
మంత్రివర్యా ఆలకించండి..
● సిరిసిల్లలో నిలిచిన పనులు ● 15 నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ● నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక ● మంత్రిపైనే ఆశలు పెట్టుకున్న ప్రజలు ● నిధులు విడుదల చేయాలని విన్నపం
సిరిసిల్ల: ప్రభుత్వాలు మారితే అభివృద్ధి స్వరూపం మారుతుంటోంది. ప్రాధాన్యతాంశాలు మారిపోతుండడంతో గత ప్రభుత్వంలో మొదలైన పనులు నిలిచిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం సిరిసిల్లలో కనిపిస్తోంది. 15 నెలల క్రితం సిరిసిల్లకు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత ఉండేది. నిధుల కేటా యింపు.. పనుల మంజూరులో అగ్రతాంబూలం దక్కేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో మొదలైన పనులకు నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి. సిరిసిల్ల నియోజకవర్గంపై పాలకుల చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడే పనులకు నిధులు మంజూరుకావడం లేదు. నిధులు రాక నిలిచిన అభివృద్ధి పనులపై ‘సాక్షి’ ఫోకస్ కథనం.
మంత్రివర్యా అభివృద్ధికి బాటలు వేయండి
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సిరిసిల్లలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్నారు. స్థానిక అంబేడ్కర్‌నగర్ రేషన్‌షాపులో మధ్యాహ్నం 12.30 గంటలకు సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. 15 నెలలుగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని కళాశాల మైదానంలో ఓపెన్‌జిమ్ లేదు. మంజూరైన అనేక సిమెంట్ రోడ్డు పనులు సాగడం లేదు. ఇప్పటికే పూర్తయిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఈ ప్రాంత సమస్యలను అధికారులతో సమీక్షించి అభివృద్ధికి బాటలు వేయాలని ఈ స్థానికులు కోరుతున్నారు. సిరిసిల్లపై చిన్నచూపు లేకుండా.. అభివృద్ధిలో ప్రజల ప్రాధాన్యతాంశాలను గుర్తించాలని కోరుతున్నారు.
● సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయినిచెరువును కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ నుంచి వచ్చే గోదావరి జలాలతో నింపాల్సిన నీటి పంపింగ్ పథకం మూలనపడింది. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌లో పనులు పూర్తికాలేదు. నీటి పంపింగ్ కోసం తెచ్చిన పైపులు రోడ్డు వెంబడి వేశారు. కానీ మద్దిమల్ల చెరువును నింపే పనులు సాగడం లేదు. ఇది పూర్తయితే వీర్నపల్లి మండలంలోని గిరిజన గ్రామాల్లోని పంట పొలాలకు శాశ్వతంగా సాగునీటి వసతి ఏర్పడుతుందది. ఇప్పటికే మంజూరైన ఈ పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. ఫలితంగా మద్దిమల్ల చెరువుకు నీరు చేరడం లేదు.
ఇది సిరిసిల్ల మానేరువాగుతీరంలో విద్యానగర్ నుంచి సాయినగర్ వరకు కొత్తగా డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదిత ప్రాంతం. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో వంద అడుగుల విస్తరణతో రోడ్డు.. డివైడర్లతో, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌తో వాకింగ్ ట్రాక్‌తో నిర్మించాల్సి ఉంది. విద్యానగర్ నుంచి సాయినగర్ వరకు మానేరువాగు వెంబడి మూడు కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మాణం రెండేళ్ల కిందటే ఫార్మేషన్ పూర్తయింది. వాగు వెంట ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్డు వేశారు. అయితే ఇంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. రూ.22కోట్ల పనులకు గ్రహణం పట్టింది. ఎన్నికలు పూర్తయి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరి
15 నెలలు గడుస్తున్నా ఈ పనుల ఊసే లేదు.
● ముస్తాబాద్ మండల కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం సింగిల్‌రోడ్డు ఉండగా.. ఆ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులు జరగడం లేదు. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని మోహినికుంట వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు సింగిల్ రోడ్డు, మలుపులు ఉండడంతో ప్రమాదాలకు నిలయంగా ఉంది. ఈ అంతర్ జిల్లా రోడ్డుకు విస్తరించే పనులు చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలోనే ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా నిధులు మంజూరైనా పనులు చేయకపోవడంతో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డుకు మోక్షం లభించడం లేదు. మరోవైపు దుబ్బాక పరిధిలోని సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా సిద్దిపేట జిల్లా అధికారులు మార్చారు. కానీ జిల్లా పరిధిలోని రోడ్డుకు గ్రహణం పట్టింది.
● గంభీరావుపేట మండల కేంద్రం నుంచి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేశారు. రోడ్డు పనులకు మంత్రి హోదాలో కేటీఆర్ అప్పట్లో శంకుస్థాపన చేశారు. కానీ పనులు మొదలు కాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. గంభీరావుపేట నుంచి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తే.. వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోడ్డు కోసం కొత్తపల్లి గ్రామస్తులు దీక్షలు చేశారు. ఆందోళన చేశారు. కానీ పాలకుల నిర్లక్ష్యంతో కొత్తపల్లి రోడ్డుకు అడుగులు పడడం లేదు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, సిరిసిల్ల పట్టణంలోనూ అనేక పనులు మంజూరై.. నిధులు విడుదల లేక పనులు సాగడం లేదు.

మంత్రివర్యా ఆలకించండి..

మంత్రివర్యా ఆలకించండి..

మంత్రివర్యా ఆలకించండి..

మంత్రివర్యా ఆలకించండి..

మంత్రివర్యా ఆలకించండి..