యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ లక్మూ అలియాస్ హెచ్చీ
1995లో దళంలోకి...
మహబూబాబాద్ జిల్లా గంగారం మండ లం మరిగూడానికి చెందిన యాప నారాయణ 1995లో పీపుల్స్ వార్‌లో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయికి చేరాడు.
కేడర్ నిర్మాణం కోసం...
2019 చివరి నుంచి మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. తెలంగాణలో కేడర్ నిర్మాణం కోసం రిక్రూట్‌మెంట్ చేపట్టడమే గాక, పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడు.
నలుగురు కీలక నేతలు..
అనారోగ్యంతో జూన్ 6న డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, జూన్ 10న కత్తి మోహన్.. 16న విశాఖ ఎన్‌కౌంటర్‌లో పెద్దపల్లి జిల్లాకు చెందిన సందె గంగయ్యలను పార్టీ కోల్పోయింది. తాజాగా హరిభూషణ్ మరణం.
సాక్షి, హైదరాబాద్/మహబూబాబాద్/ గంగారం/కొత్తగూడ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ లక్మూ అలియాస్ హెచ్చీ సోమవారం మరణించారు. ఇటీవల అనారోగ్యంతో మావో అగ్రనేత కత్తి మోహన్ అలియాస్ ప్రకాశ్ మరణం మరువకముందే.. మరో కీలకనేత మృతి చెందడం దండకారణ్యంలో కలకలం రేపుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలోని మీనాగుట్ట ప్రాంతంలో మరణించాడన్న వార్త మంగళవారం ఛత్తీస్‌గఢ్- తెలంగాణలో దావానంలా వ్యాపించింది. ఆయన అంత్యక్రియలను తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో నిర్వహించారని తెలిసింది. హరిభూషణ్ కరోనాతో లేదా ఫుడ్ పాయిజనింగ్‌తో మరణించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయాలను తొలుత బస్తర్ పోలీసులు ధ్రువీకరించలేదు. సాయంత్రానికి ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు హరిభూషణ్ మరణవార్తను నిర్ధారించారు.
2018లో ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని..
హరిభూషణ్ దళంలో పని చేస్తున్న సమయంలోనే మేనమామ కూతురు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదను వివాహం చేసుకున్నాడు. ఈమె ప్రస్తుతం శబరి–చర్ల ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉంది. అనేక ఎన్‌కౌంటర్లలో త్రుటిలో తప్పించుకున్న హరిభూషణ్ చాలాసార్లు మరణించాడని ప్రచారం జరిగింది. 2018, మార్చిలో బీజాపూర్ జిల్లా పూజారి కంకెర అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆసమయంలో హరిభూషణ్ దంపతులు సురక్షితంగా తప్పించుకున్నారు. అయితే అప్పుడు అతడు మరణించాడంటూ వార్తలొచ్చాయి.
పలు కార్యకలాపాలకు మూలం ఇతనే..
గణపతి తరువాత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నంబాల కేశవరావు స్వీకరించినప్పటి నుంచి పార్టీలో హరిభూషణ్‌కు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణలో కేడర్ నిర్మించుకోవాలన్న కేశవరావు ఆదేశాలతో 2019 చివరి నుంచి కార్యక లాపాలు ముమ్మరం చేశాడు. రిక్రూట్‌మెంట్లకు, పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో కలసి ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్-భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్లకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను పోలీసులు తిప్పికొట్టారు. వరుసగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 10 మంది మావోలు మరణించారు. దీంతో హరిభూషణ్ అతని అనుచరులు వెనకడుగు వేశారు. పోలీసుల గాలింపు తీవ్రతరం కావడం, లాక్‌డౌన్ ఎత్తివేయడంతో హరిభూషణ్ అతని అనుచరులు తిరిగి దండకారణ్యానికి వెళ్లారు. గతే డాది చివర్లో కూడా ప్రాణహిత నది మీదుగా మహా రాష్ట్ర నుంచి పలుమార్లు హరిభూషణ్ తెలంగాణ లోకి ప్రవేశించాడని నిఘా వర్గాలు స్థానిక పోలీసులను హెచ్చరించాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టినా హరిభూషణ్ ఆచూకీ మాత్రం చిక్కలేదు.
3 వారాల్లో నలుగురు నేతలు..
మావోయిస్టుల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర అలజడి సృష్టిస్తోంది. 3 వారాల్లోనే నలుగురు కీలక నేతలను కోల్పోయింది. ఈసారి వచ్చిన స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉండటం.. మావోయిస్టు అగ్రనేతలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండటంతో అగ్రనేతలు మరణాల బారిన పడుతున్నారని బస్తర్ పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏప్రిల్‌లో బీజాపూర్‌లో పోలీసులపై మావో అగ్రనేత హిడ్మా నేతృత్వంలో జరిగిన ఊచకోతకు ప్రతీకారం కోసం సీఆర్‌పీఎఫ్ కోబ్రా బలగాలు ఎదురుచూస్తున్నా యి. దండకారణ్యంలో మావోలకు పట్టున్న ప్రాం తాలను డ్రోన్ల ద్వారా తెలుసుకుంటున్నారు. మావోలను అష్టదిగ్బంధనం చేశారని అందుకే వారు బయటికి రాలేక, చికిత్స అందక మరణిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే, లొంగిపోతే తాము చికిత్స అందిస్తామని తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించినా.. అందుకు మావోలు సిద్ధంగా లేరు.
పీపుల్స్ వార్‌లోకి ఇలా..
యాప పాపమ్మ, రంగయ్య దంపతుల ఏడుగురు సంతానంలో నారాయణ పెద్ద కుమారుడు. నర్సంపేటలో డిగ్రీ చదివిన ఆయన 1985 - 90 మధ్యకాలంలో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా, ఐటీడీఏ మైనర్ ఇరిగేషన్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. అయితే అప్పుడు కొత్తగూడ, ఇల్లందు, గుండాల ఏజెన్సీ ప్రాంతాల్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అప్పటి నుంచే నారాయణ పీపుల్స్‌వార్ అనుబంధంగా పనిచేస్తూ మిత్రుడు రాజకోటితో కలసి న్యూడెమోక్రసీ పార్టీ విధానాలు, వారికి వ్యతిరేకంగా గ్రామాల్లో పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని హత్య చేసేందుకు న్యూడెమోక్రసీ నేతలు వ్యూహం పన్నారు. 1991, మే 31న గ్రామంలో జరిగే వివాహానికి నారాయణ, రాజకోటి వస్తారని కాపుకాసిన ఎన్‌డీ నేతలకు రాజకోటి దొరకగా.. నారాయణ అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పీపుల్స్‌వార్ దళంలోకి వెళ్లాడు. పీపుల్‌వార్‌లో చేరిన హరిభూషణ్ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. దళసభ్యుడిగా, మిలిటరీ ప్లాటూన్ శిక్షణ కమాండర్‌గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర కార్యదర్శి, తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా ఎదిగారు. హరిభూషణ్‌పై ప్రభుత్వం రూ.20లక్షల రివార్డు ప్రకటించింది.
ఎలాంటి సమాచారం లేదు
హరిభూషణ్ మృతి చెందాడనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఆయన స్వగ్రామం మడగూడెం విషాదఛాయలు అలముకొన్నాయి. అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వారంతా మంగళవారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండటం కనిపించింది. గతంలోనూ హరిభూషణ్ చనిపోయాడని వార్తలు వచ్చాయని.. దీంతో తమ తండ్రి రంగయ్య మనోవేదనకు గురై మంచాన పడ్డారని హరిభూషణ్ సోదరులు అశోక్, రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కోలుకుంటున్న తమ తండ్రికి మళ్లీ హరిభూషణ్ మరణించాడని వార్తలు చేరడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని హరిభూషన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment