Unhealthy Problems
-
నక్సల్స్‌కు భారీ దెబ్బ: అనారోగ్యంతో హరిభూషణ్ మృతి
1995లో దళంలోకి... మహబూబాబాద్ జిల్లా గంగారం మండ లం మరిగూడానికి చెందిన యాప నారాయణ 1995లో పీపుల్స్ వార్‌లో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయికి చేరాడు. కేడర్ నిర్మాణం కోసం... 2019 చివరి నుంచి మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. తెలంగాణలో కేడర్ నిర్మాణం కోసం రిక్రూట్మెంట్ చేపట్టడమే గాక, పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడు. నలుగురు కీలక నేతలు.. అనారోగ్యంతో జూన్ 6న డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, జూన్ 10న కత్తి మోహన్.. 16న విశాఖ ఎన్కౌంటర్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన సందె గంగయ్యలను పార్టీ కోల్పోయింది. తాజాగా హరిభూషణ్ మరణం. సాక్షి, హైదరాబాద్/మహబూబాబాద్/ గంగారం/కొత్తగూడ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ లక్మూ అలియాస్ హెచ్చీ సోమవారం మరణించారు. ఇటీవల అనారోగ్యంతో మావో అగ్రనేత కత్తి మోహన్ అలియాస్ ప్రకాశ్ మరణం మరువకముందే.. మరో కీలకనేత మృతి చెందడం దండకారణ్యంలో కలకలం రేపుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలోని మీనాగుట్ట ప్రాంతంలో మరణించాడన్న వార్త మంగళవారం ఛత్తీస్‌గఢ్- తెలంగాణలో దావానంలా వ్యాపించింది. ఆయన అంత్యక్రియలను తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో నిర్వహించారని తెలిసింది. హరిభూషణ్ కరోనాతో లేదా ఫుడ్ పాయిజనింగ్తో మరణించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయాలను తొలుత బస్తర్ పోలీసులు ధ్రువీకరించలేదు. సాయంత్రానికి ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు హరిభూషణ్ మరణవార్తను నిర్ధారించారు. 2018లో ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుని.. హరిభూషణ్ దళంలో పని చేస్తున్న సమయంలోనే మేనమామ కూతురు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదను వివాహం చేసుకున్నాడు. ఈమె ప్రస్తుతం శబరి–చర్ల ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉంది. అనేక ఎన్కౌంటర్లలో త్రుటిలో తప్పించుకున్న హరిభూషణ్ చాలాసార్లు మరణించాడని ప్రచారం జరిగింది. 2018, మార్చిలో బీజాపూర్ జిల్లా పూజారి కంకెర అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఆసమయంలో హరిభూషణ్ దంపతులు సురక్షితంగా తప్పించుకున్నారు. అయితే అప్పుడు అతడు మరణించాడంటూ వార్తలొచ్చాయి. పలు కార్యకలాపాలకు మూలం ఇతనే.. గణపతి తరువాత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నంబాల కేశవరావు స్వీకరించినప్పటి నుంచి పార్టీలో హరిభూషణ్‌కు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణలో కేడర్ నిర్మించుకోవాలన్న కేశవరావు ఆదేశాలతో 2019 చివరి నుంచి కార్యక లాపాలు ముమ్మరం చేశాడు. రిక్రూట్మెంట్లకు, పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడు. గతేడాది లాక్డౌన్ సమయంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో కలసి ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్-భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను పోలీసులు తిప్పికొట్టారు. వరుసగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 10 మంది మావోలు మరణించారు. దీంతో హరిభూషణ్ అతని అనుచరులు వెనకడుగు వేశారు. పోలీసుల గాలింపు తీవ్రతరం కావడం, లాక్డౌన్ ఎత్తివేయడంతో హరిభూషణ్ అతని అనుచరులు తిరిగి దండకారణ్యానికి వెళ్లారు. గతే డాది చివర్లో కూడా ప్రాణహిత నది మీదుగా మహా రాష్ట్ర నుంచి పలుమార్లు హరిభూషణ్ తెలంగాణ లోకి ప్రవేశించాడని నిఘా వర్గాలు స్థానిక పోలీసులను హెచ్చరించాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టినా హరిభూషణ్ ఆచూకీ మాత్రం చిక్కలేదు. 3 వారాల్లో నలుగురు నేతలు.. మావోయిస్టుల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర అలజడి సృష్టిస్తోంది. 3 వారాల్లోనే నలుగురు కీలక నేతలను కోల్పోయింది. ఈసారి వచ్చిన స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉండటం.. మావోయిస్టు అగ్రనేతలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండటంతో అగ్రనేతలు మరణాల బారిన పడుతున్నారని బస్తర్ పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏప్రిల్‌లో బీజాపూర్‌లో పోలీసులపై మావో అగ్రనేత హిడ్మా నేతృత్వంలో జరిగిన ఊచకోతకు ప్రతీకారం కోసం సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు ఎదురుచూస్తున్నా యి. దండకారణ్యంలో మావోలకు పట్టున్న ప్రాం తాలను డ్రోన్ల ద్వారా తెలుసుకుంటున్నారు. మావోలను అష్టదిగ్బంధనం చేశారని అందుకే వారు బయటికి రాలేక, చికిత్స అందక మరణిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే, లొంగిపోతే తాము చికిత్స అందిస్తామని తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించినా.. అందుకు మావోలు సిద్ధంగా లేరు. పీపుల్స్ వార్‌లోకి ఇలా.. యాప పాపమ్మ, రంగయ్య దంపతుల ఏడుగురు సంతానంలో నారాయణ పెద్ద కుమారుడు. నర్సంపేటలో డిగ్రీ చదివిన ఆయన 1985 - 90 మధ్యకాలంలో ఎల్ఐసీ ఏజెంట్‌గా, ఐటీడీఏ మైనర్ ఇరిగేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. అయితే అప్పుడు కొత్తగూడ, ఇల్లందు, గుండాల ఏజెన్సీ ప్రాంతాల్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అప్పటి నుంచే నారాయణ పీపుల్స్‌వార్ అనుబంధంగా పనిచేస్తూ మిత్రుడు రాజకోటితో కలసి న్యూడెమోక్రసీ పార్టీ విధానాలు, వారికి వ్యతిరేకంగా గ్రామాల్లో పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని హత్య చేసేందుకు న్యూడెమోక్రసీ నేతలు వ్యూహం పన్నారు. 1991, మే 31న గ్రామంలో జరిగే వివాహానికి నారాయణ, రాజకోటి వస్తారని కాపుకాసిన ఎన్డీ నేతలకు రాజకోటి దొరకగా.. నారాయణ అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పీపుల్స్‌వార్ దళంలోకి వెళ్లాడు. పీపుల్వార్లో చేరిన హరిభూషణ్ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. దళసభ్యుడిగా, మిలిటరీ ప్లాటూన్ శిక్షణ కమాండర్‌గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర కార్యదర్శి, తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా ఎదిగారు. హరిభూషణ్‌పై ప్రభుత్వం రూ.20లక్షల రివార్డు ప్రకటించింది. ఎలాంటి సమాచారం లేదు హరిభూషణ్ మృతి చెందాడనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఆయన స్వగ్రామం మడగూడెం విషాదఛాయలు అలముకొన్నాయి. అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వారంతా మంగళవారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండటం కనిపించింది. గతంలోనూ హరిభూషణ్ చనిపోయాడని వార్తలు వచ్చాయని.. దీంతో తమ తండ్రి రంగయ్య మనోవేదనకు గురై మంచాన పడ్డారని హరిభూషణ్ సోదరులు అశోక్, రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కోలుకుంటున్న తమ తండ్రికి మళ్లీ హరిభూషణ్ మరణించాడని వార్తలు చేరడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని హరిభూషన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
ఎక్కువ కాలం బతకాలనుకుంటే ఇలా చేయండి!
చాలా పాతకాలపు నానుడి.. లంఖణం పరమౌషధం! ఆ తరువాతి కాలంలో తిండి కలిగితేనే కండ కలదోయ్ అన్నారు గానీ.. ఇటీవల కాలంలో మాత్రం మరోసారి సీన్ రివర్స్ అయింది. వయసు మీదపడ్డా ఆరోగ్య సమస్యలేవీ దరి చేరకూడదనుకున్నా.. ఎక్కువకాలం బతకాలని ఆశిస్తున్నా.. శరీరంలోని మంట/వాపులను తగ్గించుకోవాలని భావిస్తున్నా.. వీలైనంత తక్కువ ఆహారం తీసుకోవడమంత ఉత్తమమైన మార్గం లేదని అంటున్నారు చైనా, అమెరికా శాస్త్రవేత్తలు. అంతేకాదు.. కేలరీల నియంత్రణ ద్వారానే దీర్ఘాయుష్షు సాధ్యమన్న భావన వెనుక ఉన్న అసలు ప్రక్రియ ఏమిటిన్నది కూడా వీరు అధ్యయనపూర్వకంగా తెలుసుకున్నారు. ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. (చదవండి: బరువు తగ్గాలంటే ఈ స్నాక్ తినాల్సిందే..) వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల వ్యాధులు చుట్టుముట్టడం సహజం. కేన్సర్, మతిమరుపు, జీవక్రియలు మందగించడం.. ఇలా బోలెడన్ని సమస్యలు వృద్ధాప్యాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఈ కారణంగా ప్రభుత్వాలు వృద్ధుల ఆరోగ్యంపై పెట్టాల్సిన ఖర్చులు పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలో సాల్క్స్ జీన్ ఎక్స్ప్రెషన్ లేబొరేటరీకి చెందిన జువాన్ కార్లోస్ బెహమోంటే, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ప్రొఫెసర్ గువాంగ్ హుయి ల్యూలు ఎలుకలపై కొన్ని పరిశోధనలు చేశారు. ఆహారాన్ని నియం త్రించినప్పుడు ఎలుకల కణాల్లో ఏ రకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనల ఆధారంగా వృద్ధాప్య సమస్యలను అధిగమించేం దుకు మంచి మందులు తయారు చేయవచ్చునన్నది వీరి అంచనా. తమ పరిశోధనల్లో భాగంగా బెహమోంటే కొన్ని ఎలుకలను ఎంచుకుని 30 శాతం తక్కువ కేలరీలు అందేలా చేశారు. వీటిని సాధారణ స్థాయిలో ఆహారం తీసుకుంటున్న ఎలుకలతో పోల్చి చూశారు. మొత్తం 56 ఎలుకల్లోని కొవ్వు, కాలేయ, కిడ్నీ, చర్మ, ఎముక మజ్జ, మెదడు, కండరం వంటి 40 రకాల కణాల్లోంచి లక్షా అరవై ఎనిమిది వేల కణాలను నిశితంగా పరిశీలించారు. ఒక్కో కణంలోని జన్యుపరమైన చర్యలను ప్రత్యేక టెక్నాలజీ ద్వారా పరిశీలించినప్పుడు.. వయసు ఎక్కువవుతున్నప్పటికీ కేలరీలు తక్కువగా తీసుకున్న ఎలుక కణాల్లో మార్పులు పెద్దగా చోటుచేసుకోలేదు. అంతేకాదు.. వీటి కణజాలం, కణాలు కూడా యుక్తవయసులో ఉండే ఎలుకలను పోలి ఉన్నాయి. (చదవండి: బరువు తగ్గేందుకు 12 సూత్రాలు) కేలరీలు తక్కువగా తీసుకున్న ఎలుకల్లో రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా మంట/ వాపు, కొవ్వులు జీర్ణ ప్రక్రియలకు సంబంధించిన జన్యువులపై కూడా సానుకూల ప్రభావం కనిపించింది. ఆహారం కారణంగా వైబీఎక్స్1 అనే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ 23 రకాల మార్పులను నియంత్రించగలిగిందని తెలిసింది. ఈ పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను కొత్త కొత్త మందులను తయారు చేసేందుకు వినియోగించనున్నట్లు బెహమోంటే తెలిపారు. -
వాతావరణమే.. విలన్
పారిస్: వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచవ్యాప్తంగా పసిమొగ్గల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. శిలాజ ఇంధన ఉద్గారాలను కట్టడి చేయకపోతే భారత్ ఒకతరం ఆరోగ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తేల్చింది. భారత్‌లో దీని ప్రభావం అత్యధికంగా కనబడుతోందని వెల్లడించింది. గత 50 ఏళ్లుగా చిన్నారుల ఆరోగ్యానికి భారత్ ఎంతో కృషి చేసిందని, కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటివరకు చేసినదంతా వృథా కానుందని అంచనా వేసింది. ఇవాళ పుట్టిన ప్రతీ బిడ్డ భవిష్యత్‌ను వాతావరణంలో మార్పులే నిర్దేశిస్తాయని నివేదిక సహ రచయిత్రి పూర్ణిమ చెప్పారు. లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్, క్లైమేట్ ఛేంజ్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు సహా మరో 35 సంస్థలకు చెందిన 120 మంది పర్యావరణ నిపుణులు అధ్యయనం చేశారు. వాతావరణంలో మార్పులు, ప్రభావానికి సంబంధించి 41 అంశాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఆరోగ్యంపై ప్రభావం చూపించే అంశాలు ► కరువు పరిస్థితులు ► అంటు వ్యాధులు ► వరదలు ► వడగాడ్పులు ► కార్చిచ్చులు ఏయే వ్యాధులు వచ్చే అవకాశం ► నీటి కాలుష్యంతో డయేరియా ► వాయు కాలుష్యంతో ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులు ► చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు ► డెంగీ వ్యాధి విజృంభణ ► గుండెపోటు ఏయే దేశాలపై ప్రభావం ► అత్యధిక జనాభా కలిగిన దేశాలు, వైద్య ఖర్చులు పెనుభారంగా మారిన దేశాలు, అసమానతలు, పేదరికం, పౌష్టికాహార లోపాలు కలిగిన భారత్ వంటి దేశాలపై వాతావరణంలో వస్తున్న మార్పులు పసివాళ్ల ఉసురు తీస్తున్నాయి. ► భారత్‌లో 2.1 కోట్ల మందిపై వాతావరణ మార్పుల ప్రభావం ► చైనాలో 1.7 కోట్ల మందికి ఆరోగ్య సమస్యలు ► 196 దేశాలకు గాను 152 దేశాలపై వాతావరణంలో మార్పులు అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయి. ► 2015లో భారత్‌లో వీచిన వడగాడ్పులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఇకపై సర్వసాధారణం కానున్నాయి. పరిష్కార మార్గాలేంటి ? ► ప్రతీ ఏడాది ప్రపంచ దేశాలు సగటున 7.4 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తే 2050 నాటికి 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోగలరు ► భారత్ థర్మల్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సంప్రదాయేతర ఇంధనంపైనే ఆధారపడాలి. ► ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి ► చెత్త, పంట వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. -
నగరాలు.. రోగాల అడ్డాలు
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాలు అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి. ట్రాఫిక్ మొదలుకొని ఫాస్ట్‌ఫుడ్ వరకు అనేక అంశాలు ఆరోగ్యంపై చూపెడుతున్న ప్రభావాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. నగర జీవనశైలి వ్యాధులకు నిలయంగా మారుతోందని పేర్కొంది. ‘ఆరోగ్య నగరాలను ఎలా తయారు చేయాలి’అనే అంశంపై ఇటీవల ఒక నివేదిక తయారు చేసింది. ట్రాఫిక్ రద్దీ, మద్యం తాగి వాహనాలు నడపడం, సీటు బెల్టు, హెల్మెట్ ధరించకపోవడం, ఫలితంగా రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం, వృద్ధులను పట్టించుకోకపోవడం ఇలా పలు సమస్యలు నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది. వివిధ అంశాలపై విశ్లేషణ చేసింది. ట్రాఫిక్ రద్దీ.. నగరాలు, పట్టణాల్లో రహదారులు దారుణంగా ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ సరిగా లేకపోవడం, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి ఏడాది 5–29 సంవత్సరాల వయస్సు గలవారు 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. 5 కోట్ల మంది వరకు గాయపడుతున్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. హెల్మెట్లు, సీట్ బెల్ట్‌ల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. రహదారులను మరింత సురక్షితంగా మార్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. మానసిక అనారోగ్యం.. మరోవైపు పేదరికం, నిరుద్యోగం, ట్రాఫి క్, శబ్ద కాలుష్యం, మౌలిక సదుపాయాలు, పచ్చని ప్రదేశాలు లేకపోవడం పట్టణవాసులు ఎదుర్కొంటున్న మరికొన్ని అడ్డంకులు. ఈ సమస్యలన్నీ మానసిక అనారోగ్యాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. దీంతో రద్దీ అధికంగా ఉంటుంది. శబ్ద కాలుష్యం, దీర్ఘకాలిక ఒత్తిడి కలిపి సామాజిక ఒంటరితనానికి దారితీస్తాయి. నగరాల్లో గాలి నాణ్యత తగ్గింది. ప్రతీ పది మందిలో 9 మంది రోజూ కలుషితమైన గాలిని పీల్చుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా . వాయు కాలుష్యంతో గుండె, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఊపిరితిత్తుల కేన్సర్‌కు దారితీస్తుంది. పెరుగుతున్న పట్టణ హింస.. పట్టణాలు, నగరాల్లో హింస పెచ్చుమీరుతోంది.15–44 ఏళ్ల మధ్య వయసు వారు అధికంగా హింసకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపులతో సహా ప్రాణాంతకమైన హింసతో ఏటా 10 లక్షల మంది గాయపడుతున్నారు. వేలాది మంది హత్య కు గురవుతున్నారు. అధిక జనాభా సాంద్రత ఉన్న నగరాల్లో హింస ఎక్కువగా కనిపిస్తోంది. అనారోగ్యకరమైన ఆహారం.. అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న ఆహారం, పానీయాలను అందించే ఫాస్ట్‌ఫుడ్ దుకాణాలు నగర ఆరోగ్యానికి సవాల్‌గా మారింది. ఆహార పదార్థాల మార్కెటింగ్ పిల్లలను లక్ష్యంగా చేసుకుం టు న్నాయి. బయటి ఆహారానికి నగర ప్రజలు అలవాటు పడుతుండటంతో బీపీ, షుగర్, ఊబకాయం అధికమవుతున్నాయి. కొరవడుతున్న శారీరక శ్రమ.. గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, బీపీ, కొన్ని కేన్సర్లను నివారించడంలో శారీరక శ్రమ సాయపడుతుంది. వ్యాయామం చేయడానికి బహిరంగ, పచ్చని ప్రదేశాలు లేకపోవడంతో శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. ఇదే నగర పౌరులను అనారోగ్యంగా మార్చుతోంది. వృద్ధులకు వసతులు ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య ఇతర వయసుల వారికంటే వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా నగర నిర్మాణాలుండాలి. పిల్లలు దూరంగా వెళ్లిపోవడం, భాగస్వామి చనిపోవడంతో వృద్ధులు ఒంటరితనానికి గురవుతున్నారు. సామాజిక సంబంధాలు విచ్ఛిన్నం కావడంతో వీరు దుర్భర జీవితం గడుపుతున్నారు. కాబట్టి నగరాల్లో వృద్ధులకు ఆరోగ్య కేంద్రం, సూపర్ మార్కెట్, సమాజ జీవితంలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. -
హెల్త్‌టిప్స్
చిన్న చిన్న సమస్యలకు కూడా మందులు వాడుతూ ఉంటే వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇతర అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన మెడిసిన్‌ను వాడాలి. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా ఎలాంటి అనారోగ్యాన్నయినా ఇట్టే తగ్గించుకోవచ్చు జలుబు, ఫ్లూ జ్వరానికి... ఒక కప్పు మరుగుతున్న నీటిలో ఒక నిమ్మకాయను పిండి అనంతరం ఆ తొక్కను కూడా అందులో వేయాలి. దాన్ని 10 నిమిషాల ఉంచాక తీసేయాలి. ఆ నీటిలో టీస్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు, ఫ్లూ జ్వరం తగ్గుతాయి. వికారంగా ఉంటే... కడుపు అంతా ఉబ్బరంగా అదోలా ఉండి, వికారంగా ఉంటే నల్లమిరియాల పొడి, నిమ్మరసం తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. అనంతరం ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతుంటే వికారం తగ్గుతుంది. గాల్ స్టోన్స్‌కు... నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ఆలివ్ ఆయిల్‌తో కలిపి తింటుంటే గాల్ స్టోన్స్ పోతాయి. దానివల్ల వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది. -
మార్చిలోనే మంటలు
ప్రచండ భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తన తడాఖా చూపుతున్నాడు. ఎండలతో జనాలను ఠారెత్తిస్తున్నాడు. హైదరాబాద్‌లో 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తోడు కాంక్రీట్ మహారణ్యం కారణంగా ఇప్పుడు అతినీల లోహిత కిరణాల తీవ్రత భారీగా పెరిగింది. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ఇండెక్స్ (యూవీ) సూచీ ‘పది’పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచీ 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మార్చిలోనే పది మార్కు దాటేసింది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మేలో యూవీ సూచీ 12 పాయింట్లకు చేరే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల కారణంగా సూర్యుడి నుంచి వెలువడిన ఉష్ణం భూ ఉపరితల వాతావరణానికే పరిమితం అవుతోంది. ఫలితంగా మార్చి నెలల్లో వికిరణ తీవ్రత పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ యూవీ ఇండెక్స్ అంటే.. రోజులో ఏదైనా ప్రాంతంలో, సమయంలో మానవ చర్మం మంటపుట్టించే అతినీల లోహిత కిరణాల తీవ్రతను (వివిధ తరంగ ధైర్ఘ్యాల వద్ద) యూవీ ఇండెక్స్‌గా పరిగణిస్తారు. సూచీ తీవ్రత పెరిగిన కొద్దీ చర్మంపై యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు యూవీ ఇండెక్స్ 6 ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఎండలో 30 నిమిషాల పాటు నిలబడితే అతడికి సన్‌బర్న్ (చర్మం మంటపుట్టడం) వచ్చే అవకాశం ఉంటుంది. అదే సూచీ 12 కనుక ఉంటే 15 నిమిషాల్లోనే ఆ వ్యక్తి చర్మం మంట పుట్టడం, కందిపోవడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు వస్తాయి. ఎండ తీవ్రతను కొలిచేందుకు ఈ సూచీని ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సూచీని 1994లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ సూచీ ఆధారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సంస్థలు అవగాహన ఇస్తుంటాయి. సమస్యలు.. పరిష్కారాలు యూవీ ఇండెక్స్ పెరగడంతో ఓజోన్ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. ఓజోన్ రక్షణ లేక మనుషులపై నేరుగా పడటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మంట పుట్టడం, రెటీనా దెబ్బతినడం జరుగుతాయి. యూవీ సూచీ సాధారణంగా 7 పాయింట్లకు పరిమితమైతే ఇబ్బందులు ఉండవు. 10 పాయింట్లు నమోదైతేనే ప్రమాదం. 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ పెట్టుకోవాలని, గొడుగు వాడాలని సూచిస్తున్నారు. పలు మెట్రోనగరాల్లో హరితం ఇలా.. దేశంలో 35% గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్ తొలిస్థానంలో ఉంది. రెండోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలో 20.2%, గ్రీన్‌సిటీగా పేరొందిన బెంగళూరులో 19%, కోల్‌కతాలో 15%, ముంబైలో 10%, చెన్నైలో 9.5% గ్రీన్‌బెల్ట్ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో మాత్రం 8 శాతానికే పరిమితం కావడంపై పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో తగ్గుతున్న హరితం.. హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా.. గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు దోహదపడలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను పంపిణీ చేశారని.. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో గ్రేటర్లో గ్రీన్‌బెల్ట్ 8 శాతానికే పరిమితమైందని పేర్కొంటున్నారు. గ్రీన్‌బెల్ట్ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో మహానగరం ఏడో స్థానంలో నిలిచిందని పేర్కొంటున్నారు. ఇలా చేస్తే మేలు.. - ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్ద మొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. - సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వాలి. - నూతన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉం డాలి. లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. -
కనిపించని శత్రువు!
రాజేశం అనే ఓ వ్యక్తి బయటకు చూడడానికి ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ చాలా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అతన్ని చూస్తే అరుదైన వ్యాధికి గురైనారని ఎవరూ నమ్మరు. చెప్పినా పట్టించుకోరు. డాక్టర్ల వద్దకు వెళ్లినా ఇదే పరిస్థితి. వెంకటలక్ష్మి అనే యువతి ఒకరోజు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. మరుసటిరోజు అనారోగ్యానికి గురవుతారు. మళ్లీ రెండు రోజులకు సాధారణస్థితిలోకి వస్తారు. ఇదీ అరుదైనవ్యాధికి గురైన మహిళ పరిస్థితి. – సాక్షి, హైదరాబాద్ వీరిలాగే దేశంలో దాదాపు 10 కోట్ల మంది అరుదైన వ్యాధులకు గురవుతున్నారు. ప్రపంచంలోని అరుదైన వ్యాధిగ్రస్తుల్లో 25 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారని తేలింది. హైదరాబాద్ జనాభాలో దాదాపు ఆరున్నర లక్షలమంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది. ఇలాంటి వ్యాధులను గుర్తించడం అత్యంత ఖరీదైన వ్యవహారం కావడంతో ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్(ఐవోఆర్‌డీ) అనే సంస్థ అరుదైన వ్యాధులపై సర్వే చేస్తుంది. అరుదైన రోగాలతో బాధపడుతున్న రోగులను గుర్తించడం, వారికి అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. అరుదైన వ్యాధుల్లో 70 శాతం పిల్లలకు సంబంధించినవే ఉండటం ఆందోళన కలిగించే అంశం. 12 శాతం పెద్దలకు సంబంధించినవి ఉంటు న్నాయి. 18 శాతం పెద్దలకు, పిల్లలకు సంబంధించినవి ఉంటున్నాయి. అరుదైన వ్యాధుల్లో 72 శాతం జన్యుపరమైనవే. 28 శాతం వ్యాధులు జీవితంలో ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉన్నది. ప్రతి వెయ్యి మందిలో ఒకరికి ఎర్ర రక్తకణాల్లో డిజార్డర్ అరుదైన వ్యాధులేంటనే విషయాలను గమనిస్తే ఆందోళన కలగకమానదు. అరుదైన వ్యాధుల్లో ఒకటైన అక్వైర్డ్ అప్లాస్టిక్ ఎనీమియా. అంటే బోన్‌మ్యారో ఫెయిల్యూర్ అయి రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది 10 లక్షల్లో ఇద్దరికి వస్తుంది. ఇక సికిల్ సెల్ డిసీజ్. ఎర్రరక్త కణాల్లో డిజార్డర్ అన్నమాట. ఇది ప్రతి వెయ్యి మందిలో ఒకరికి వస్తుంది. ఈ రెండూ కూడా రక్తంలో వివిధ రకాలుగా మార్పులు తీసుకొస్తాయి. నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపే వ్యాధి ఒకటి ఉంది. ఎలాంటి నొప్పీ ఉండదు. చెమట పట్టదు. గాయాలైతే ఆలస్యంగా తగ్గుతాయి. దీన్ని కాంగీన్షియల్ ఇన్సెన్సివిటీ టూ పెయిన్ విత్ యాన్‌హైడ్రోసిస్ వ్యాధి అంటారు. ఇది రెండు కోట్ల మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. లైసోసోమాల్ స్టోరేజీ డిజార్డర్ అనే వ్యాధి మెటబాలిజం డిజార్డర్‌కు సంబంధించింది. ఎంజైమ్ కొరత వల్ల ఇది వస్తుంది. ఇది మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. ఇది ప్రతి 7,700 మందిలో ఒకరికి వస్తుంది. మ్యాక్యులర్ డీజనరేషన్ అనే వ్యాధి కంటికి సంబంధించింది. ఇది పెద్దల్లో వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 62 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పీడియాట్రిక్ కార్డియోమయోపతి అనే వ్యాధి గుండెకు సంబంధించింది. పిల్లల గుండెల్లోని మజిల్‌లో డిజార్డర్ వస్తుంది. ఇది లక్షలో ఒకరికి వస్తుంది. ఇక మజిల్ డైస్ట్రోపి అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. బాలురల్లో ఇది కనిపిస్తుంది. ప్రతీ 3,500 మందిలో ఒకరికి వస్తుంది. కొన్ని అరుదైన వ్యాధుల లక్షణాలను గుర్తించడం నాలుగైదు ఏళ్లు పడుతుంది. గరిష్టంగా 20 ఏళ్లు కూడా తీసుకుంటుంది. అరుదైన వ్యాధులను గుర్తించేలా చాలా డయాగ్నస్టిక్ సెంటర్లు అభివృద్ధి కాలేదు. అరుదైన వ్యాధులపై చాలామంది వైద్యులకు శిక్షణే లేకపోవడం గమనార్హం. అరుదైన వ్యాధులకు చికిత్స చేసే ప్రత్యేక మౌలిక సదుపాయాలు, పరికరాలు అనేక కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ అందుబాటులో లేవు. విచిత్రమేంటంటే దేశంలో అరుదైన వ్యాధులకు సంబంధించిన స్పష్టమైన విధానమే కేంద్రం తయారు చేయలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
గట్టిగా అరిస్తే నిద్ర పడుతుంది: సీఎం
సాక్షి, అమరావతి: అందరూ ఆనందంగా ఉండేందుకు ‘హ్యాపీ సండే’పెట్టానని.. రోడ్ల మీద డ్యాన్సులు వేస్తుంటే చూస్తూ ఆనందించవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. లేకపోతే ఇంట్లో నుంచి బయటికొచ్చి గట్టిగా కాసేపు అరిచి.. ఇంటికెళితే మంచిగా నిద్రపడుతుందని ఆయన సూచించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో హెల్త్ బులెటిన్ ఆవిష్కరణ, పలకరింపు కార్యక్రమ పోస్టర్లను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) కింద ఎన్ని ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టినా.. ‘ఆరోగ్యం’లో రాష్ట్రం ఇంకా 8వ స్థానంలోనే ఉందని పేర్కొన్నారు. ఆర్థరైటిస్, ఆస్తమా, మధుమేహం, హైపర్ టెన్షన్ తదితర జబ్బులతో బాధ పడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పారు. మానసిక జబ్బులు కూడా తీవ్రంగా పెరిగాయని.. ఇది మంచిది కాదన్నారు. ప్రతినెలా హెల్త్ బులెటిన్ ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? అనేది అవగాహన వస్తుందన్నారు. చాలా మంది మరుగుదొడ్డి కట్టుకోలేదు గానీ.. సెల్‌ఫోన్ కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ పద్ధతి సరికాదన్నారు. తనకు ఉంగరం గానీ, గడియారం గానీ లేవని సీఎం చెప్పుకొచ్చారు. చాలామంది బంగారం, డైమండ్ వంటి ఆభరణాలు పెట్టుకొని ఆనందం పొందాలనుకుంటున్నారని.. కానీ దాని వల్ల ఆనందం రాదన్నారు. అనారోగ్య సమస్యలున్న డాక్టర్లకు ఆరోగ్య సూచనలిచ్చే అర్హత లేదని తేల్చిచెప్పారు. ఈనెల 5 నుంచి 30వ తేదీ వరకూ ‘పలకరింపు’కార్యక్రమం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు. 57 వేల మందికి పైగా సిబ్బంది 1.22 కోట్ల ఇళ్లకు వెళ్లి ఈ ‘పలకరింపు’కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చిన్నారుల మృత్యుఘోష..
-
చిన్నారుల మృత్యుఘోష..
నల్లగొండ: తల్లిఒడి నుంచి దూరమైన అనాథ శిశువులకు కొండంత అండగా నిలవాల్సిన ఆ శిశుగృహలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ముర్రుపాల రుచికూడా తెలియకుండా పుట్టిన కొద్దిరోజులకే అందులోకి అడుగుపెడు తున్న శిశువులకు అనారోగ్య సమస్యలు ప్రాణాంతకమవుతున్నాయి. నెలలు కూడా నిండని ఆ చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పసి మొగ్గలుగానే ప్రాణాలు వదిలేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శిశుగృహలో ఇటీవలికాలంలో వరుసగా 10 మంది శిశువులు మృతిచెందిన సంఘటనలు కలవరం రేపుతు న్నాయి. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పిం చేందుకు నల్లగొండ, దేవరకొండలో శిశుగృహా లు ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో దేవరకొండ కేంద్రాన్ని కూడా నల్లగొండలోనే కలిపి నిర్వహిస్తున్నారు. ఒక్కో శిశుగృహానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంఖ్య పది మంది చిన్నారులు మాత్రమే. కానీ ప్రస్తుతం ఈ రెండు గృహాల్లో కలిపి మొత్తం 50 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. శిశుగృహలో పదిమంది దాటితే హైదరాబాద్ లోని శిశువిహార్‌కు తరలించాలి. కానీ, అక్కడ కూడా పరిస్థితులు సరిగా లేకపోవడంతో నల్లగొండలోనే ఉంచుతున్నారు. అయితే నల్ల గొండ కేంద్రంలోని చిన్నారులకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. అధికారులు అందిస్తున్న పోషకాహారం లో లోపాలు ఉండటంతో శిశువులకు ఏ కొద్దిపాటి అనారోగ్య సమస్య తలెత్తినా అల్లాడిపోతున్నారు. శిశువుల్లో ఎక్కువ మంది ఆడపిల్లలే కావడం, వారి వయస్సు రోజుల వయస్సు నుంచి రెండేళ్ల లోపే ఉండటంతో అనారోగ్య సమస్యలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ప్రాణాలతో చెలగాటం.. శిశుగృహాల్లో చేరుతున్న చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. తల్లినుంచి వేరైన పిల్లలకు ముర్రుపాలు అందకపోవడం ప్రధాన సమస్య అయితే ఆ తర్వాత అధికా రులు అందించాల్సిన పౌష్టికాహారం కూడా సమపాళ్లలో అందడం లేదు. పాల డబ్బాలు కొనేందుకు కూడా అధికారుల వద్ద డబ్బులు లేకపోవడంతో విజయ డెయిరీ.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే టెట్రా పౌడర్ ప్యాకెట్లను వాడుతున్నారు. ప్యాకెట్లలోని పౌడర్‌లో పౌష్టికాహార గుణాలు తక్కువగా ఉండటంతో ఆ ప్రభావం శిశువుల ఎదుగుదలపై పడుతుందని వైద్యులు తెలిపారు. పోషకాహార లోపంతోనే చిన్నారులు వాంతులు, విరోచనాలు, శ్వాసకోస వ్యాధుల తో ఆస్పత్రుల్లో చేరారు. పిల్లలకు ఇస్తున్న పాల పౌడర్‌లో లోపం ఉండటంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారిందని తేలింది. టెట్రా పౌడర్ వాడటం వల్ల కిడ్నీలపై దాని ప్రభావం పడిందని వైద్యులు తెలిపారు. మరో శిశువుకు పాలు పట్టించడంలో ఆయాలు సరైన పద్ధతి పాటించకపోవడంతో ఆ శిశువు చనిపోయింది. శిశువుకు పట్టిన పాలు శ్వాసనాళానికి అడ్డుపడ టంతో ఊపిరి పీల్చు కోలేకపోయింది. ఆ శిశువును ఆస్పత్రికి తీసుకొ చ్చినా వైద్యులు కాపాడలేకపోయారు. ఇలాంటి సమస్యను ఎదుర్కొన్న 20 మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడగలిగామని వైద్యులు తెలిపారు. సకాలంలో వైద్యం అందక.. శిశుగృహలోని పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు అప్పటికప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గి బరువు తక్కువగా ఉన్న పిల్లలకు వైద్యులు ఏమీ చేయలేకపోతున్నారు. వైద్య ఖర్చులు భారీగా ఉండటంతో వెనుకాడుతున్నారు. చివరికి శిశు వులను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ మూడు నెలల కాలంలో ఆరుగురు శిశువులు మృతి చెందారు. కానీ అనధికారికంగా వచ్చిన సమాచారం మేరకు పదిమంది శిశువులు మృతి చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం 8 మంది చిన్నారులు నల్లగొండలోని ప్రభుత్వ ఆస్ప త్రిలో 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురిని నిలోఫర్‌కు తరలించారు. -
ఆటోఫేగీని నియంత్రిస్తే దీర్ఘాయుష్షు
సాక్షి, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టి చివరకు మరణించడం చాలా సహజం. అయితే ఎందుకిలా జరుగుతుం దన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇప్పటివరకు లేదు. జర్మనీలోని ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మాలిక్యులార్ బయాలజీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా వార్ధక్యం ఎందుకు వస్తుందన్న కీలక ప్రశ్నకు సమాధానం కనుక్కున్నామని అంటున్నారు. శరీర కణాలు ఎప్పటికప్పుడు చనిపోతూ, వీటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తుంటాయి కదా. ఒకసారి పనిచేయడం ఆగిపోయాక.. కణాల్లోని భాగాలను నాశనం చేసేందుకు ఆటోఫేగీ అనే ఓ ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ చిన్నతనంలో ఆరోగ్యం, శరీరధారుడ్యానికి తోడ్పడితే.. వయసు పెరిగే కొద్దీ వార్ధక్య లక్షణాలను ప్రోత్సహిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆటోఫేగీని నిలిపేయడం ద్వారా వయసు మీరిన కీటకాల్లో వార్ధక్య లక్షణాలతోపాటు నాడీ సంబంధిత సమస్యలు కూడా తగ్గినట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని ఈ పరిశోధనల్లో పాలుపం చుకున్న శాస్త్రవేత్త జోనాథన్ బైర్న్ చెబుతున్నారు. -
అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
పెదపాడు : అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పెదపాడుకు చెందిన లంకపల్లి శాంతిప్రియ(26) ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంది. స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం సమీపంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి అనారోగ్య సమస్యలే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
బ్యాగు..భారం
అమ్మా...భుజం, వెన్ను నొప్పి వేస్తోంది..కాళ్లు గుంజుతున్నాయి. అంటు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వికాస్ బ్యాగు టేబుల్ పై పెట్టి విశ్రాంతికి ఉపక్రమిస్తున్నాడు. ఇంటికి రాగానే నీరసం. ఏమి తినలేడు. తాగలేడు. అసహనానికి గురవుతాడు..ఇదీ విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రతీ ఇంట్లో పిల్లలు పలికే అవస్థల పలుకులు. ఎందుకంటే వారి వయస్సుకు మించిన పుస్తకాల బరువు మోస్తున్నారు మరీ..! ఈ వ్యవస్థ మారేదెప్పుడో?..పిల్లల కష్టాలు తీరేదెప్పుడో?. - స్థాయికి మించిన పుస్తకాల మోత - విద్యార్థుల్లో పెరుగుతున్న అసహనం - అమలు కాని యశ్పాల్ కమిటీ సిఫార్సులు - వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు - మానసికగ్రస్తులుగా మారుతున్నారని తల్లిదండ్రుల ఆందోళన మంచిర్యాల అర్బన్ : నర్సరీ నుంచి పదో తరగతి వరకు పిల్లలను విద్య పేరిట పుస్తకాల బరువులు మోయిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, కంపాక్స్, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా వయస్సుకు మించిన అధిక భారం మోస్తున్నారు. చదువు చారెడు..పుస్తకాలు బోలెడు అన్న చందంగా ఉంది విద్యార్థుల దుస్థితి. బరువు భారం పెరిగే కొద్దీ విద్యార్థుల్లో వెన్నుపూస నొప్పి వస్తోంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు భవనాల్లో ఉండడంతో మూడు, నాలుగు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి ఉంటోంది. రోడ్డుపై నడవడం గగనం కాగా నాలుగు అంతస్తుల భవనం మెట్లెక్కడం ఎంత కష్టమో తల్లిదండ్రులు, యాజమాన్యాలు గమనించడం లేదు. పిల్లలు కాన్వెంట్ చదువులతో ఉన్నత స్థితికి చేరాలని ఆరాటపడుతారే కానీ వారి బరువు భారం గురించి వీసమెతై ్తన యోచించడం లేదు. యశ్పాల్ కమిటీ చేసిన సిఫార్సులు కూడా అమలు కావడం లేదు. ఏటా విద్యా సంస్థల ఆరంభంలో పుస్తకాల బరువుపై చర్చ జరుగుతోంది. విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడం షరా మామూలే. అయితే విద్యాశాఖ అధికారులు చిత్తశుద్ధితో సిఫార్సులు అమలు చేస్తే విద్యార్థులకు పుస్తకాల బరువుతోపాటు వారిలో మానసిక ఆందోళన తగ్గుతుంది. తల్లిదండ్రులు ఏమి చేయాలి? విద్యార్థుల తల్లిదండ్రులు తగిన సూచనలు పాటిస్తే మంచిది. పిల్లలు ఎన్ని పుస్తకాలు తీసుకువెళ్లాలి. బ్యాగ్ బరువు ఎంత వరకు ఉండాలో స్వయంగా చూడాలి. 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులు బ్యాగ్ బరువు 2 నుంచి 5 కేజీల వరకు ఉండేలా చూడాలి. ఐదు నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల బ్యాగు బరువు ఏడు కేజీలలోపు ఉండాలి. సాధ్యమైంత వరకు పుస్తకాల బరువు ఎక్కువగా ఉండకుండా చూడాలి. బ్యాగులు కూడా తక్కువ బరువు ఉన్నవి కొనుగోలు చేయడం వల్ల బరువును తగ్గించవచ్చు. నిబంధనలు బేఖాతర్ విద్యార్థుల పుస్తకాల బరువు ఎంత ఉండాలి.. ఎలాంటి విద్యను అందించాలి, విద్యా విధానం విలువల గురించి ఓ కమిటీ చేసిన సిఫార్సులు బుట్టదాఖలు అవుతున్నాయి. ఏ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న పాపానపోవడం లేదు. విద్యా శాఖ అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు శాపంగా మారారనే ఆరోపణలున్నాయి. దేశంలోని విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1992లో యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్ నేతత్వాన సిఫార్సు కమిటీని నియమించారు. వారు దేశంలోని విద్యావ్యవస్థలను అధ్యయనం చేసి కేంద్రానికి పలు సిఫార్సులు చేశారు. వాటిని కేంద్రం ఆమోదిస్తూ ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. 2005 నుంచి విద్యాహక్కు చట్టంలో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు రెండు నుంచి మూడు కిలోల బరువు, ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు 5 నుంచి 6 కిలోల పుస్తకాల బరువు మోయరాదని సూచించింది. విద్యార్థులను యంత్రాలుగా చూడరాదని స్పష్టంగా హెచ్చరించింది. అయినా ఏ ప్రభుత్వం కూడా ఆచరణలో అమలు చేయడం లేదు. విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఇవీ అనర్థాలు - విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. - నడుం, వెన్ను నొప్పి, కండరాల నొప్పి వస్తుంది - మానసిక ఆందోళన పెరుగుతుంది. చదువుపై మనసు లగ్నం చేయలేరు - త్వరగా నీరస పడుతారు. ఆటలు ఆడలేరు. బాగా చదవలేరు - జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఆకలి వేయదు - పుస్తకాలను చూడగానే ఆందోళనకు గురవుతారు - పాఠశాలకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత అసహనానికి గురవుతారు. చీటికి మాటికి ఏడ్వడం, మంకుపట్టు పడతారు