వెలిసింది. మండు వేసవిలో ఈ అనుకోని వాన నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. - సాక్షి, విశాఖపట్నం ఎండ.. వాన పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు వర్షపాతం 2 సెం.మీ. సాయంత్రం సేదతీరిన జనం విశాఖపట్నం : భానుడి భగభగలకు పగలంతా నగరంలో సెగలు రేగాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు జనం భయపడ్డారు. వాల్తేరులో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదుకాగా, విమానాశ్రయం వద్ద 42 డిగ్రీలు నమోదయింది. తీవ్ర వడగాల్పులు కూడా ఆవరించి ఉండడంతో ఉష్ణోగ్రత తీవ్రత పెరిగింది. ఇదంతా సా యంత్రం వరకే. సాయంత్రానికి ఆకాశం మబ్బుల ముసుగేసుకుంది. ఆరంభంలో ఉరుములు.. మెరుపులు.. ఈదురు గాలులతో కాసేపు బీభత్స వాతావరణం అలముకుంది. అనంతరం మొదలైన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. రోడ్లు కాల్వలు పొంగిపొర్లాయి. వెంకటేశ్వరమెట్ట, కనకలదిబ్బ, నీలమ్మవేపచెట్టు, సీ హార్స్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో మంగళవారంనాటి భారీ వర్షాలకు చెట్లు నేలకొరిగాయి. సాయంత్రం కురిసిన వర్షపాతం విమానాశ్రయం వద్ద 2 సెం.మీ.గా నమోదయినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ కోతలు తోడయ్యాయి పగటి పూట ఉష్ణోగ్రతలకు తోడు విద్యుత్ కోతలతో నగరవాసులు నరకం చవి చూశారు. గత కొన్ని రోజులుగా వడగాల్పుల వాతావరణంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో అత్యవసర కోతలు అమలు చేస్తున్నారు. నగరంలో పగటిపూట విడతలవారీ సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్ కోతలు విధించారు. సాయంత్రం వాన బీభత్సానికి ముందు జాగ్రత్త చర్యలుగా విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆ సమయంలో వర్షం పడుతుండటం.. అంతకు ముందు నుంచే వాతావరణం చ ల్లబడటంతో కాస్త ఉపశమనం కలిగినట్టయింది. -
ఢిల్లీ @ 47.8
62 ఏళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరవాసులు భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణతాపం, వేడిగాలులకు వణికిపోతున్నారు. ఢిల్లీలో ఆదివారం రికార్డు స్థాయిలో 47.8 డిగ్రీ సెల్షియస్ల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత 62 ఏళ్లలో ఢిల్లీలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే నని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఎండవేడికి తరచూ కరెంటు కోతలూ తోడవుతుండటంతో ఢిల్లీవాసుల ఇక్కట్లు మరింత పెరుగుతున్నాయి. రాజధానితోపాటు ఉత్తరాది ప్రాంతాల ప్రజలూ ఉష్ణతాపానికి విలవిల్లాడుతున్నారు. ఢిల్లీలో సోమవారం కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతాయని నమోదు కావచ్చని ఐఎండీ తెలిపింది. -
‘ఫ్రై’ డే సూర్యః45
రామగుండంలో అత్యధికం ఈ ఏడాది ఇదే రికార్డు జగిత్యాలలో 44 డిగ్రీలు ఎల్ నినో ఎఫెక్ట్‌తో ఎండలు వడదెబ్బతో మూడు నెలల్లో సుమారు 52 మంది మృతి జిల్లాలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా 40-42 డిగ్రీల మధ్య కదలాడిన ఉష్ణోగ్రత శుక్రవారం ఒక్కసారిగా 45 డిగ్రీలుగా నమోదైంది. ఈ సంవత్సరం ఇదే గరిష్ట ఉష్ణోగ్రతగా రికార్డయింది. సాధారణంగా వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయి. కానీ, ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలపై ఎల్ నినో ప్రభావం ఉండటంతో ఎండలు మరింత ఎక్కువయ్యాయి. రెండు రోజుల నుంచి భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఇంకా ఎక్కువే నమోదవుతున్నాయి. ప్రాజెక్టుల్లోని బొగ్గు అంతర్గతంగా మండుతూ వచ్చే వేడితోపాటు ఇనుప వస్తువులు ఎక్కువగా ఉండడం వల్ల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. యంత్రాల వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఎండలకు తల్లడిల్లుతున్నారు. సింగరేణి యాజమాన్యం తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకున్నా అవి సరిపోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఇక పగటి పూట జనసంచారం తగ్గిపోయి రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు వస్తున్నారు. ఎండ ప్రభావానికి వ్యాపారాలు సాగడం లేదు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు 52 మంది వడదెబ్బకు మృతి చెందారు. ఎల్-నినో... లా-నినో ప్రపంచ వాతావరణంలో ఎల్-నినో, లా-నినో అనే రెండు వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఈ రెండు వ్యవస్థలు కలుషితమవుతూ వాతావరణాన్ని మార్చుతున్నాయి. ఈ వ్యవస్థలు భూమధ్య రేఖ సమీపంలో, పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉంటాయి. వీటిలో ‘ఎల్-నినో’ తీవ్రమైన ఉష్ణోగ్రతలకు, దుర్భిక్ష పరిస్థితులకు కారణమవుతుంది. ‘లా-నినో’ కుండపోత వర్షాలకు, పెను తుపాన్లకు కారణమవుతుంది. కొన్నేళ్లుగా ఈ రెండు వ్యవస్థలు బంగాళాఖాతంలోని వాతావరణాన్ని ఒకదాని తర్వాత ఒకటి గట్టిగా ప్రభావితం చేస్తున్నాయి. వీటి మూలంగానే ఎప్పుడు లేని ఆకాల వర్షాలు, వడగాల్పులు వస్తూ ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి ప్రభావంతో నెల రోజుల ముందుగానే ఎండల ప్రభావం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రమవుతున్నందున వాతావరణంలో ఇంకా పలుమార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఎల్-నినో ఎందుకంటే.. ప్రకృతి వనరులను ఇష్టమొచ్చినట్లుగా కొల్లగొట్టడమే ఎల్-నినోకు ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రకృతి సమతుల్యానికి అడవులు ఎంతో కీలకం కాగా... వాటిని విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారు. అడువుల్లో అణిగి ఉండే ధూళి రేణువులు, అడవులను నరికి వేయడం వల్ల చెలరేగిపోతాయి. ఆ రేణువులకే రేడియేషన్ సోకడం వల్ల వాతావరణం వేడెక్కిపోతుంది. అడవులు ఎడారులుగా మారినకొద్దీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటుంది. బంగాళాఖాతం వాతావరణం ఆసియా-పసిఫిక్ ప్రాంత వాతావరణ వ్యవస్థలోని ఆటుపోట్ల మీద ఆధారపడటంతో, ఎల్-నినో పరిధులను కూడా దాటి పసిఫిక్ మహా సముద్ర జలాలు వచ్చే కొద్ది నెలల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అటవీ సంపద నాశనం వల్లే... - డాక్టర్ లక్ష్మణ్, పరిశోధన స్థానం డెరైక్టర్, పొలాస అటవీ సంపదను నాశనం చేయడం వల్లే విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం కురవాల్సిన సమయంలో ఎండ కొట్టడం.. ఎండ కొట్టాల్సిన సమయంలో వానలు కురవడం చూస్తున్నాం. ఎల్-నినో ప్రభావం వల్లే ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగి 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌లో కదలాడుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం.