
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గించేందుకు పక్కా చర్యలు చేపట్టాల్సిందేనని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ డీఈవోలను ఆదేశించారు. ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని స్పష్టం చేశారు. బ్యాగు బరువు తగ్గించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని, ఎంఈవోల నేతృత్వంలో అధికారులు బృందాలుగా ఏర్పడి బ్యాగు బరువుపై తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారులతో బుధవారం హైదరాబాద్‌లో కిషన్ సమీక్ష నిర్వహించారు.
వచ్చే విద్యా సంవత్సరం కోసం అవసరమైన పాఠ్య పుస్తకాల వివరాలను ఇప్పటివరకు 21 జిల్లాలే అందజేయాలని, మిగతా జిల్లాల డీఈవోలు కూడా ఆ వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు. విద్యార్థినిలపై వేధింపులకు సంబంధించి పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, టీచర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో 10వ తరగతి విద్యార్థులకు నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే నిర్వహణకు పక్కా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment