
వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు
వేములవాడ: ప్రజలు, చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా వేములవాడలో వీధివిక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో రూ.80లక్షలతో నిర్మించే వీధి విక్రయ మార్కెట్‌జోన్, రూ.56.50 లక్షలతో 11, 12వ వార్డుల్లో నిర్మించే సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులకు సోమవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు. కూరగాయల మార్కెట్‌తో రైతులు, చిరువ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల సాక్షి ప్రచురించిన కథనానికి ప్రభుత్వ విప్, కలెక్టర్ స్పందించి రెండోబైపాస్ రోడ్డులోని గంగమ్మగుడి ప్రాంతంలో తాత్కాలిక మార్కెట్ వద్ద రూ.80 లక్షలతో ప్రత్యేక షెడ్లు నిర్మించేందుకు ముందుకొచ్చారు. జనాభాకు అనుగుణంగా పట్టణంలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పట్టణంలోని 28 వార్డుల్లో రూ.10లక్షల చొప్పున వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మూలవాగుపై మూడో బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తవుతాయని, భూసేకరణకు రూ.6కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.47కోట్లతో రోడ్డు విస్తరణ చేయబోతున్నట్లు చెప్పారు. రూ.76కోట్లతో రాజన్న ఆలయ విస్తరణకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు మొదలవుతాయని తెలిపారు. గతంలో మళ్లిపోయిన రూ.20కోట్లు వీటీడీఏ నిధులను తెప్పించి బద్దిపోచమ్మ ఆలయం వద్ద పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. రూ.1.50కోట్లతో బస్తీ దవాఖానా నిర్మిస్తున్నామని, రూ.80లక్షలతో తిప్పాపూర్ వెళ్లే రోడ్డుకు ట్రాక్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ రాకేశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు టెండర్ పూర్తి ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు