దేశ రాజధాని ఢిల్లీలో వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికిముందు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు ఎండ తీవ్రత మరింత పెరిగిన నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికితోడు మరో రెండు రోజుల వరకు ఢిల్లీలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదని వాతావరణశాఖ పేర్కొంది.
ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో సగటు కంటే 5.7 డిగ్రీలు ఎక్కువ. నగరంలో వరుసగా ఎనిమిదో రోజు వడగాడ్పులు వీచాయి. వరుసగా 35వ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే అధికంగా నమోదైంది. మధ్యాహ్నం సమయంలో ఎండలో బయటకు వెళితే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉంటూ నీరు తాగుతూ ఉండాలని సూచించింది.
జూన్ 11 నుంచి రుతుపవనాలు ముందుకు సాగడం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా, దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాలలో వేడివాతావరణం కొనసాగుతున్నదని పేర్కొంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 27-30 మధ్య ఢిల్లీకి చేరుకుంటాయి. ఈసారి కూడా రుతుపవనాలు అదే సమయానికి ఢిల్లీకి తరలివచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment