సిరిసిల్ల: మావోయిస్టు అగ్రనేతలకు ఆత్మీయుడు నిజాం వెంకటేశం. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని మావో యిస్టు అగ్రనేతలు ఆయన మరణించే దాకా బయటపెట్టలేదు. సిరిసిల్ల పట్టణానికి చెందిన నిజాం వెంకటేశం(74) గతేడాది సెప్టెంబరు 18న హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణించిన విషయం తెలిసి..సరిగ్గా పది రోజులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఓ వ్యాసం రాశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల రాసిన వ్యాసం ఏడాది కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎవరీ నిజాం వెంకటేశం.. ఏమిటీ ఆయన చరిత్ర అని ఆరా తీశారు. ఆయన మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా ‘అన్నలకే పెద్ద న్న’ అయిన నిజాం వెంకటేశం అడుగుజాడలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఎవరీ నిజాం వెంకటేశం..
కల్లోల సిరిసిల్లలో 1948 నవంబరు 14న వైశ్య కుటుంబంలో పుట్టి పెరిగిన నిజాం వెంకటేశం ట్రాన్స్‌కో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన మూలాలు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఉన్నాయని తెలుసుకున్న పలువురు సాహితీవేత్తలు ఉద్వేగానికి గురయ్యారు. సమసమాజ స్థాపనకు జరుగుతున్న ప్రజా యుద్ధంలో తన వంతు శక్తికి మించి సాయాన్ని అందించారని నిజాం వెంకటేశం నిజాల గురించి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రాసిన వ్యాసంతో వెల్లడైంది. పెద్దపల్లిలోని తన చిన్ననాటి మిత్రులు ఒకసారి పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.
‘అవును వెంకటేశం సార్ ఇక్కడే ఉండేవారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత తిరిగి పెద్దపెల్లికి రాలేదు’ అంటూ 42 ఏళ్ల క్రితం తనతో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఐదారేళ్లు పెద్దపల్లిలోనే ఉద్యోగం చేశారు. కరెంటు పవర్ హౌస్ (రాఘవపూర్ సబ్ స్టేషన్) లో ఉద్యోగం చేస్తూ ఓ సాహితీవేత్తగా విప్లవానికి అందించాల్సిన సేవలు అందించారు. ఆయన విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూనే.. గుట్టలు సమీపంలో ఉండడంతో పెద్దపల్లిలో ఐటీఐ చదివే వారు, విప్లవకారులు ఆయన ఇంటిని షెల్టర్‌గా చేసుకున్నారు.
కుటుంబ సభ్యులు కూడా వారికి భోజనం పెట్టి ఆత్మీయంగా ఉండేవారని మల్లోజుల తన వ్యాసంలో వెల్లడించారు. తన కంటే ముందు తన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్‌రావుకు వెంకటేశం అత్యంత సన్నిహితుడని వివరించారు. తనను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని డబుల్ సవారీ చేస్తూ తనకు ప్రపంచాన్ని పరిచయం చేశాడని వేణుగోపాల్ చెప్పడం విశేషం.
అగ్రనేతలకు ఆత్మీయుడు..
పశ్చిమబెంగాల్‌లో అమరుడైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ మొదలుకొని ఇప్పటికీ సజీవంగా కేంద్ర కమిటీలో ఉన్న గణపతి అలియాస్ ముప్పళ్ల లక్ష్మణ్‌రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి (కోసా), మంథనికి చెందిన మల్లా రాజిరెడ్డి, ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధి గణేష్ ఇలా.. ఓ పదిపదిహేను మంది మావోయిస్ట్ అగ్రనేతలకు నిజాం వెంకటేశం సార్ ఇల్లు ప్రధాన షెల్టర్ అని రాఘవపూర్ గ్రామస్తులు తెలిపారు. వామ్మో సార్ ఇంటికి అప్పట్లో పెద్ద పెద్దోళ్లు (పెద్దన్నలు) వచ్చేవారని అంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణ కార్యదర్శి సాగర్ అలియాస్ దుగ్గు రాజ లింగం ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు.
రాజలింగంకు నిజాం వెంకటేశం అత్యంత సన్నిహితుడిగా మల్లోజుల వేణుగోపాల్ పేర్కొన్నారు. నిజాం వెంకటేశం విప్లవ కార్యాచరణకు అందించిన సహకారాన్ని వివరిస్తూ రాసిన లేఖ పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఒక సంచలనం రేపింది. విప్లవ ఉద్యమానికి ఆయన నిర్వర్తించిన పాత్ర అనిర్వచనమని మల్లోజుల పేర్కొన్నారు. ఆశ్రయం కల్పించడం, సాహిత్యాన్ని అందించడం, వచ్చినవారిని కడుపులో దాచుకోవడం, ఉద్యమంలో పాల్గొన్నవారిని, వారి ఆర్థిక అవసరాలను తీర్చి, ప్రోత్సహించేవారిని నాటి వెంకటేశం మిత్రులు పేర్కొంటున్నారు.
ఇలా ఉద్యమానికి అక్షరమై, ఆయుధాన్ని అందించిన వెంకటేశం సిరిసిల్ల ప్రాంత వాసి కావడం విశేషం. నిజానికి నిజాం వెంకటేశం గురించి సిరిసిల్ల ప్రాంత వాసులకు చాలా తక్కువే తెలుసు కానీ, ఆయనతో సన్నిహితంగా ఉండేవారికి అపర మేధావి, ధైర్యవంతుడు, పెద్ద యుద్ధానికి అగ్రనేతలను సంసిద్ధులను చేసిన పెద్దన్నగా పేరు సంపాదించినట్లు తెలిసింది.
హైదరాబాద్‌లో స్థిరపడి..
సిరిసిల్లకు చెందిన నిజాం విశ్వనాథం, సత్తమ్మ దంపతుల కొడుకు వెంకటేశం. భార్య పేరు మాధవి. ఒక్క కొడుకు, ఇద్దరు కూతుర్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 1966లో పాలిటెక్నిక్ చేసిన వెంకటేశం, చదువు పూర్తికాగానే 1968లో తొలిసారి ట్రాన్స్‌కోలో ఉద్యోగిగా జగిత్యాలలో విధుల్లో చేరారు. 1972 నుంచి 1978 వరకు పెద్దపల్లిలో పని చేశారు. అనంతరం 1978 నుంచి 1990 వరకు జగిత్యాల ప్రాంతంలో పని చేశారు. 1997లో ఉద్యోగ విరమణ చేశారు. ఇంగ్లిష్‌పై పట్టున్న ఆయన అనేక పుస్తకాలను తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. సిరిసిల్ల శివారులోని రంగినేని ట్రస్ట్‌లో జరిగే సాహిత్య వేడుకలకు ఆయన తరచూ వచ్చేవారు. సిరిసిల్లలో అనేక మంది కవులు, సాహిత్యకారులు నిజాం వెంకటేశం సన్నిహితులుగా ఉన్నారు. కవిగా, విమర్శకులుగా పలు సాహిత్యకార్యక్రమాల్లో పాల్గొన్నారు.
‘అజాత శత్రువు’గా పుస్తకం
వెంకటేశం సాహిత్యం.. వ్యక్తిత్వాన్ని ‘అజాత శత్రువు నిజాం వెంకటేశం’ పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. తెలంగాణ జిల్లాలోని ప్రముఖ రచయితలు, కవులు, సాహిత్యకారులు ఈ పుస్తకంలో ఆయనతో ఉన్న అనుబంధాలను రాశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆయన ఎదుటివారికి సాయం చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేవారు కాదు. తన సంపాదనలో ఎక్కువగా పుస్తకాల కొనుగోలుకు వెచ్చించినట్లు పలువురు తమ వ్యాసాల్లో వెల్లడించడం విశేషం. తను మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా సిరిసిల్ల ప్రాంతంలోని సాహిత్యకారులు ఆయన సేవలను యాది చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment