Bag weight
-
బ్యాగు మోతకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గింపుపై విద్యా శాఖ ఆలోచనలు మొదలు పెట్టింది. గతంలోనే బ్యాగు బరువు తగ్గించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. గతంలోనే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల బ్యాగు బరువుపై అధ్యయనం చేసిన విద్యా శాఖ బ్యాగు బరువు కారణంగా విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్నారని గుర్తించింది. వారు మోస్తున్న బ్యాగు బరువు అంచనా వేసి, తరగతులవారీగా ఎన్ని పాఠ్య పుస్తకాలు ఉండాలి.. ఎన్నినోటు పుస్తకాలు ఉండాలి.. బ్యాగు బరువెంత ఉండాలన్న అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటి అమలు పక్కాగా జరగలేదు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ బ్యాగు బరువు తగ్గించే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాగు బరువు తగ్గింపుపై పాఠశాల విద్య కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలల యాజమాన్యాలకు నచ్చజెప్పే ధోరణితో ముందుకు సాగాలన్న ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం కావాలని భావిస్తున్నారు. వీలైతే అంతకంటే ముందే విద్యా శాఖ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేసి పలు స్కూళ్లలో ఉన్న ఏర్పాట్లు, బ్యాగు బరువుపై మరోసారి పరిశీలన జరపాలని యోచిస్తున్నారు. బ్యాగు బరువు తగ్గించేందుకు ఒక్కొక్కటిగా నిబంధనలు అమల్లోకి తేనున్నారు. విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాలు మినహా ఇతర పుస్తకాలను పాఠశాలల్లోనే ఉంచేలా యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలని సూచించనున్నారు. తద్వారా విద్యార్థులపై బ్యాగు బరువు సగం వరకు తగ్గించొచ్చని విద్యా శాఖ భావిస్తోంది. స్టేట్ సిలబస్ అమలుపైనా దృష్టి రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో స్టేట్ సిలబస్ పుస్తకాలే వినియోగించేలా చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖ సిద్ధం అవుతోంది. విద్యా శాఖ నిర్దేశిత సిలబస్ ఉన్న సేల్ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉండట్లేదని, అందుకే తాము ప్రైవేటు సిలబస్ పుస్తకాలను వినియోగిస్తున్నామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యా శాఖకు తెలియజేశాయి. దీంతో ముందుగా మార్కెట్లో విక్రయించే పాఠ్య పుస్తకాల ముద్రణను పక్కాగా చేపట్టేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ప్రైవేటు పబ్లిషర్లు నిర్ణీత పాఠ్య పుస్తకాల ముద్రణ కోసం అనుమతి తీసుకొని, వాటికి విద్యా శాఖకు రాయల్టీ చెల్లిస్తున్నా, నిర్ణీత పుస్తకాలు ముద్రించడం లేదన్న ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు సేల్ పుస్తకాల ముద్రణను పక్కాగా చేసేలా, ఆయా పుస్తకాలకు సీరియల్ నంబర్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. తద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలను మార్కెట్లో అందుబాటులో ఉంచి పాఠశాలలు వాటిని అమలు చేసేలా చూసేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాఠశాల విద్య కమిషనర్ విజయ్‌కుమార్ గుర్తింపు పొందిన ప్రైవేటు యాజమాన్య సంఘంతో (ట్రస్మా) చర్చించారు. వారు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు కచ్చితంగా పాఠశాల విద్యా శాఖ నిర్దేశిత పుస్తకాలనే వినియోగిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అదే విధానం కొనసాగించడం ద్వారా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగం తగ్గించి, విద్యా ర్థుల బ్యాగు బరువును నియంత్రించొచ్చని భావిస్తోంది. ఆర్థిక భారం లేని చర్యలపై దృష్టి బ్యాగు బరువు తగ్గింపులో భాగంగా ముం దుగా ఆర్థిక భారం లేని అంశాలపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది పాఠశాలల్లో ఏ రోజు ఏ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు తీసుకురావాలో ముందే చెప్పడం, బ్యాగు బరువును సమానంగా పంచేలా వెడల్పాటి పట్టీలు కలిగిన బ్యాగులను ఎంపిక చేసుకునేలా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించడం వంటి చర్యలు చేపట్టే ఆలోచనలు చేస్తోంది. పుస్తకాలను పాఠశాలల్లోనే ఉంచేలా ర్యాక్‌లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై పాఠశాలల యాజమాన్యాలను ఒప్పించాలని భావిస్తోంది. -
బ్యాగు బరువు తగ్గాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గించేందుకు పక్కా చర్యలు చేపట్టాల్సిందేనని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ డీఈవోలను ఆదేశించారు. ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని స్పష్టం చేశారు. బ్యాగు బరువు తగ్గించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని, ఎంఈవోల నేతృత్వంలో అధికారులు బృందాలుగా ఏర్పడి బ్యాగు బరువుపై తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారులతో బుధవారం హైదరాబాద్‌లో కిషన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం కోసం అవసరమైన పాఠ్య పుస్తకాల వివరాలను ఇప్పటివరకు 21 జిల్లాలే అందజేయాలని, మిగతా జిల్లాల డీఈవోలు కూడా ఆ వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు. విద్యార్థినిలపై వేధింపులకు సంబంధించి పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, టీచర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో 10వ తరగతి విద్యార్థులకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహణకు పక్కా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
బ్యాగు బరువు తగ్గేదెలా?
నిబంధనలు పాటించని స్కూళ్లపై ఏం చర్యలు తీసుకుంటారు? - కార్యాచరణ లేకుండానే ప్రభుత్వ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులపై స్కూల్ బ్యాగు బరువు తగ్గించేందుకు ఇటీవల మార్గదర్శకాలు (జీవో 22) జారీ చేసిన ప్రభుత్వం.. వాటిని పక్కాగా అమలు చేసేందుకు కార్యాచరణ మాత్రం ప్రకటించలేదు. దీంతో బ్యాగు బరువు తగ్గింపు అమలుకు నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం పాఠశాల విద్యాశాఖ అయినా ఆ మార్గదర్శకాల అమలుకు పక్కాగా చర్యలు చేపట్టలేదు. బ్యాగు బరువు తగ్గించేందుకు చర్యలు చేపట్టని పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపడతారన్న అంశంలో స్పష్టమైన విధానం ప్రకటించలేదు. పిల్లల బ్యాగు బరువు తగ్గించేందుకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాయా.. లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు తనిఖీలు చేయాలంటూ విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు ఇచ్చి వదిలేసింది. బ్యాగు బరువును తగ్గించే ఏర్పాట్లు చేయని పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపట్టాలో స్పష్టం చేయకపోవడంతో యాజమాన్యాలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మంత్రిదో మాట.. అధికారులదో బాట.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా పాఠ్య పుస్తకాలను వినియోగిస్తున్నాయి. తమకు నచ్చిన పబ్లిషర్ పుస్తకాలను అమలు చేస్తున్నాయి. వాటికి తోడు పదుల సంఖ్యలో నోటు పుస్తకాలతో విద్యార్థులకు మోత తప్పడం లేదు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) నిర్దేశిత పుస్తకాలను ఏమాత్రం అమలు చేయడం లేదు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా.. మీ ఇష్టం ఉన్న పుస్తకాలను వినియోగించుకోం డని, ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పుస్తకాలనే వినియోగించాల్సిన అవసరమే లేదని హామీ ఇచ్చినట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యా లు చెబుతున్నాయి. అంతేకాదు గతేడాది ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిన విద్యాశాఖ.. ఈసారి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే స్కూల్ బ్యాగు బరువు తగ్గించేందుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం కచ్చితంగా ఎస్సీఈఆర్టీ నిర్దేశిత పుస్తకాలనే వినియోగించాలని స్పష్టం చేసింది. ఏ తరగతికి ఎంత బరువు? ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 5 నుంచి 7 కిలోలు ఉంటోంది. రెండో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 9 కిలోలు, 5వ తరగతి విద్యార్థి బ్యాగు బరువు 10 కిలోలు, 7వ తరగతి విద్యార్థి బ్యాగు బరువు 12 కిలోలు ఉంటుండగా, పదో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 17 కిలోల వరకు ఉంటోందని విద్యాశాఖ తనిఖీల్లో వెల్లడైంది. ఫలితంగా విద్యార్థుల వెన్ను వంగిపోతోందని, శారీరక ఎదుగల దెబ్బతింటోందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకే ఎస్సీఈఆర్టీ నిర్దేశిత పుస్తకాలను వాడాలని, పైగా బ్యాగుతో సహా 1, 2 తరగతులకు 1.5 కిలోల బరువే ఉండాలని, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోలు, 6, 7 తరగతుల బరువు 4 కిలోలకు మించకూడదని, 8, 9, 10 తరగతులకు 4.5 నుంచి 5 కిలోల లోపే ఉండాలని స్పష్టం చేసింది. అయితే వీటిని పాటించని స్కూళ్లపై ఎలాంటి చర్యలు చేపట్టాలి? కేసులు నమోదు చేయాలా? పాఠశాల గుర్తింపు రద్దు చేయాలా? వంటి అంశాలేవీ ఆ ఉత్తర్వుల్లో లేకపోవడంతో అవి బుట్టదాఖలు అయ్యే పరిస్థితి నెలకొంది. -
బ్యాగు..భారం
అమ్మా...భుజం, వెన్ను నొప్పి వేస్తోంది..కాళ్లు గుంజుతున్నాయి. అంటు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వికాస్ బ్యాగు టేబుల్ పై పెట్టి విశ్రాంతికి ఉపక్రమిస్తున్నాడు. ఇంటికి రాగానే నీరసం. ఏమి తినలేడు. తాగలేడు. అసహనానికి గురవుతాడు..ఇదీ విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రతీ ఇంట్లో పిల్లలు పలికే అవస్థల పలుకులు. ఎందుకంటే వారి వయస్సుకు మించిన పుస్తకాల బరువు మోస్తున్నారు మరీ..! ఈ వ్యవస్థ మారేదెప్పుడో?..పిల్లల కష్టాలు తీరేదెప్పుడో?. - స్థాయికి మించిన పుస్తకాల మోత - విద్యార్థుల్లో పెరుగుతున్న అసహనం - అమలు కాని యశ్పాల్ కమిటీ సిఫార్సులు - వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు - మానసికగ్రస్తులుగా మారుతున్నారని తల్లిదండ్రుల ఆందోళన మంచిర్యాల అర్బన్ : నర్సరీ నుంచి పదో తరగతి వరకు పిల్లలను విద్య పేరిట పుస్తకాల బరువులు మోయిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, కంపాక్స్, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా వయస్సుకు మించిన అధిక భారం మోస్తున్నారు. చదువు చారెడు..పుస్తకాలు బోలెడు అన్న చందంగా ఉంది విద్యార్థుల దుస్థితి. బరువు భారం పెరిగే కొద్దీ విద్యార్థుల్లో వెన్నుపూస నొప్పి వస్తోంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు భవనాల్లో ఉండడంతో మూడు, నాలుగు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి ఉంటోంది. రోడ్డుపై నడవడం గగనం కాగా నాలుగు అంతస్తుల భవనం మెట్లెక్కడం ఎంత కష్టమో తల్లిదండ్రులు, యాజమాన్యాలు గమనించడం లేదు. పిల్లలు కాన్వెంట్ చదువులతో ఉన్నత స్థితికి చేరాలని ఆరాటపడుతారే కానీ వారి బరువు భారం గురించి వీసమెతై ్తన యోచించడం లేదు. యశ్పాల్ కమిటీ చేసిన సిఫార్సులు కూడా అమలు కావడం లేదు. ఏటా విద్యా సంస్థల ఆరంభంలో పుస్తకాల బరువుపై చర్చ జరుగుతోంది. విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడం షరా మామూలే. అయితే విద్యాశాఖ అధికారులు చిత్తశుద్ధితో సిఫార్సులు అమలు చేస్తే విద్యార్థులకు పుస్తకాల బరువుతోపాటు వారిలో మానసిక ఆందోళన తగ్గుతుంది. తల్లిదండ్రులు ఏమి చేయాలి? విద్యార్థుల తల్లిదండ్రులు తగిన సూచనలు పాటిస్తే మంచిది. పిల్లలు ఎన్ని పుస్తకాలు తీసుకువెళ్లాలి. బ్యాగ్ బరువు ఎంత వరకు ఉండాలో స్వయంగా చూడాలి. 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులు బ్యాగ్ బరువు 2 నుంచి 5 కేజీల వరకు ఉండేలా చూడాలి. ఐదు నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల బ్యాగు బరువు ఏడు కేజీలలోపు ఉండాలి. సాధ్యమైంత వరకు పుస్తకాల బరువు ఎక్కువగా ఉండకుండా చూడాలి. బ్యాగులు కూడా తక్కువ బరువు ఉన్నవి కొనుగోలు చేయడం వల్ల బరువును తగ్గించవచ్చు. నిబంధనలు బేఖాతర్ విద్యార్థుల పుస్తకాల బరువు ఎంత ఉండాలి.. ఎలాంటి విద్యను అందించాలి, విద్యా విధానం విలువల గురించి ఓ కమిటీ చేసిన సిఫార్సులు బుట్టదాఖలు అవుతున్నాయి. ఏ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న పాపానపోవడం లేదు. విద్యా శాఖ అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు శాపంగా మారారనే ఆరోపణలున్నాయి. దేశంలోని విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1992లో యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్ నేతత్వాన సిఫార్సు కమిటీని నియమించారు. వారు దేశంలోని విద్యావ్యవస్థలను అధ్యయనం చేసి కేంద్రానికి పలు సిఫార్సులు చేశారు. వాటిని కేంద్రం ఆమోదిస్తూ ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. 2005 నుంచి విద్యాహక్కు చట్టంలో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు రెండు నుంచి మూడు కిలోల బరువు, ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు 5 నుంచి 6 కిలోల పుస్తకాల బరువు మోయరాదని సూచించింది. విద్యార్థులను యంత్రాలుగా చూడరాదని స్పష్టంగా హెచ్చరించింది. అయినా ఏ ప్రభుత్వం కూడా ఆచరణలో అమలు చేయడం లేదు. విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఇవీ అనర్థాలు - విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. - నడుం, వెన్ను నొప్పి, కండరాల నొప్పి వస్తుంది - మానసిక ఆందోళన పెరుగుతుంది. చదువుపై మనసు లగ్నం చేయలేరు - త్వరగా నీరస పడుతారు. ఆటలు ఆడలేరు. బాగా చదవలేరు - జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఆకలి వేయదు - పుస్తకాలను చూడగానే ఆందోళనకు గురవుతారు - పాఠశాలకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత అసహనానికి గురవుతారు. చీటికి మాటికి ఏడ్వడం, మంకుపట్టు పడతారు