సాక్షి, మహబూబాబాద్/గంగారం/ కొత్తగూడెం టౌన్/ చర్ల: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ (50) కరోనాతో బాధపడుతూ, గుండెపోటుకు గురై మృతి చెందారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. కొంతకాలంగా పెద్ద సంఖ్యలో మావోయిస్టు నేతలు, మిలీషియా సభ్యులు కరోనా బారినపడి, సరైన వైద్యం అందక చనిపోతున్నారని.. హరిభూషణ్ కూడా ఈ నెల 21న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మరణించినట్టు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని వివరించారు. బుధవారం కొత్తగూడెంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారు.
కాగా.. హరిభూషణ్ చనిపోయాడని భద్రాద్రి ఎస్పీ ప్రకటించినా.. కిందిస్థాయి పోలీసు సిబ్బంది మాత్రం ‘ఆయన చనిపోయాడా, మీకేమైనా సమాచారం తెలిసిందా?’అంటూ ఆరా తీశారు. ఆయన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెంలోని ఇంటికి ఒక హోంగార్డు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారని.. హరిభూషణ్ తమ్ముడిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించారని తెలిసింది. ఇక హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్‌లోని మీనగుట్ట ప్రాంతంలో మృతి చెందాడన్న ప్రచారం నేపథ్యంలో చర్లకు చెందిన మీడియా బృందం బుధవారం అక్కడికి వెళ్లి ఆరా తీసింది. అయితే ఆ ప్రాంతంలో అలాంటి ఘటన ఏమీ జరగలేదని, హరిభూషణ్ మృతి చెందాడనే సమాచారం ఏదీ లేదని అక్కడి గ్రామాలకు చెందిన ఆదివాసీలు వెల్లడించారు.
చివరి చూపు దక్కేలా చూడండి
తన సోదరుడు ఏ కారణంతో అయినా మరణించి ఉంటే మృతదేహాన్ని తమకు అప్పగించాలని హరిభూషణ్ సోదరుడు యాప అశోక్ కోరారు. తన సోదరుడిని చిన్నతనంలోనే చూశానని, ఇప్పుడు చివరి చూపు అయినా దక్కే అవకాశం కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment