పగలు గరం గరం - సాయంత్రం వర్ష రాగం
రోజూలాగే మంగళవారం పగలంతా భానుడు భగభగలాడి నగరజీవుల్ని ‘ఉక్క’రి బిక్కిరి చేశాడు.42 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రతాపం చూపాడు. సాయంత్రం నాలుగు గంటల వరకూ నిప్పులు చెరిగాడు. అప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా నల్లని మేఘాలు దట్టంగా అలముకుని చల్లటి గాలులతో ఆహ్లాదాన్ని కలిగించాయి. ఉరుములు, మెరుపులతో అరగంటపాటు
భారీగానే వర్షం కురిసి వెలిసింది. మండు వేసవిలో ఈ అనుకోని వాన నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. - సాక్షి, విశాఖపట్నం
ఎండ.. వాన
పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు
వర్షపాతం 2 సెం.మీ.
సాయంత్రం సేదతీరిన జనం
విశాఖపట్నం : భానుడి భగభగలకు పగలంతా నగరంలో సెగలు రేగాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు జనం భయపడ్డారు. వాల్తేరులో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదుకాగా, విమానాశ్రయం వద్ద 42 డిగ్రీలు నమోదయింది. తీవ్ర వడగాల్పులు కూడా ఆవరించి ఉండడంతో ఉష్ణోగ్రత తీవ్రత పెరిగింది. ఇదంతా సా యంత్రం వరకే. సాయంత్రానికి ఆకాశం మబ్బుల ముసుగేసుకుంది. ఆరంభంలో ఉరుములు.. మెరుపులు.. ఈదురు గాలులతో కాసేపు బీభత్స వాతావరణం అలముకుంది. అనంతరం మొదలైన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. రోడ్లు కాల్వలు పొంగిపొర్లాయి. వెంకటేశ్వరమెట్ట, కనకలదిబ్బ, నీలమ్మవేపచెట్టు, సీ హార్స్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో మంగళవారంనాటి భారీ వర్షాలకు చెట్లు నేలకొరిగాయి. సాయంత్రం కురిసిన వర్షపాతం విమానాశ్రయం వద్ద 2 సెం.మీ.గా నమోదయినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
విద్యుత్ కోతలు తోడయ్యాయి
పగటి పూట ఉష్ణోగ్రతలకు తోడు విద్యుత్ కోతలతో నగరవాసులు నరకం చవి చూశారు. గత కొన్ని రోజులుగా వడగాల్పుల వాతావరణంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో అత్యవసర కోతలు అమలు చేస్తున్నారు. నగరంలో పగటిపూట విడతలవారీ సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్ కోతలు విధించారు. సాయంత్రం వాన బీభత్సానికి ముందు జాగ్రత్త చర్యలుగా విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆ సమయంలో వర్షం పడుతుండటం.. అంతకు ముందు నుంచే వాతావరణం చ ల్లబడటంతో కాస్త ఉపశమనం కలిగినట్టయింది.