
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీ నవ్‌జ్యోత్‌సింగ్ (52) రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవ్‌జ్యోత్‌సింగ్ మరణానికి కారణమైన నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసినందుకు గుర్‌గావ్ పోలీసులు నిందితులపై అదనపు కేసులు నమోదు చేశారు.
ఆదివారం ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రోస్టేషన్ సమీపంలో గగన్‌ప్రీత్ (38),పరిషిత్ మాక్కాడ్(40)లు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూకారు.. గురుద్వార్ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న నవ్‌జ్యోత్‌సింగ్, అతని భార్య సందీప్‌కౌర్ ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ్‌జ్యోత్‌సింగ్ మరణించగా.. సందీప్‌కౌర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే గగన్ ప్రీత్ బీఎండబ్ల్యూకారు తమని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఢీకొట్టినట్లు సందీప్‌కౌర్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. నిందితులు నన్ను,నా భర్త నవజోత్ సింగ్‌ను ఓ వ్యానులో ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యానులో ఉన్న నేను మమ్మల్ని సమీప ఆస్పత్రికి తరలించమని నిందితుల్ని ప్రాధేయపడ్డ.. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 19కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీ నగర్ న్యూలైఫ్ ఆస్పత్రికి తరలించారు. ఫలితంగా నా భర్త వ్యాన్‌లోనే ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరుగా విలపించారు.
బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ప్రధాన నిందితురాలు గగన్‌ప్రీత్ తండ్రి సదరు న్యూలైఫ్ ఆస్పత్రికి సహయజమాని అని నిర్ధారించుకున్నారు. దీంతో కేసును కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందా అన్న కోణంలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సందీప్‌కౌర్‌కు ట్రీట్మెంట్ ఇచ్చిన రిపోర్టుతో పాటు కారు ప్రమాదంలో నిందితులకు కఠిన శిక్ష పడేందుకు ఉపయోగపడే ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నంలో న్యూలైఫ్ ఆసుపత్రికి తీసుకువచ్చారని అనుమానించారు.
ఇదే అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ ఆస్పత్రి ప్రతినిధుల్ని పోలీసులు ప్రశ్నించారు. ట్రీట్మెంట్ విషయంలో సదరు ఆస్పత్రి వైద్యులు,యాజమాన్యం ప్రొటొకాల్ పాటించామని చెప్పాయి. కానీ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో ఆస్పత్రి ఉంచుకొని.. 19కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూలైఫ్ ఆస్పత్రికే ఎందుకు తరలించారు అనే అంశంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.