సాక్షి, హైదరాబాద్: ఇంకా జనవరి నెల కూడా ముగియలేదు కానీ, అప్పుడే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సోమవారం రాష్ట్రంలో అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో ఏకంగా 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మం, నిజామాబాద్‌ల్లో 34 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, రామగుండంలలో 33 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఆదిలాబాద్, మెదక్‌ల్లో 32 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఇదిలావుండగా మధ్య భారతం నుంచి తుపాన్ వ్యతిరేక గాలులు వీస్తుండటంతో వేడి వాతావరణం నెలకొని ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితి రానున్న మరో రెండ్రోజులు ఉంటుందని తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగానే నమోదవుతాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment