haribhusan
-
లొంగుబాటలో అన్నలు
సాక్షి, హైదరాబాద్: తుపాకీ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం సాధ్యం కాదని మావోయిస్టులు గ్రహించారని, దీంతో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆజాద్, రాజిరెడ్డిలాంటి అగ్రనేతలు సైతం జన జీవన స్రవంతిలో కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన మావోయిస్టు కీలక నేత హరిభూషణ్ సతీమణి సమ్మక్క అలియాస్ శారద పోలీసులకు లొంగిపోయారు. శుక్రవారం ఆమెకు రూ.5 లక్షల చెక్కును డీజీపీ అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అనారోగ్యం, కోవిడ్ సహా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టడంతో లొంగుబాటుకు మావో యిస్టుల నుంచి పెద్ద ఎత్తున సంకేతాలు వస్తున్నాయని వివరించారు. మహబూబ్‌బాద్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన సమ్మక్క మైనర్‌గా ఉన్నప్పుడే హరిభూషణ్ ప్రోద్బలంతో పార్టీలో చేరింది. ఆ తర్వాత అతన్నే వివాహం చేసుకుంది. పార్టీ సిద్ధాంతాలతో విభేదించి 2008లో లొంగిపోయింది. అయితే, మరో పెళ్లి చేసుకుంటా నని హరిభూషణ్ బెదిరించడంతో 2011లో మళ్లీ పార్టీలోకి వెళ్ళింది. హరిభూషణ్ ఇటీవల చనిపోవడంతో తిరిగి లొంగిపోయింది. రాజు మృతిపై సందేహాలకు తావులేదు బాలికపై హత్యాచారానికి పాల్పడిన రాజు మృతిపై సందేహాలకు ఏమాత్రం తావు లేదని డీజీపీ స్పష్టం చేశారు. ‘మత్తుమం దుల వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’అని తెలిపారు. -
డీజీపీ ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు నేత శారదక్క
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ నేత హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ భార్య శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శారదక్క డీజీపి ఎదుట లొంగిపోనున్నారు. శారదక్క లొంగుబాటుపై డీజీపీ మహేందర్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. (చదవండి: చిన్నచూపు చూపడంతో.. వనం నుంచి జనంలోకి..) గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారదక్క.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం బెజ్జరి. ఇటీవల శాదరక్క భర్త హరిభూషణ్ కరోనాతో మృతిచెందిన సంగతి తెలిసిందే. నాటి నుంచి శారదక్క మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దానికి తోడు కరోనా పాజిటివ్ రావడం తో కొంతకాలంగా అస్వస్థతకు గురై చికిత్స పొందారు. కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యం కారణంగా లొంగుబాటు కు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
Maoist Party: హరిభూషణ్ స్థానంలో ఎవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ స్థానంలో ఆ పార్టీ ఎవరిని నియమిస్తుందనే విషయం చర్చనీయాంశమైంది. విప్లవోద్యమంలో తుదకంటూ పోరాడిన హరిభూషణ్ ఈనెల 21న కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఆ పార్టీ కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో కేంద్ర కమిటీ నాయకుడు కత్తి మోహన్‌రావు అలియాస్ ప్రకాశ్ గుండెపోటుతో మరణించగా, హరిభూషణ్, మహిళా నాయకురాళ్లు సమ్మక్క అలియాస్ భారతక్క, శారద కరోనాకు బలయ్యారు. హరిభూషణ్ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది పోలీసు ఇంటెలిజెన్స్, మాజీ మావోయిస్టు వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెరపైకి లోకేటి చందర్ పేరు హరిభూషణ్ స్థానంలో రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామిని నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా స్వామి చాలాకాలం పనిచేయగా, ఆయన సహచరి లోకేటి లక్ష్మి అలియాస్ సులోచన కూడా ఉద్యమంవైపే నడిచింది. మైదాన ప్రాంతాల నుంచి దళాలను ఎత్తివేసే సమయంలో దండకారణ్యానికి తరలివెళ్లినా.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ (కేఏఎన్) కమిటీకి కూడా స్వామి సారథ్యం వహించా డు. మూడు దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేస్తున్న స్వామి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కీలక బాధ్యతల్లో ఉండగా, ఉద్యమ అవసరాల రీత్యా ఆయనకు అవకాశం కల్పించవచ్చంటున్నారు. 1991 నుంచి పార్టీలో కీలకంగా ఉన్న కొంకటి వెంకట్ అలియాస్ రమేష్ పేరు కూడా ప్రచారంలో ఉంది. కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడిగా, ఆనుపురం కొంరయ్య అలియాస్ సుధాకర్ (ఏకే) ఎన్కౌంటర్ తర్వాత జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన ఆయన అప్పటి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో కీలకంగా ఉన్న రమేష్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాశ్ పేర్లు కూడా రాష్ట్ర కార్యదర్శి కోసం పరిశీలించవచ్చంటున్నారు. కరోనా భయంతో మావోయిస్టు దంపతుల లొంగుబాటు కొత్తగూడెం టౌన్: మావోయిస్టు పార్టీ మణుగూరు ఓఎల్ఎస్ సభ్యులుగా పనిచేస్తున్న ఇడుమ సురేందర్, సోనీ దంపతులు శనివారం భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ ఎదుట లొంగిపోయారు. శనివారం కొత్తగూడెంలో ఎస్పీ సునీల్‌దత్ విలేకరుల సమావేశంలో ఈమేరకు వెల్లడించారు. అగ్ర నాయకత్వం వేధింపులకు పాల్పడటం, పార్టీలోని నాయకులకు, కార్యకర్తలకు కరోనా సోకుతుండడంతో భయాందోళనకు గురై వీరు బయటకు వచ్చినట్లు తెలిపారు. మడివి ఇడుమ అలియాస్ సురేందర్, మడకం బుద్రి అలియాస్ సోని ఐదేళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారని, వీరు రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజనల్ కార్యదర్శి ఆజాద్‌కు గార్డుగా పనిచేశారని చెప్పారు. మావోయిస్టులకు వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఎవరూ సహాయ సహకారాలు అందించవద్దని ఎస్పీ కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటామని, మెరుగైన వైద్య చికిత్సతోపాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఓఎస్డీ తిరుపతి, భద్రాచలం ఏఏస్పీ వినీత్, ప్రమోద్ పవార్, చర్ల సీఐ అశోక్ పాల్గొన్నారు. చదవండి: ముగిసిన 30 ఏళ్ల ప్రేమ ప్రయాణం -
మహబూబాబాద్: మావోయిస్టు హరిభూషణ్ ఇంట విషాదం..
-
మావోయిస్టు హరిభూషణ్ ఇంట విషాదం..
మహబూబాబాద్: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 24న మృతి చెందినట్లు తెలిసింది. హరిభూషణ్ చనిపోయిన నాలుగు రోజులకే ఆయన భార్య కూడా మరణించడంతో హరిభూషణ్, సమ్మక్క పుట్టిన ఊరు గంగారాంలలో విషాదం అలముకుంది. హరిభూషణ్ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద కొద్ది రోజుల క్రితమే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేసిన శారద.. ప్రస్తుతం డీసీఎంగా పని చేస్తోంది. కరోనాతో ఇప్పటికే పలువురు మావోయిస్టు ముఖ్యనేతలు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. తాజాగా హరిభూషణ్ భార్య శారద కూడా కరోనా బారిన పడి, తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కాగా స్వచ్ఛందంగా వస్తే వైద్య సహాయం అందజేస్తామని కరోనా బారిన పడిన మావోయిస్టుల జాబితాను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించిన విషయం విదితమే. ఇదేనా పార్టీ ఇచ్చిన గౌరవం? కొత్తగూడ: పార్టీ కోసం కుటుంబాన్ని లెక్క చేయకుండా పనిచేసిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మృతదేహాన్ని తమకు అప్పగించకుండా మావోయిస్టులు మోసం చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కనీసం చివరి చూపు దక్కకుండా చేయడంపై వారు మండిపడ్డారు. అనారోగ్య కారణాలతో హరిభూషణ్ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ బాధ్యులు గురువారం అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా శుక్రవారం హరిభూషణ్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తమ కొడుకు బతికున్న సమయంలో మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని పోలీసు దెబ్బలు, జైలు జీవితం అనుభవించిన తమకు పార్టీ ఇచ్చిన గుర్తింపు ఇదేనా అని అడిగారు. హరిభూషణ్ చితాభస్మం లేకుండా కర్మ కాండలు ఎలా నిర్వహించుకోవాలని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఏ గ్రామంలో మృతదేహాన్ని ఉంచినా తామే వెళ్లి తెచ్చుకుని అంత్యక్రియలు నిర్వహించుకునే వారమంటూ వారు బోరున విలపించారు. చదవండి: నక్సల్స్‌కు భారీ దెబ్బ: అనారోగ్యంతో హరిభూషణ్ మృతి -
హిడ్మాకూ కరోనా..
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు దళాల ను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా మరో అగ్రనేత మాడావి హిడ్మా కూడా కరో నా బారిన పడ్డాడన్న ప్రచారం కలకలం రేపుతోంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్–1కు కమాండర్‌గా ఉన్న హిడ్మా.. ఏప్రిల్ 3న బీజాపూర్‌లో 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా సైతం కొనసాగుతున్న హిడ్మా.. కొంతకాలంగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని, అడవిలోనే అతనికి చికిత్స సాగుతున్నట్టు తమకు సమాచారం ఉందని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంలో మావోయిస్టు పార్టీ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. మూడురోజుల ముందు ఉత్సాహంగానే హరిభూషణ్..! ప్రస్తుతం దండకారణ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ దాడి అనంతరం మావోయిస్టులు గిరిజనులతో వరుసగా నిర్వహించిన సభలు, సమావేశాల ద్వారా కరోనా వైరస్ ఆయా దళాల సభ్యులకు సోకింది. అగ్రనేతలంతా 50 ఏళ్లు పైబడి ఉండటం.., దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతుండటం, వీటికితోడు ప్రమాదకరమైన వైరస్ కావడంతో అప్పటిదాకా చలాకీగా ఉన్న వారు కూడా ఉన్నపళంగా మరణిస్తున్నారని సమాచారం. హరిభూషణ్ మరణానికి మూ డురోజులు ముందు షేవింగ్ కూడా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనికి కంటిచూపు సమస్యలు ఉన్నాయని, అందుకే ఇటీవల కొత్త కళ్లజోడు కూడా తెచ్చుకున్నాడని వివరించారు. సారక్క కూడా ఎక్కువ కాలం అనారోగ్యానికి గురవలేదని, వైరస్ సోకిన వారం రోజుల్లోపే మరణించిందని తెలుస్తోంది. సొంతవైద్యంతోనే చేటు.. వాస్తవానికి గతేడాది మొదటి వేవ్‌లో వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. అప్పుడు వైరస్ సోకినప్పటికీ... మాత్రలతో తగ్గిపోయింది. కానీ, ప్రస్తుతం వైరస్ తీవ్రత పెరిగింది. దీంతో కరోనా చికిత్స క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సొంతవైద్యమే మావోయిస్టుల కొంపముంచుతోంది. కేవలం యూట్యూబ్‌లు, ఆన్లైన్లో చదివి ఏవో మాత్రలు తెప్పించుకుని వాటినే వాడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, డయాలసిస్, ఆక్సిమీటర్లు, వెంటిలేటర్ల వంటి సదుపాయాలు అడవిలో లభించవు. కేవలం మూడువారాల్లో మధుకర్, కత్తిమోహన్, హరిభూషణ్, సారక్క అకాలమరణం చెందారు. లొంగిపోతే చికిత్స చేయిస్తామని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెపుతున్నా.. పార్టీకి మనుగడ ఉండదన్న ఆందోళనతో ముఖ్యనేతలెవరూ ముందుకు రావడం లేదు. -
హరిభూషణ్ మృతి వాస్తవమే!
సాక్షి, మహబూబాబాద్/గంగారం/ కొత్తగూడెం టౌన్/ చర్ల: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ (50) కరోనాతో బాధపడుతూ, గుండెపోటుకు గురై మృతి చెందారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. కొంతకాలంగా పెద్ద సంఖ్యలో మావోయిస్టు నేతలు, మిలీషియా సభ్యులు కరోనా బారినపడి, సరైన వైద్యం అందక చనిపోతున్నారని.. హరిభూషణ్ కూడా ఈ నెల 21న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మరణించినట్టు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని వివరించారు. బుధవారం కొత్తగూడెంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారు. కాగా.. హరిభూషణ్ చనిపోయాడని భద్రాద్రి ఎస్పీ ప్రకటించినా.. కిందిస్థాయి పోలీసు సిబ్బంది మాత్రం ‘ఆయన చనిపోయాడా, మీకేమైనా సమాచారం తెలిసిందా?’అంటూ ఆరా తీశారు. ఆయన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెంలోని ఇంటికి ఒక హోంగార్డు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారని.. హరిభూషణ్ తమ్ముడిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించారని తెలిసింది. ఇక హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్‌లోని మీనగుట్ట ప్రాంతంలో మృతి చెందాడన్న ప్రచారం నేపథ్యంలో చర్లకు చెందిన మీడియా బృందం బుధవారం అక్కడికి వెళ్లి ఆరా తీసింది. అయితే ఆ ప్రాంతంలో అలాంటి ఘటన ఏమీ జరగలేదని, హరిభూషణ్ మృతి చెందాడనే సమాచారం ఏదీ లేదని అక్కడి గ్రామాలకు చెందిన ఆదివాసీలు వెల్లడించారు. చివరి చూపు దక్కేలా చూడండి తన సోదరుడు ఏ కారణంతో అయినా మరణించి ఉంటే మృతదేహాన్ని తమకు అప్పగించాలని హరిభూషణ్ సోదరుడు యాప అశోక్ కోరారు. తన సోదరుడిని చిన్నతనంలోనే చూశానని, ఇప్పుడు చివరి చూపు అయినా దక్కే అవకాశం కల్పించాలన్నారు. -
నక్సల్స్‌కు భారీ దెబ్బ: అనారోగ్యంతో హరిభూషణ్ మృతి
1995లో దళంలోకి... మహబూబాబాద్ జిల్లా గంగారం మండ లం మరిగూడానికి చెందిన యాప నారాయణ 1995లో పీపుల్స్ వార్‌లో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయికి చేరాడు. కేడర్ నిర్మాణం కోసం... 2019 చివరి నుంచి మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. తెలంగాణలో కేడర్ నిర్మాణం కోసం రిక్రూట్మెంట్ చేపట్టడమే గాక, పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడు. నలుగురు కీలక నేతలు.. అనారోగ్యంతో జూన్ 6న డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, జూన్ 10న కత్తి మోహన్.. 16న విశాఖ ఎన్కౌంటర్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన సందె గంగయ్యలను పార్టీ కోల్పోయింది. తాజాగా హరిభూషణ్ మరణం. సాక్షి, హైదరాబాద్/మహబూబాబాద్/ గంగారం/కొత్తగూడ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ లక్మూ అలియాస్ హెచ్చీ సోమవారం మరణించారు. ఇటీవల అనారోగ్యంతో మావో అగ్రనేత కత్తి మోహన్ అలియాస్ ప్రకాశ్ మరణం మరువకముందే.. మరో కీలకనేత మృతి చెందడం దండకారణ్యంలో కలకలం రేపుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలోని మీనాగుట్ట ప్రాంతంలో మరణించాడన్న వార్త మంగళవారం ఛత్తీస్‌గఢ్- తెలంగాణలో దావానంలా వ్యాపించింది. ఆయన అంత్యక్రియలను తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో నిర్వహించారని తెలిసింది. హరిభూషణ్ కరోనాతో లేదా ఫుడ్ పాయిజనింగ్తో మరణించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయాలను తొలుత బస్తర్ పోలీసులు ధ్రువీకరించలేదు. సాయంత్రానికి ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు హరిభూషణ్ మరణవార్తను నిర్ధారించారు. 2018లో ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుని.. హరిభూషణ్ దళంలో పని చేస్తున్న సమయంలోనే మేనమామ కూతురు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదను వివాహం చేసుకున్నాడు. ఈమె ప్రస్తుతం శబరి–చర్ల ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉంది. అనేక ఎన్కౌంటర్లలో త్రుటిలో తప్పించుకున్న హరిభూషణ్ చాలాసార్లు మరణించాడని ప్రచారం జరిగింది. 2018, మార్చిలో బీజాపూర్ జిల్లా పూజారి కంకెర అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఆసమయంలో హరిభూషణ్ దంపతులు సురక్షితంగా తప్పించుకున్నారు. అయితే అప్పుడు అతడు మరణించాడంటూ వార్తలొచ్చాయి. పలు కార్యకలాపాలకు మూలం ఇతనే.. గణపతి తరువాత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నంబాల కేశవరావు స్వీకరించినప్పటి నుంచి పార్టీలో హరిభూషణ్‌కు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణలో కేడర్ నిర్మించుకోవాలన్న కేశవరావు ఆదేశాలతో 2019 చివరి నుంచి కార్యక లాపాలు ముమ్మరం చేశాడు. రిక్రూట్మెంట్లకు, పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడు. గతేడాది లాక్డౌన్ సమయంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో కలసి ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్-భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను పోలీసులు తిప్పికొట్టారు. వరుసగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 10 మంది మావోలు మరణించారు. దీంతో హరిభూషణ్ అతని అనుచరులు వెనకడుగు వేశారు. పోలీసుల గాలింపు తీవ్రతరం కావడం, లాక్డౌన్ ఎత్తివేయడంతో హరిభూషణ్ అతని అనుచరులు తిరిగి దండకారణ్యానికి వెళ్లారు. గతే డాది చివర్లో కూడా ప్రాణహిత నది మీదుగా మహా రాష్ట్ర నుంచి పలుమార్లు హరిభూషణ్ తెలంగాణ లోకి ప్రవేశించాడని నిఘా వర్గాలు స్థానిక పోలీసులను హెచ్చరించాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టినా హరిభూషణ్ ఆచూకీ మాత్రం చిక్కలేదు. 3 వారాల్లో నలుగురు నేతలు.. మావోయిస్టుల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర అలజడి సృష్టిస్తోంది. 3 వారాల్లోనే నలుగురు కీలక నేతలను కోల్పోయింది. ఈసారి వచ్చిన స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉండటం.. మావోయిస్టు అగ్రనేతలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండటంతో అగ్రనేతలు మరణాల బారిన పడుతున్నారని బస్తర్ పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏప్రిల్‌లో బీజాపూర్‌లో పోలీసులపై మావో అగ్రనేత హిడ్మా నేతృత్వంలో జరిగిన ఊచకోతకు ప్రతీకారం కోసం సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు ఎదురుచూస్తున్నా యి. దండకారణ్యంలో మావోలకు పట్టున్న ప్రాం తాలను డ్రోన్ల ద్వారా తెలుసుకుంటున్నారు. మావోలను అష్టదిగ్బంధనం చేశారని అందుకే వారు బయటికి రాలేక, చికిత్స అందక మరణిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే, లొంగిపోతే తాము చికిత్స అందిస్తామని తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించినా.. అందుకు మావోలు సిద్ధంగా లేరు. పీపుల్స్ వార్‌లోకి ఇలా.. యాప పాపమ్మ, రంగయ్య దంపతుల ఏడుగురు సంతానంలో నారాయణ పెద్ద కుమారుడు. నర్సంపేటలో డిగ్రీ చదివిన ఆయన 1985 - 90 మధ్యకాలంలో ఎల్ఐసీ ఏజెంట్‌గా, ఐటీడీఏ మైనర్ ఇరిగేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. అయితే అప్పుడు కొత్తగూడ, ఇల్లందు, గుండాల ఏజెన్సీ ప్రాంతాల్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అప్పటి నుంచే నారాయణ పీపుల్స్‌వార్ అనుబంధంగా పనిచేస్తూ మిత్రుడు రాజకోటితో కలసి న్యూడెమోక్రసీ పార్టీ విధానాలు, వారికి వ్యతిరేకంగా గ్రామాల్లో పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని హత్య చేసేందుకు న్యూడెమోక్రసీ నేతలు వ్యూహం పన్నారు. 1991, మే 31న గ్రామంలో జరిగే వివాహానికి నారాయణ, రాజకోటి వస్తారని కాపుకాసిన ఎన్డీ నేతలకు రాజకోటి దొరకగా.. నారాయణ అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పీపుల్స్‌వార్ దళంలోకి వెళ్లాడు. పీపుల్వార్లో చేరిన హరిభూషణ్ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. దళసభ్యుడిగా, మిలిటరీ ప్లాటూన్ శిక్షణ కమాండర్‌గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర కార్యదర్శి, తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా ఎదిగారు. హరిభూషణ్‌పై ప్రభుత్వం రూ.20లక్షల రివార్డు ప్రకటించింది. ఎలాంటి సమాచారం లేదు హరిభూషణ్ మృతి చెందాడనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఆయన స్వగ్రామం మడగూడెం విషాదఛాయలు అలముకొన్నాయి. అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వారంతా మంగళవారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండటం కనిపించింది. గతంలోనూ హరిభూషణ్ చనిపోయాడని వార్తలు వచ్చాయని.. దీంతో తమ తండ్రి రంగయ్య మనోవేదనకు గురై మంచాన పడ్డారని హరిభూషణ్ సోదరులు అశోక్, రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కోలుకుంటున్న తమ తండ్రికి మళ్లీ హరిభూషణ్ మరణించాడని వార్తలు చేరడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని హరిభూషన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
మూడు రాష్ట్రాల సరిహద్దులోనే... హరిభూషణ్?
సాక్షి , వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో యాక్షన్ టీంలు మళ్లీ రంగంలోకి దిగాయా? వరుస నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలే లక్ష్యంగా దాడులకు దిగనున్నారా? తెలంగాణలో పునర్వైభవం కోసం ఓవైపు మళ్లీ ప్రజాకోర్టులు, దాడులు, మరోవైపు ‘రిక్రూట్మెంట్’పై దృష్టి సారించారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో 2019 డిసెంబర్లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తెలంగాణ, ఆంధ్రా – ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యనేతలతో కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ప్లీనరీకి సంబంధించిన కీలకపత్రాలు నిఘావర్గాల చేతికి చిక్కాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ దళాలు దండకారణ్యం మూడు రాష్ట్రాల (తెలంగాణ– మహారాష్ట్ర– ఛత్తీస్‌గఢ్) సరిహద్దు, గోదావరి, ప్రాణహిత మధ్య మకాం వేసినట్లు సమాచారం. రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్షన్‌టీంలు రంగంలోకి దిగినట్లు గుర్తించిన పోలీసులు మూడు నెలలుగా సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా, అక్టోబర్ 10న రాత్రి ములుగు జిల్లా బోధాపూర్‌లో టీఆర్ఎస్ నాయకుడు భీమేశ్వర్‌రావును మావోలు హతమార్చడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత పోలీసుల కూంబింగ్, వరుస ఎన్కౌంటర్లలో ఐదుగురు వరకు మావోయిస్టులు మృతి చెందగా, రెండు రోజుల కిందట ప్రజాకోర్టులో ఇద్దరిని ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు కాల్చి చంపడంతో మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కమిటీల పునర్వ్యవస్థీకరణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మూడు రాష్ట్ర కమిటీలు ఉండేవి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ (ఎన్టీఎస్జెడ్సీ), ఆంధ్ర రాష్ట్ర కమిటీ, ఉత్తరాంధ్ర, ఒడిశాకు కలిపి ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ) కమిటీలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత ఎన్టీఎస్జెడ్సీని తెలంగాణ రాష్ట్ర కమిటీ(టీఎస్సీ)గా మార్చారు. ఆంధ్ర రాష్ట్ర కమిటీ కనుమరుగు కాగా... ఏఓబీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ జిల్లాలకు కలిపి (కేకేడబ్ల్యూ) డివిజినల్ కమిటీ ఉండేది. అయితే తెలంగాణ ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో మావోయిస్టు పార్టీ కూడా తమ రాష్ట్ర కమిటీని పునర్వ్యవస్థీకరించింది. కేకేడబ్ల్యూను ఎత్తివేసి దాని స్థానంలో కొత్తగా మూడు డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ లక్మ అలియాస్ హరిభూషణ్ నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌ను నియమించారు. ఇటీవల కార్యకలాపాల విస్తరణలో భాగంగా తెలంగాణలో రంగంలోకి దిగిన యాక్షన్ టీంలకు తెలంగాణ నాయకులు నాయకత్వం వహిస్తుండగా, దాడులకు మాత్రం ఛత్తీస్‌గఢ్ కేడర్‌నే వాడుతున్నారు. గత నెలలో ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నేత హత్య ఘటనకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముసాకి ఉంజల్ అలియాస్ సుధాకర్ నాయకత్వం వహించడమే ఇందుకు ఉదాహరణ. కాగా దండకారణ్యంలో పోలీసుల గాలింపు, నిఘా ముమ్మరం కావడంతో మూడు రాష్ట్రాల సరిహద్దులోని ఉత్తర తెలంగాణ జిల్లాలను సేఫ్ జోన్‌గా ఎంచుకున్న మావోయిస్టులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తిరిగి కార్యకలాపాలను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు జిల్లాలకో డివిజన్ కమిటీ పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని కొత్త కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. పెద్దపల్లి – కరీంనగర్ – భూపాలపల్లి జయశంకర్ – వరంగల్ జిల్లాలు కలిపి ఓ డివిజన్ కమిటీ కాగా, దీనికి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ కింద ఏటూరునాగారం – మహదేవ్పూర్ ఏరియా కమిటీ, ఇల్లెందు – నర్సంపేట ఏరియా కమిటీలు వేయగా, వీటికి సుధాకర్, కూసం మంగు అలియాస్ లచ్చన్నలను కార్యదర్శులుగా నియమించారు. మంచిర్యాల – కొమురంభీం(ఎంకేబీ) డివిజినల్ కమిటీ నాయకత్వాన్ని ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌కు అప్పగించారు. అంతేకాకుండా ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్ – సిర్పూర్ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు సమాచారం. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి డివిజినల్ కమిటీ కొత్తగా ఏర్పడగా, ఈ కమిటీకి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ కింద చర్ల – శబరి ఏరియా కమిటీ, లోకే సుజాత నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, కుంజా లక్షణ్ అలియాస్ లచ్చన్న నేతృత్వంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ఏర్పాటు చేశారు. చర్ల – శబరి ఏరియా కమిటీకి మడకం కోసీ అలియాస్ రజిత నాయకత్వం వహిస్తున్నారు. ఇక చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్, ఉబ్బ మోహన్ అలియాస్ సునీల్ నేతృత్వంలో శబరి లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్లు, ముసాకి ఉంజల్ అలియాస్ సుధాకర్ నాయకత్వంలో వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీలు పని చేస్తున్నాయి. మొత్తంగా ఈ కమిటీలకు సారథ్యం వహిస్తున్న బడే దామోదర్, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ కోసం ప్రస్తుతం పోలీసుల వేట సాగుతోంది. -
వర్సిటీలపై మావోల గురి
సాక్షి, హైదరాబాద్ : రోజురోజుకూ బలహీనమవుతున్న మావోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందా? అందులో భాగంగా విద్యార్థులను ఆకర్షించడంపై దృష్టి సారించిందా? రాష్ట్ర యూనివర్సిటీల్లోని విద్యార్థులను మావోయిస్టు పార్టీలో చేర్చే బాధ్యతను తెలంగాణ కమిటీ తీసుకుందా..? ఈ ప్రశ్నలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కేడర్‌ను పెంచుకోవడం, సాంకేతికంగా బలపడటం కోసం యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులే టార్గెట్‌గా వ్యూహాలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులను చేర్చుకోవడంపై మావోయిస్టు పార్టీ దృష్టి పెట్టిందన్న విషయం కలవరపెడుతోందని పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 13 ఏళ్ల తర్వాత వర్సిటీల్లో.. మావోయిస్టు పార్టీ భావజాలంతో పనిచేస్తున్న పలు సంఘాలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 13 ఏళ్ల క్రితం నిషేధిత జాబితాలో చేర్చింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్, సింగరేణి కార్మిక సంఘం, ఆలిండియా రెవల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్, రైతు కూలీ సంఘం, విప్లవ కార్మిక సంఘం, రెవల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ వంటివి మావోయిస్టు కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహించాయని పేర్కొంటూ ఈ నిషేధం విధించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఈ సంఘాలపై నిషేధం కొనసాగుతోంది. అయితే రాష్టం ఏర్పాటైన మరుసటి ఏడాది 2015లో కొంత మంది యూనివర్సిటీల విద్యార్థులు మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. దీంతో మావోయిస్టులు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్కు ప్రయత్నించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. దాంతో కొందరు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చాయి. అయినా కాకతీయ, ఉస్మానియా వర్సిటీలకు చెందిన సుమారు 24 మంది విద్యార్థులు మావోయిస్టు పార్టీలో చేరినట్టు ఎస్ఐబీ (స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో) వర్గాలు స్పష్టం చేశాయి. అలా వెళ్లిన వారిలో సూర్యాపేటకు చెందిన వివేక్, వరంగల్‌కు చెందిన శృతి ఇద్దరూ ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. ఇప్పుడు హెచ్‌సీయూపై దృష్టి! రాష్ట్రంలో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి రిక్రూట్మెంట్ విషయంలో మావోయిస్టు పార్టీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దాంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కీలక విద్యార్థి నేతలను తాజాగా టార్గెట్ చేసుకుంది. ఇప్పటికే మావోయిస్టు భావజాలం ఉన్న కొందరు విద్యార్థులను రిక్రూట్ చేసుకునే దిశగా మానసికంగా సిద్ధం చేసినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇదే సమయంలో హెచ్సీయూకు చెందిన ఇద్దరు విద్యార్థులు కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీరాజ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన చందన్ మిశ్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగా హెచ్‌సీయూ వీసీని చంపేందుకు కుట్ర పన్నినట్టు ఆరోపిస్తూ పోలీసులు వారిని అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది. మిశ్రాతో దేశవ్యాప్తంగా..! బెంగాల్‌కు చెందిన చందన్ మిశ్రా వ్యవహారంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మిశ్రా ఓ కొరియర్ ద్వారా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ను ఈ ఏడాది జనవరిలో కలిశారని.. మావోయిస్టు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపాడని వెల్లడవడం నిఘా వర్గాలను కలవరపెడుతోంది. మావోయిస్టు పార్టీకి కంచుకోటగా పేరున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన చందన్ మిశ్రా.. పంజాబ్‌లోని తన స్నేహితుడు, వ్యవసాయ సంఘం నేత అమూల్సింగ్ను సైతం కలసి మావోయిస్టు పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలియడం సంచలనంగా మారింది. హరిభూషణ్‌ను కలసిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు చెందిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ విద్యార్థులను మావోయిస్టు పార్టీ కోసం పనిచేసేలా కృషి చేసేందుకు మిశ్రా ఆసక్తి చూపారని వెల్లడికావడం చర్చనీయాంశంగా మారింది. హెచ్‌సీయూ వీసీని హతమార్చిన తర్వాత మిశ్రాకు మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవి ఇస్తానని హరిభూషణ్ చెప్పినట్టు తెలిసింది. దాంతో మిశ్రా దేశవ్యాప్తంగా తనకున్న పరిచయాలతో, మావోయిస్టు భావజాలంతో ఉన్న విద్యార్థులను, విద్యార్థి నేతలను ఏకం చేసేందుకు కార్యచరణ రూపొందించుకున్నట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తంగా గతంలోలా వర్సిటీల్లో రాడికల్ విద్యార్థి విభాగాలను ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పేరుతో నడిపించేందుకు హరిభూషణ్ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల యూనివర్సిటీల్లో పట్టుతోపాటు కేడర్పరంగా అర్బన్ ప్రాంతాల్లో గ్రీన్ కారిడార్ కమిటీలను సృష్టించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు నిఘా విభాగాలు అనుమానిస్తున్నాయి. అరెస్టులు కుట్రపూరితమంటున్న విరసం వీసీ హత్యకు కుట్రపన్నారంటూ పృథ్వీరాజ్, చందన్‌మిశ్రాలను పోలీసులు చేసినా.. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే అంశాలేవీ వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విప్లవ రచయితల సంఘం (విరసం) సైతం పోలీసుల ఆరోపణలను ఖండిస్తోంది. పృథ్వీరాజ్, చందన్‌మిశ్రాలను నాలుగు రోజుల క్రితం విజయవాడలో అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని... వీసీ హత్య కుట్ర పేరిట విశ్వవిద్యాలయాల్లో మరింత నిర్బంధ వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని పేర్కొంటోంది. హెచ్‌సీయూ వీసీ అప్పారావుకు భద్రత పెంపు మావోయిస్టులు హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావు హత్యకు కుట్రపన్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. రోహిత్ వేముల ఘటన అనంతరమే రాష్ట్రం ప్రభుత్వం ఆయనకు ఇద్దరు గన్మన్లను కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్‌సీయూలో వీసీ కార్యాలయం, అధికారిక నివాసాల వద్ద ప్రైవేటు సెక్యూరిటీని పెంచారు. గుర్తు తెలియని వ్యక్తులెవరూ లోనికి రాకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. -
'చనిపోయింది మావోయిస్టులు కాదు'
జి.మాడుగుల: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన వారిలో ఇద్దరూ ఆదివాసీలేనని మావోయిస్టులు కారని సీపీఐ మావోయిస్టు పెద్దబయలు ఏరియా కమిటీ కార్యదర్శి మంగన్న పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. కొత్తగూడ ఎన్కౌంటర్ బూటకమని మండిపడ్డారు. ప్రభుత్వం అమాయకులను ఎన్కౌంటర్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలివ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి దేహాలను భద్రపరిచే విషయంలో తీసుకుంటున్న చర్యలు, ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. మృతదేహాలను అన్ని సౌకర్యాలున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి, నిపుణుల చేత రీపోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫు న్యాయవాది వి.రఘునాథ్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అందుకు అంగీకరించి విచారణ చేపట్టింది. ఎన్కౌంటర్లో మృతి చెందిన 8 మంది మృతదేహాలను ప్రస్తుతం ఖమ్మం జిల్లా, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఉంచారని రఘునాథ్ తెలిపారు. వాటిని అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రిలో భద్రపరిచి, రీపోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావును ఆదేశించింది. -
భద్రాచలంలోనే మావోయిస్టుల మృతదేహాలు
♦ హైకోర్టు తీర్పు నేపథ్యంలో బంధువులకు ఇవ్వని పోలీసులు ♦ తీర్పునకు ముందే రావడంతో సారక్క, సోనీ భౌతికకాయాల అప్పగింత ♦ మృతుల్లో మిగతా ఐదుగురి గుర్తింపు ♦ తప్పించుకున్న మావోయిస్టుల కోసం సరిహద్దులను జల్లెడ పడుతున్న ఖాకీలు భద్రాచలం/చర్ల/కొత్తగూడ: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించి, పోస్టుమార్టం అనంతరం వాటిని అక్కడే మార్చురీలో భద్రపరిచారు. రీపోస్టుమార్టం నిర్వహించాలంటూ మానవ హక్కుల సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేయడంతో పోలీసులు మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా మార్చురీలోనే ఉంచారు. అయితే బుధవారం కోర్టు తీర్పునకు ముందే మృతుల బంధువులు కొందరు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. దీంతో వరంగల్ జిల్లా మడగూడేనికి చెందిన ధనసరి సారక్క (ఈమె తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మరదలు), మెదక్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన సోనీ(ఈమె గుంటూరు జిల్లాకు చెందిన గొట్టిముక్కల రమేశ్ అలియాస్ లచ్చన్న భార్య) మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. మొత్తం 8 మంది గుర్తింపు చర్లకు సమీపంలోని బొట్టెంతోగు అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మరణించగా.. వారిలో మంగళవారం పోలీసులు ముగ్గురిని గుర్తించారు. బుధవారం మరో ఐదుగురిని గుర్తించారు. అయితే వారి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. గుర్తించిన వారి వివరాలివీ.. 1.గొట్టిముక్కల రమేష్ అలియాస్ లచ్చన్న(52) క్రోసూరు మండలం, గుంటూరు జిల్లా, 2.మడకం బండి(30), తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప, 3.ధనసరి సారక్క అలియాస్ అనిత(35) వరంగల్ జిల్లా మడగూడెం, 4.కొత్తకుడ సృజన(25) వరంగల్ జిల్లా పైడిపల్లి, 5.యూసుఫ్ బీ అలియాస్ సోనీ(38) మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం మాచినపల్లి, 6.రాజు(25) (ఛత్తీస్‌గఢ్), 7.రామి(ఛత్తీస్‌గఢ్), 8.మడివి దేవి(ఛత్తీస్‌గఢ్). సారక్కకు కన్నీటి వీడ్కోలు సారక్క ఏడాది క్రితమే దళంలో చేరింది. కొద్దిరోజులు కొత్తగూడ ఏరియా దళ కమాండర్ భద్రు దళంలో పనిచేసిన ఈమె తాజా ఎన్కౌంటర్లో చనిపోయింది. బుధవారం ఆమె స్వస్థలం మడగూడెంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. చివరి చూపు చూసేందుకు బంధువులు, అభిమానులు, నాయకుల పెద్దఎత్తున తరలివచ్చారు. కన్నీళ్లు పెట్టించిన కన్నపేగు.. మావోయిస్టు అమర వీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా శాంత ఎన్నో కుటుంబాల కన్నీళ్లు తుడిచింది. కానీ ఇప్పుడు పేగుబంధం ఆమెతో కన్నీరు పెట్టించింది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన సృజన(25) శాంత కూతురు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం చేరుకున్న ఆమె సృజన మృతదేహాన్ని చూడగానే కన్నీరుమున్నీరుగా విలపించింది. అసలు ప్లీనరీ ఎందుకోసం? మావోయిస్టు అగ్రనేతలు పాల్గొన్న ఈ ప్లీనరీని ఎందుకోసం నిర్వహించారన్నది ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌తోపాటు మూడు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఈ ప్లీనరీలో పాల్గొన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం ఉంది. మూడ్రోజులపాటు జరిగిన ఈ ప్లీనరీ మంగళవారంతో ముగియూల్సి ఉండగా.. గ్రేహౌండ్స్ బలగాలు మెరుపుదాడి చేసి 8 మందిని కాల్చివేశాయి. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగే తునికాకు సేకరణలో రేటు నిర్ణయం, ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో ఇసుక రీచ్‌ల వ్యవహారం, ఇటీవలి ఎన్కౌంటర్లు తదితర అంశాలను ఈ ప్లీనరీలో చర్చించినట్లు సమాచారం. కొనసాగుతున్న ఖాకీల వేట మంగళవారం నాటి ఎన్కౌంటర్ తర్వాత సుమారు 250 మందికి పైగా మావోయిస్టులు తప్పించుకుపోయారని అనుమానిస్తున్న పోలీసులు సరిహద్దు ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అటు తెలంగాణ.. అటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రత్యేక అదనపు బలగాలను రంగంలోకి దించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. -
అగ్రనేతలు అక్కడికి ఎందుకు వచ్చినట్టో?
మావోయిస్టు అగ్రనేతలు పాల్గొన్న ప్లీనరీ దేనికోసమనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌తో పాటు మూడు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఈ ప్లీనరీలో పాల్గొన్నారన్న పక్కా సమాచారం పోలీసులకు ఉంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్లీనరీ మంగళవారంనాటితో ముగియూల్సి ఉండగా, ఆఖరి రోజున గ్రేహౌండ్స్ బలగాలు మెరుపుదాడి చేశాయి. దీంతో ఎన్కౌంటర్లో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. తప్పించుకున్న అగ్రనేతల కోసం మూడు రాష్ట్రాల పోలీసు బలగాలుముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చాలాకాలం తర్వాత మావోయిస్టు పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసుకోవటం వెనుక గల బలమైన కారణాలమేటన్న దానిపై కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అక్కడి ప్రభుత్వం దూకుడుగా వెళ్తుండటం, త్వరలో మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగే తునికాకు సేకరణలో రేటు నిర్ణయం, ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల వ్యవహారం, ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో పార్టీకి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనే దానిపై ప్లీనరీ వేదికగా అగ్రనేతలు చర్చించినట్లుగా సమాచారం. వారోత్సవాల రోజుల్లో మినహా ఈ స్థాయిలో మావోయిస్టుల ప్లీనరీ గత కొన్నేళ్లుగా జరుగలేదని, కానీ, అనుకోని రీతిలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో... పరిణామాలు ఎలా ఉంటాయోననే దానిపై మూడు రాష్ట్రాల పరిధిలో చర్చ సాగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక రీచ్‌ల కాంట్రాక్టర్లకు ఇటీవలనే మావోయిస్టు నేత దామోదర్ పేరుతో కూడిన హెచ్చరిక లేఖ విడుదల కావడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కోవర్టు ఆపరేషన్‌తో మెరుపుదాడి పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొట్టెంతోగు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదివారం నుంచి మావోయిస్టుఅగ్రనేతలతో ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు ఆదివారం సాయంత్రం చర్ల నుంచి బయలుదేరి మంగళవారం ఉదయానికి మావోయిస్టుల శిబిరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే మావోయిస్టుల సమావేశంపై పోలీసులకు సమాచారమెలా అందిందనే దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఆదివారం చర్లలో జరిగిన వారపు సంతకు సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాలకు చెందిన పలువురు ఆదివాసీలు రాగా, అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఈ సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. మంగ ళవారంతో ప్లీనరీ ముగుస్తున్న తరుణంలో పక్కా వ్యూహంతో పోలీసు బలగాలు మెరుపుదాడి చేశారుు. అగ్రనేతలు ఎక్కడ ..? మూడంచెల భద్రతతో ఉన్న మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్ నుంచి సునాయాసంగా తప్పించుకున్నప్పటికీ, వారు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారనే దానిపై మూడు రాష్ట్రాల పోలీసులు ఆరా తీస్తున్నారు. జరిగిన నష్టానికి మావోరుుస్టులు ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో మూడు రాష్ట్రాల సరిహద్దులోని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఎన్కౌంటర్ జరిగిన రోజున పోలీసు బలగాలు వెనుదిరిగి వచ్చిన కొన్ని గంటలకు... అదే ప్రదేశానికి మావోయిస్టులు తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్ ప్రదేశంలో కొన్ని తూటాలను సేకరించికి వెళ్లారని, కోవర్టు ఆపరేషన్ జరిగిందా..? అనే కోణంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపే క్రమంలోనే అగ్రనేతల సూచనల మేరకే వారు మళ్లీ అక్కడికి వచ్చారనే ప్రచారం సాగుతోంది. దీంతో మావోయిస్టుల నుంచి త్వరలోనే ప్రతీకార చర్యలు ఉంటాయని, గతంలో భారీ ఎన్కౌంటర్లు జరిగిన తరువాత జరిగిన మావోల దాడులను ఈ ప్రాంతవాసులు గుర్తు చేస్తున్నారు.