ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్‌లోకి ప్రవేశించిన నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మృతులలో ఒకరే శ్రేయ. ఉన్నత అధికారి కావాలనుకున్న కుమార్తె కలలను నెరవేర్చాలనే ఉద్దేశంతో శ్రేయ కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితమే ఆమెను పోటీ పరీక్షల కోచింగ్ కోసం ఢిల్లీకి పంపించారు.
శ్రేయ కుటుంబ సభ్యులు యూపీలోని అంబేద్కర్ నగర్‌లో ఉంటారు. గత మేనెలో శ్రేయ.. రావ్ కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ తీసుకుంది. శ్రేయ తన ఇంటిలో మొదటి సంతానం. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే శ్రేయపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమె తండ్రి రాజేంద్ర యాదవ్ తన కుమార్తెను ఐఏఎస్‌గా చూడాలని తపన పడేవాడు. శ్రేయ రెండు నెలల నుంచి కోచింగ్ సెంటర్‌లోనే శిక్షణ తీసుకుంటోంది. ఈ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో లైబ్రరీ ఉంది. శనివారం సాయంత్రం ఆ లైబ్రరీలో శ్రేయతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు.
ఉన్నట్టుండి భారీ వర్షం రావడంతో బేస్‌మెంట్‌లోకి వరద నీరు ప్రవేశించి, అది లైబ్రరీని ముంచెత్తింది. దీంతో లైబ్రరీ వరద నీటితో నిండిపోయింది. ఫలితంగా విద్యార్థులంతా లైబ్రరీలో చిక్కుకుపోయారు. బయట నుంచి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే అప్పటికే ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న శ్రేయ కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు. శ్రేయ ఇద్దరు తమ్ముళ్లు తమ అక్కను గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు. కుమార్తెను ఐఏఎస్‌గా చూడాలనుకున్న శ్రేయ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment