
సాక్షి, అమరావతి: అందరూ ఆనందంగా ఉండేందుకు ‘హ్యాపీ సండే’పెట్టానని.. రోడ్ల మీద డ్యాన్సులు వేస్తుంటే చూస్తూ ఆనందించవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. లేకపోతే ఇంట్లో నుంచి బయటికొచ్చి గట్టిగా కాసేపు అరిచి.. ఇంటికెళితే మంచిగా నిద్రపడుతుందని ఆయన సూచించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో హెల్త్ బులెటిన్ ఆవిష్కరణ, పలకరింపు కార్యక్రమ పోస్టర్లను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) కింద ఎన్ని ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టినా.. ‘ఆరోగ్యం’లో రాష్ట్రం ఇంకా 8వ స్థానంలోనే ఉందని పేర్కొన్నారు. ఆర్థరైటిస్, ఆస్తమా, మధుమేహం, హైపర్ టెన్షన్ తదితర జబ్బులతో బాధ పడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పారు.
మానసిక జబ్బులు కూడా తీవ్రంగా పెరిగాయని.. ఇది మంచిది కాదన్నారు. ప్రతినెలా హెల్త్ బులెటిన్ ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? అనేది అవగాహన వస్తుందన్నారు. చాలా మంది మరుగుదొడ్డి కట్టుకోలేదు గానీ.. సెల్‌ఫోన్ కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ పద్ధతి సరికాదన్నారు. తనకు ఉంగరం గానీ, గడియారం గానీ లేవని సీఎం చెప్పుకొచ్చారు. చాలామంది బంగారం, డైమండ్ వంటి ఆభరణాలు పెట్టుకొని ఆనందం పొందాలనుకుంటున్నారని.. కానీ దాని వల్ల ఆనందం రాదన్నారు. అనారోగ్య సమస్యలున్న డాక్టర్లకు ఆరోగ్య సూచనలిచ్చే అర్హత లేదని తేల్చిచెప్పారు. ఈనెల 5 నుంచి 30వ తేదీ వరకూ ‘పలకరింపు’కార్యక్రమం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు. 57 వేల మందికి పైగా సిబ్బంది 1.22 కోట్ల ఇళ్లకు వెళ్లి ఈ ‘పలకరింపు’కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment