వేసవి ప్రయాణానికి రెడీ | More Indians Ready for summer travel | Sakshi
Sakshi News home page

వేసవి ప్రయాణానికి రెడీ

Published Thu, May 12 2022 12:33 AM | Last Updated on Thu, May 12 2022 12:33 AM

More Indians Ready for summer travel - Sakshi

న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు ప్రయాణం కడుతున్నారు. వరుసగా రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు.. ఈ విడత లేకపోవడం కూడా పర్యాటక రంగంలో సందడిని పెంచింది. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు పట్టణ వాసులు మొగ్గు చూపిస్తున్నారు. పర్వత, కొండ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు ఈ విడత డిమాండ్‌ అనూహ్యంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

హోటళ్లు, ఫ్లయిట్‌ బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఈ వేసవిలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది విహార యాత్రలకే మొగ్గు చూపిస్తున్నట్టు ఓయో సర్వేలో తెలిసింది. 64 శాతం మంది వేసవిలో సెలవులు పెట్టేసి నచ్చిన ప్రదేశానికి వెళ్లొద్దామని అనుకుంటుంటే.. 94 శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు.

ఉత్తరాదిలో వీటికి డిమాండ్‌..  
ఆన్‌లైన్‌లో వివిధ పోర్టళ్లపై బుకింగ్‌ తీరును పరిశీలిస్తే.. ఉత్తరాదిలో రిషికేష్, హరిద్వార్, సిమ్లా, ముస్సోరీ, డెహ్రాడూన్‌ ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. ఈ ప్రాంతాల్లోని హోటల్స్, రిసార్ట్‌ల్లో దాదాపు గదులన్నీ బుకింగ్‌ అయిపోయాయి. రూమ్‌ టారిఫ్‌లు కరోనాకు ముందుతో పోలిస్తే 10–15 శాతం అధికంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్‌లోని అన్ని ఇంటర్నేషనల్‌ బ్రాండెడ్‌ హోటళ్లలో మే నుంచి జూన్‌ చివరికి నాటికి బుకింగ్‌లు పూర్తిగా అయిపోయాయి. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డిమాండ్‌ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు, సగటు రూమ్‌ చార్జీలు 10 శాతం పెరిగినట్టు ఎస్సైర్‌ హాస్పిటాలిటీ గ్రూపు సీఈవో అఖిల్‌ అరోరా తెలిపారు. ఎస్సైర్‌ గ్రూపునకు బిమ్టల్, జిమ్‌కార్బెట్‌ ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నా ప్రయాణాలకు డిమాండ్‌ తగ్గలేదని అరోరా చెప్పారు.

పుంజుకున్న బుకింగ్‌లు..
వేసవి కోసం కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అరుణాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలు ఆకర్షణీయంగా (అధిక డిమాండ్‌) మారిపోయాయి. దేశం బయట దుబాయి, మాల్దీవులు, థాయిలాండ్, యూఎస్‌కు డిమాండ్‌ నెలకొంది. ‘‘మే, జూన్‌ నెలలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రజలు ఎక్కువ రోజుల పాటు విడిది కోసం వెళ్లాలని చూస్తున్నారు’’అని ఈజ్‌మైట్రిప్‌ ప్రెసిడెంట్‌ హిమంక్‌ త్రిపాఠి తెలిపారు. ఫ్లయిట్‌ బుకింగ్‌లు కరోనా ముందు నాటికి చేరినట్టు మేక్‌మైట్రిప్‌ సీఈవో రాజేష్‌ మాగోవ్‌ వెల్లడించారు. సులభ వాయిదాల్లో రుణాలు లభించడం డిమాండ్‌కు తోడ్పడుతున్నట్టు ఆయన చెప్పారు.  

రికవరీ బలంగా..
2022 ఏప్రిల్‌ నెలలో సగటు రోజువారీ ఫ్లయిట్‌ డిపార్చర్‌లు 2,726గా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో రోజువారీ 2,000తో పోలిస్తే మంచి వృద్ధి కనిపిస్తోంది. మార్చి నెలలో రోజువారీ డిపార్చర్‌లు 2,588తో పోల్చి చూసినా ఏప్రిల్‌లో 5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విమానాల్లో ప్రయాణికుల భర్తీ కూడా గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో 36 శాతం అధికంగా ఉంది. గత నెలలో ఒక ఫ్లయిట్‌లో సగటు ప్రయాణికుల సంఖ్య 128గా ఉంది. కరోనాకు ముందు సగటు ప్రయాణికులు 135 కంటే కొంచెం తక్కువగా ఉంది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏప్రిల్‌లో వార్షికంగా చూస్తే 83 శాతం పెరిగి 10.5 మిలియన్లుగా ఉంది. కరోనాకు ముందున్న 11 మిలియన్ల కంటే ఇది స్వల్పంగానే తక్కువ.

పెంటప్‌ డిమాండ్‌
ఈ ఏడాది పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రా స్థలాలకు డిమాండ్‌ గణనీయంగా ఉండడానికి.. గత రెండు వేసవి సీజన్లలో ప్రయాణం చేయలేని వారు ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తుండడం వల్లేనని అనుకోవాలి. గుడ్‌ ఫ్రైడే, విసు వీక్‌ సందర్భంగా 8 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయని.. 2022లో ఇదే అత్యధికమని ఓయో చీఫ్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ షీరంగ్‌ గాడ్బోల్‌ తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో ఈ డిమాండ్‌ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement