‘ఫ్రై’ డే సూర్యః45 | 'Fry' Day heavy Summer is not over | Sakshi
Sakshi News home page

‘ఫ్రై’ డే సూర్యః45

Published Sat, May 24 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

‘ఫ్రై’ డే  సూర్యః45

‘ఫ్రై’ డే సూర్యః45

రామగుండంలో అత్యధికం  ఈ ఏడాది ఇదే రికార్డు
జగిత్యాలలో 44 డిగ్రీలు  ఎల్ నినో ఎఫెక్ట్‌తో ఎండలు
వడదెబ్బతో మూడు నెలల్లో సుమారు 52 మంది మృతి

 

జిల్లాలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా 40-42 డిగ్రీల మధ్య కదలాడిన ఉష్ణోగ్రత శుక్రవారం ఒక్కసారిగా 45 డిగ్రీలుగా నమోదైంది. ఈ సంవత్సరం ఇదే గరిష్ట ఉష్ణోగ్రతగా రికార్డయింది. సాధారణంగా వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయి. కానీ, ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలపై ఎల్ నినో ప్రభావం ఉండటంతో ఎండలు మరింత ఎక్కువయ్యాయి. రెండు రోజుల నుంచి భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఇంకా ఎక్కువే నమోదవుతున్నాయి. ప్రాజెక్టుల్లోని బొగ్గు అంతర్గతంగా మండుతూ వచ్చే వేడితోపాటు ఇనుప వస్తువులు ఎక్కువగా ఉండడం వల్ల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. యంత్రాల వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఎండలకు తల్లడిల్లుతున్నారు. సింగరేణి యాజమాన్యం తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకున్నా అవి సరిపోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఇక పగటి పూట జనసంచారం తగ్గిపోయి రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు వస్తున్నారు. ఎండ ప్రభావానికి వ్యాపారాలు సాగడం లేదు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు 52 మంది వడదెబ్బకు మృతి చెందారు.

 ఎల్-నినో... లా-నినో

 ప్రపంచ వాతావరణంలో ఎల్-నినో, లా-నినో అనే రెండు వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఈ రెండు వ్యవస్థలు కలుషితమవుతూ వాతావరణాన్ని మార్చుతున్నాయి. ఈ వ్యవస్థలు భూమధ్య రేఖ సమీపంలో, పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉంటాయి. వీటిలో ‘ఎల్-నినో’ తీవ్రమైన ఉష్ణోగ్రతలకు, దుర్భిక్ష పరిస్థితులకు కారణమవుతుంది. ‘లా-నినో’ కుండపోత వర్షాలకు, పెను తుపాన్లకు కారణమవుతుంది. కొన్నేళ్లుగా ఈ రెండు వ్యవస్థలు బంగాళాఖాతంలోని వాతావరణాన్ని ఒకదాని తర్వాత ఒకటి గట్టిగా ప్రభావితం చేస్తున్నాయి. వీటి మూలంగానే ఎప్పుడు లేని ఆకాల వర్షాలు, వడగాల్పులు వస్తూ ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి ప్రభావంతో నెల రోజుల ముందుగానే ఎండల ప్రభావం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రమవుతున్నందున వాతావరణంలో ఇంకా పలుమార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు.
 
 ఎల్-నినో ఎందుకంటే..

 ప్రకృతి వనరులను ఇష్టమొచ్చినట్లుగా కొల్లగొట్టడమే ఎల్-నినోకు ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రకృతి సమతుల్యానికి అడవులు ఎంతో కీలకం కాగా... వాటిని విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారు. అడువుల్లో అణిగి ఉండే ధూళి రేణువులు, అడవులను నరికి వేయడం వల్ల చెలరేగిపోతాయి. ఆ రేణువులకే రేడియేషన్ సోకడం వల్ల వాతావరణం వేడెక్కిపోతుంది. అడవులు ఎడారులుగా మారినకొద్దీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటుంది. బంగాళాఖాతం వాతావరణం ఆసియా-పసిఫిక్ ప్రాంత వాతావరణ వ్యవస్థలోని ఆటుపోట్ల మీద ఆధారపడటంతో, ఎల్-నినో పరిధులను కూడా దాటి పసిఫిక్ మహా సముద్ర జలాలు వచ్చే కొద్ది నెలల్లో   తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

 అటవీ సంపద నాశనం వల్లే...

 - డాక్టర్ లక్ష్మణ్, పరిశోధన స్థానం డెరైక్టర్, పొలాస
 అటవీ సంపదను నాశనం చేయడం వల్లే విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం కురవాల్సిన సమయంలో ఎండ కొట్టడం.. ఎండ కొట్టాల్సిన సమయంలో వానలు కురవడం చూస్తున్నాం. ఎల్-నినో ప్రభావం వల్లే ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగి 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌లో కదలాడుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement