రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ప్రజల ఉక్కిరిబిక్కిరి..
పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రత
మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ..
ఈ నెల 30 వరకు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాడుపగిలే ఎండ, వడగాడ్పులు... మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోత. ఇదీ శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణ పరిస్థితి. రాష్ట్రంలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్‌లో ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
♦ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఈ నెల 28 నుంచి 30 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది.
ప్రచండ భానుడు..
రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లురులో 45.2 డిగ్రీల సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే మహబూబ్‌నగర్‌లో 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు మించి నమోదయ్యాయి.
మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 3.2 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మిగతా ప్రాంతాల్లో ఒక డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పెద్దలు, పిల్లలు, దీర్ఘకాలిక సమస్యలున్న వారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
ఆకు రాల్చిన అభయారణ్యం
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల అభయారణ్యం వేలాది ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అన్ని రకాల జంతువులు, పక్షులకు నిలయమిది. సరస్సు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం పచ్చదనంతో అన్ని రకాల పక్షుల అలజడితో చూడముచ్చటగా ఉండేది. వేసవిలో మండుతున్న ఎండలతో చెట్లన్నీ ఆకురాలడంతో అటవీ ప్రాంతమంతా బోసిపోయి ఇలా కనిపిస్తోంది. – నర్సంపేట
Comments
Please login to add a commentAdd a comment