నీళ్లో రామ చంద్రా.. | Water shortages at the beginning of summer | Sakshi
Sakshi News home page

నీళ్లో రామ చంద్రా..

Published Sat, Mar 22 2025 4:24 AM | Last Updated on Sat, Mar 22 2025 4:24 AM

Water shortages at the beginning of summer

వేసవి ప్రారంభంలోనే మంచినీటికి కటకట

మొరాయిస్తున్న రక్షిత మంచి నీటి పథకాలు

ప్రత్యామ్నాయం చూపని కూటమి సర్కారు

ప్రజలు ధర్నాలకు దిగుతున్నా స్పందించని వైనం

సాక్షి నెటవర్క్‌ : రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభంలోనే మంచి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. పలు ఊళ్లలో బోరు బావులు మరమ్మతులకు నోచుకోక పని చేయడం లేదు. మరికొన్ని పట్టణాల్లో కొన్ని కాలనీలకు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. ట్యాంకర్లతో సరఫరా ప్రణాళికాబద్ధంగా జరగక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

బిందెడు తాగు నీటి కోసం ప్రజలు శివారు ప్రాంతాల్లోని బావులు, వంకల వద్దకు కష్టాలకోర్చి వెళుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.వేసవి ముంగిట తాగునీటి ఎద్దడికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయక పోవడం వల్ల సమస్య మరింత జఠిలం కానుంది. తీవ్ర నీటి ఎద్దడి, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి, నీటి సరఫరాకు చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఎక్కడికక్కడ ప్రజలు మండిపడుతున్నారు.

సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలోనే మంచి నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ పలుచోట్ల నీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతుండటం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. 

వంశధార చెంత.. గొంతు తడవక చింత 
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదీ తీరాన ఉండే హిరమండలం మేజర్‌ పంచాయతీలో తాగునీటికి కటకట ఏర్పడింది. ఇటు కుళాయిల ద్వారా నీటి సరఫరా జరగక.. అటు ట్యాంకర్ల ద్వారా నీరు అందక మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 

చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. ఇక్కడ ఎప్పుడో దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్, మంచి నీటి పథకం సామర్థ్యం చాలడం లేదు. అటు సమగ్ర మంచినీటి పథకం, జలజీవన్‌ మిషన్‌ వంటి పథకాలు ఉన్నా ఏవీ అక్కరకు రావడం లేదు. 

ఏలూరులో రోడ్డెక్కిన మహిళలు
వేసవి ప్రారంభంలోనే ఏలూరు నగరంలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. స్థానిక 29వ డివిజన్‌ కుమ్మరి రేవు ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చాలంటూ స్థానిక మహిళలు ఏలూరు కార్పొరేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్‌ ఎ.భాను ప్రతాప్‌కు వినతి పత్రం అందజేశారు. కుమ్మరి రేవు ప్రాంతంలో దాదాపు వెయ్యి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం రోజుకు ఒక ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు.

అవి కాస్తా ముందు ఉన్న వారికి అందుతున్నాయని, కాలనీ లోపల ఉండే వారికి దొరకడం లేదని స్థానికులు చెబుతున్నారు. డబ్బు పెట్టి నీళ్ల క్యాన్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటకు, స్నానానికి, దుస్తులు ఉతికేందుకు సైతం నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం తమకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించాలని కోరుతున్నారు.

పుట్టపర్తిలో దాహం దాహం
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం అయిన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. రూ.వేల కోట్లు వెచ్చించి అనేక రాష్ట్రాలకు తాగునీరు అందించి జల దాతగా పేరు గాంచిన సత్యసాయి బాబా నడయాడిన పుట్టపర్తి ప్రాంతంలోనే తాగునీటి కష్టాలు నెలకొనడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో నెల రోజుల నుంచి తాగునీటి సమస్య నెలకొంది. 

రెండో వార్డు పెద్ద బజారు వద్ద గురువారం అర్ధరాత్రి మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.  పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు తారకరామనగర్, 9వ వార్డు కర్ణాటక నాగేపల్లి, 2వ వార్డు పెద్ద బజార్, 6వ వార్డు చిత్రావతి గుట్ట, 12వ వార్డు ఎనుములపల్లి కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. రంజాన్, ఉగాది పండుగలను ఎలా జరుపుకోవాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. కాగా, వేసవి వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పట్టపర్తి మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. 

సీఎం ఇలాకాలోనూ తాగునీటికి కటకట
సీఎం చంద్రబాబు  ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ, గుడుపల్లె మండలంలో తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. గుడుపల్లి మండలం మిట్టూరు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఇటీవల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. 

గుడుపల్లె మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గుడుపల్లి మండలం కోటపల్లి గ్రామంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని రెస్కో కార్యాలయం చుట్టుపక్కల ఉన్న ప్యాలెస్‌ ఎక్స్‌టెన్షన్‌లో తాగునీటి సమస్య తీర్చాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. 

ఇది సర్కారు నిర్లక్ష్యమే
అమలాపురం మున్సిపాలిటీ 30వ వార్డు పరిధిలోని రావులచెరువు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని అమలాపురంలోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు. అయినా ఈ సమస్యను అధికారులు పరిష్కరించలేదు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్‌ ముందుచూపుతో రూ.20 కోట్లతో సమగ్ర తాగునీటి పథకాన్ని తెచ్చారు. 

నిధులు కూడా మంజూరై పనులు మొదలయ్యాయి. గాంధీనగర్‌లో ట్యాంక్‌ నిర్మాణం పూర్తయింది. హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఏవీఆర్‌ నగర్‌లో త్వరితగతిన ట్యాంకు నిర్మాణాలను పూర్తి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో రావులచెరువు, రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురం మండలం తూర్పుపాలెం, గొల్లపాలెం, శంకరగుప్తం, ఆడవిపాలెం, మట్టపర్రు, రామరాజులంక, సఖినేటిపల్లి మండలం మోరి, కేశవదాసుపాలెం, ఉయ్యూరివారి మెరక, అప్పన రాముని లంక, రాజోలు మండలం పొన్నమండలోని శివారు ప్రాంతాలకు తాగు నీరు అందడం లేదు. 

బిందెడు నీటి కోసం పాట్లు
బిందెడు నీటి కోసం చాలా పాట్లు పడుతున్నాం. రక్షిత మంచి నీటి పథకం ద్వారా తాగు నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరా అనేది ప్రధాన ప్రాంతాలకే పరిమితం అవుతోంది. దీంతో మాలాంటి వీధులకు నీరు అందడం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. – బూర రాధ, హిరమండలం, శ్రీకాకుళం

ఇలాగైతే ఎలా?
తాగు నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మోటార్‌ రిపేరీ ఉందని బయటకు తీశారు. అలాగే వదిలేశారు. రేపు మాపు అంటూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వస్తే కానీ అధికారులు స్పందించడం లేదు. ఇలాగైతే ఎలా? ప్రభుత్వం వెంటనే పట్టించుకుని సమస్య పరిష్కరించాలి. – కేశమ్మ, పెద్ద బజార్, పుట్టపర్తి

ఎమ్మెల్యే స్పందించాలి
పుట్టపర్తి మున్సిపాలిటీలో పలు­చోట్ల తాగునీటి సమస్యలు ఉన్నాయి. అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల వేళ కాని వేళ నీళ్లు వదులుతున్నారు. కూలి పనులకు వెళ్లకుండా నీటి కోసం పడిగాపులు కాస్తున్నాం. ఉగాది, రంజాన్‌ పండుగలు దగ్గర పడుతున్నాయి. అధికారులు, ఎమ్మెల్యే సింధూరారెడ్డి స్పందించి నీటి సమస్య లేకుండా చూడాలి.–  సత్యనారాయణ, పెద్ద బజార్‌ 2వ వార్డు, పుట్టపర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement