
తండాలో తాగునీటి తండ్లాట
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గిరిజనుల గొంతెండుతోంది. తాగునీటి కోసం మైళ్లకొద్దీ దూరంలోని వ్యవసాయబావుల వద్దకు వెళ్తున్నారు. మిషన్ భగీరథ నీరు సరిగాసరఫరా కాకపోవడంతో గిరిజన తండాల్లో తాగునీటి తండ్లాట మొదలైంది. నీటి కోసం పనులు సైతం బంద్ చేసుకొని ఇంటి వద్దే ఉంటున్నారు. అధికారులకు ముందుచూపు లేక రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అనేక తండాలు, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగుండారం పరిధి పోచమ్మతండాలో తాగునీటి కోసం గిరిజన మహిళలు వరుసగా రెండో రోజు సోమవారం ఆందోళనకు దిగారు. అయినా అధికారులు తండా వైపు కన్నెత్తి చూడడం లేదు. మిషన్‌భగీరథ నీరు అందకపోవడంతో వ్యవసాయబావెల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా గుండారం
రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా గత ప్రజాపాలనలో ఎంపిక చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌గా గుర్తించిన గ్రామంలోనే తాగునీటి కోసం తండావాసులు తండ్లాడుతున్నారు. తండాలో గత 15 రోజులుగా తాగునీరు రావడం లేదని అధికారులకు విన్నవించినా పట్టించుకునే వారు లేరు. తండాలో 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత ప్రభుత్వం ఈ తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి మిషన్ భగీరథ పథకాన్ని ఇక్కడ అమలు చేసింది. అయితే ప్రస్తుతం భగీరథ నీటి పైపులు పగిలిపోయి సరఫరా నిలిచిపోయింది.
బావుల నుంచి నీటి తరలింపునకు అభ్యంతరాలు
తాగునీటి కోసం తండ్లాడుతున్న గిరిజనులు వ్యవసాయబావుల నుంచి నీటిని తెచ్చుకుంటుండగా.. తాజాగా సోమవారం రైతులు మహిళలను అడ్డుకున్నారు. పంట పొలాలకు నీరు సరిపోవడం లేదని నీటిని తీసుకెళ్లేందుకు రైతులు నిరాకరిస్తున్నారు.
ఒక్క రోజుతోనే సరిపెట్టిన అధికారులు
గిరిజనులు ఆందోళన చేస్తున్న సమయంలో ఒక్క రోజు మాత్రమే ట్యాంకర్ ద్వారా నీటిని అందించిన అధికారులు తర్వాత చేతులు దులుపుకున్నారు. డాలోని ఇండ్లల్లో నీటితొట్టీలు, కుండలు, బిందెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రెండో రోజు మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలపడం తాగునీటి తిప్పలకు అద్దం పడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పగిలిన మిషన్‌భగీరథ పైపులను మరమ్మతు చేసి నీటిసమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ట్యాంకర్లతో నీటిని
అందిస్తున్నాం
తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అంది స్తున్నాం. కొన్ని రోజులుగా తండాలో నీటి సమస్య ఉంది. మిషన్‌భగీరథకు బదులుగా ట్యాంకర్లను ఏ ర్పాటు చేశాం. పైపులను మరమ్మతు చేసి ఈ వేసవిలో ఇబ్బందులు లేకుండా నీటిని అందిస్తాం.
– దేవరాజు, కార్యదర్శి, గుండారం

తండాలో తాగునీటి తండ్లాట