బ్యాగు..భారం | students bag... weights | Sakshi
Sakshi News home page

బ్యాగు..భారం

Published Mon, Jun 16 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

బ్యాగు..భారం

బ్యాగు..భారం

అమ్మా...భుజం, వెన్ను నొప్పి వేస్తోంది..కాళ్లు గుంజుతున్నాయి. అంటు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వికాస్ బ్యాగు టేబుల్ పై పెట్టి విశ్రాంతికి ఉపక్రమిస్తున్నాడు. ఇంటికి రాగానే నీరసం. ఏమి తినలేడు. తాగలేడు. అసహనానికి గురవుతాడు..ఇదీ విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రతీ ఇంట్లో పిల్లలు పలికే అవస్థల పలుకులు. ఎందుకంటే వారి వయస్సుకు మించిన పుస్తకాల బరువు మోస్తున్నారు మరీ..! ఈ వ్యవస్థ మారేదెప్పుడో?..పిల్లల కష్టాలు తీరేదెప్పుడో?.
 
- స్థాయికి మించిన పుస్తకాల మోత
- విద్యార్థుల్లో పెరుగుతున్న అసహనం     
- అమలు కాని యశ్‌పాల్ కమిటీ సిఫార్సులు
- వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు    
- మానసికగ్రస్తులుగా మారుతున్నారని తల్లిదండ్రుల ఆందోళన

మంచిర్యాల అర్బన్ : నర్సరీ నుంచి పదో తరగతి వరకు పిల్లలను విద్య పేరిట పుస్తకాల బరువులు మోయిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, కంపాక్స్, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా వయస్సుకు మించిన అధిక భారం మోస్తున్నారు. చదువు చారెడు..పుస్తకాలు బోలెడు అన్న చందంగా ఉంది విద్యార్థుల దుస్థితి. బరువు భారం పెరిగే కొద్దీ విద్యార్థుల్లో వెన్నుపూస నొప్పి వస్తోంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు భవనాల్లో ఉండడంతో మూడు, నాలుగు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి ఉంటోంది.

రోడ్డుపై నడవడం గగనం కాగా నాలుగు అంతస్తుల భవనం మెట్లెక్కడం ఎంత కష్టమో తల్లిదండ్రులు, యాజమాన్యాలు గమనించడం లేదు. పిల్లలు కాన్వెంట్ చదువులతో ఉన్నత స్థితికి చేరాలని ఆరాటపడుతారే కానీ వారి బరువు భారం గురించి వీసమెతై ్తన యోచించడం లేదు. యశ్‌పాల్ కమిటీ చేసిన సిఫార్సులు కూడా అమలు కావడం లేదు. ఏటా విద్యా సంస్థల ఆరంభంలో పుస్తకాల బరువుపై చర్చ జరుగుతోంది. విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడం షరా మామూలే. అయితే విద్యాశాఖ అధికారులు చిత్తశుద్ధితో సిఫార్సులు అమలు చేస్తే విద్యార్థులకు పుస్తకాల బరువుతోపాటు వారిలో మానసిక ఆందోళన తగ్గుతుంది.
 
తల్లిదండ్రులు ఏమి చేయాలి?
విద్యార్థుల తల్లిదండ్రులు తగిన సూచనలు పాటిస్తే మంచిది. పిల్లలు ఎన్ని పుస్తకాలు తీసుకువెళ్లాలి. బ్యాగ్ బరువు ఎంత వరకు ఉండాలో స్వయంగా చూడాలి. 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులు బ్యాగ్ బరువు 2 నుంచి 5 కేజీల వరకు ఉండేలా చూడాలి. ఐదు నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల బ్యాగు బరువు ఏడు కేజీలలోపు ఉండాలి. సాధ్యమైంత వరకు పుస్తకాల బరువు ఎక్కువగా ఉండకుండా చూడాలి. బ్యాగులు కూడా తక్కువ బరువు ఉన్నవి కొనుగోలు చేయడం వల్ల బరువును తగ్గించవచ్చు.

నిబంధనలు బేఖాతర్
విద్యార్థుల పుస్తకాల బరువు ఎంత ఉండాలి.. ఎలాంటి విద్యను అందించాలి, విద్యా విధానం విలువల గురించి ఓ కమిటీ చేసిన సిఫార్సులు బుట్టదాఖలు అవుతున్నాయి. ఏ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న పాపానపోవడం లేదు. విద్యా శాఖ అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు శాపంగా మారారనే ఆరోపణలున్నాయి. దేశంలోని విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1992లో యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యశ్‌పాల్ నేతత్వాన సిఫార్సు కమిటీని నియమించారు.

వారు దేశంలోని విద్యావ్యవస్థలను అధ్యయనం చేసి కేంద్రానికి పలు సిఫార్సులు చేశారు. వాటిని కేంద్రం ఆమోదిస్తూ ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. 2005 నుంచి విద్యాహక్కు చట్టంలో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు రెండు నుంచి మూడు కిలోల బరువు, ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు 5 నుంచి 6 కిలోల పుస్తకాల బరువు మోయరాదని సూచించింది. విద్యార్థులను యంత్రాలుగా చూడరాదని స్పష్టంగా హెచ్చరించింది. అయినా ఏ ప్రభుత్వం కూడా ఆచరణలో అమలు చేయడం లేదు. విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు.
 
ఇవీ అనర్థాలు
- విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.
- నడుం, వెన్ను నొప్పి, కండరాల నొప్పి వస్తుంది
- మానసిక ఆందోళన పెరుగుతుంది. చదువుపై మనసు లగ్నం చేయలేరు
- త్వరగా నీరస పడుతారు. ఆటలు ఆడలేరు. బాగా చదవలేరు
- జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఆకలి వేయదు
- పుస్తకాలను చూడగానే ఆందోళనకు గురవుతారు
- పాఠశాలకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత అసహనానికి గురవుతారు. చీటికి మాటికి ఏడ్వడం, మంకుపట్టు పడతారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement