సాక్షి, హైదరాబాద్ : రోజురోజుకూ బలహీనమవుతున్న మావోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందా? అందులో భాగంగా విద్యార్థులను ఆకర్షించడంపై దృష్టి సారించిందా? రాష్ట్ర యూనివర్సిటీల్లోని విద్యార్థులను మావోయిస్టు పార్టీలో చేర్చే బాధ్యతను తెలంగాణ కమిటీ తీసుకుందా..? ఈ ప్రశ్నలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కేడర్‌ను పెంచుకోవడం, సాంకేతికంగా బలపడటం కోసం యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులే టార్గెట్‌గా వ్యూహాలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులను చేర్చుకోవడంపై మావోయిస్టు పార్టీ దృష్టి పెట్టిందన్న విషయం కలవరపెడుతోందని పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
13 ఏళ్ల తర్వాత వర్సిటీల్లో..
మావోయిస్టు పార్టీ భావజాలంతో పనిచేస్తున్న పలు సంఘాలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 13 ఏళ్ల క్రితం నిషేధిత జాబితాలో చేర్చింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్, సింగరేణి కార్మిక సంఘం, ఆలిండియా రెవల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్, రైతు కూలీ సంఘం, విప్లవ కార్మిక సంఘం, రెవల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ వంటివి మావోయిస్టు కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహించాయని పేర్కొంటూ ఈ నిషేధం విధించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఈ సంఘాలపై నిషేధం కొనసాగుతోంది.
అయితే రాష్టం ఏర్పాటైన మరుసటి ఏడాది 2015లో కొంత మంది యూనివర్సిటీల విద్యార్థులు మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. దీంతో మావోయిస్టులు భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌కు ప్రయత్నించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. దాంతో కొందరు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చాయి. అయినా కాకతీయ, ఉస్మానియా వర్సిటీలకు చెందిన సుమారు 24 మంది విద్యార్థులు మావోయిస్టు పార్టీలో చేరినట్టు ఎస్‌ఐబీ (స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో) వర్గాలు స్పష్టం చేశాయి. అలా వెళ్లిన వారిలో సూర్యాపేటకు చెందిన వివేక్, వరంగల్‌కు చెందిన శృతి ఇద్దరూ ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడ్డారు.
ఇప్పుడు హెచ్‌సీయూపై దృష్టి!
రాష్ట్రంలో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి రిక్రూట్‌మెంట్ విషయంలో మావోయిస్టు పార్టీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దాంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కీలక విద్యార్థి నేతలను తాజాగా టార్గెట్ చేసుకుంది. ఇప్పటికే మావోయిస్టు భావజాలం ఉన్న కొందరు విద్యార్థులను రిక్రూట్ చేసుకునే దిశగా మానసికంగా సిద్ధం చేసినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇదే సమయంలో హెచ్‌సీయూకు చెందిన ఇద్దరు విద్యార్థులు కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీరాజ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన చందన్ మిశ్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగా హెచ్‌సీయూ వీసీని చంపేందుకు కుట్ర పన్నినట్టు ఆరోపిస్తూ పోలీసులు వారిని అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
మిశ్రాతో దేశవ్యాప్తంగా..!
బెంగాల్‌కు చెందిన చందన్ మిశ్రా వ్యవహారంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మిశ్రా ఓ కొరియర్ ద్వారా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ను ఈ ఏడాది జనవరిలో కలిశారని.. మావోయిస్టు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపాడని వెల్లడవడం నిఘా వర్గాలను కలవరపెడుతోంది. మావోయిస్టు పార్టీకి కంచుకోటగా పేరున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన చందన్ మిశ్రా.. పంజాబ్‌లోని తన స్నేహితుడు, వ్యవసాయ సంఘం నేత అమూల్‌సింగ్‌ను సైతం కలసి మావోయిస్టు పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలియడం సంచలనంగా మారింది. హరిభూషణ్‌ను కలసిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు చెందిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ విద్యార్థులను మావోయిస్టు పార్టీ కోసం పనిచేసేలా కృషి చేసేందుకు మిశ్రా ఆసక్తి చూపారని వెల్లడికావడం చర్చనీయాంశంగా మారింది.
హెచ్‌సీయూ వీసీని హతమార్చిన తర్వాత మిశ్రాకు మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవి ఇస్తానని హరిభూషణ్ చెప్పినట్టు తెలిసింది. దాంతో మిశ్రా దేశవ్యాప్తంగా తనకున్న పరిచయాలతో, మావోయిస్టు భావజాలంతో ఉన్న విద్యార్థులను, విద్యార్థి నేతలను ఏకం చేసేందుకు కార్యచరణ రూపొందించుకున్నట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తంగా గతంలోలా వర్సిటీల్లో రాడికల్ విద్యార్థి విభాగాలను ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పేరుతో నడిపించేందుకు హరిభూషణ్ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల యూనివర్సిటీల్లో పట్టుతోపాటు కేడర్‌పరంగా అర్బన్ ప్రాంతాల్లో గ్రీన్ కారిడార్ కమిటీలను సృష్టించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు నిఘా విభాగాలు అనుమానిస్తున్నాయి.
అరెస్టులు కుట్రపూరితమంటున్న విరసం
వీసీ హత్యకు కుట్రపన్నారంటూ పృథ్వీరాజ్, చందన్‌మిశ్రాలను పోలీసులు చేసినా.. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే అంశాలేవీ వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విప్లవ రచయితల సంఘం (విరసం) సైతం పోలీసుల ఆరోపణలను ఖండిస్తోంది. పృథ్వీరాజ్, చందన్‌మిశ్రాలను నాలుగు రోజుల క్రితం విజయవాడలో అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని... వీసీ హత్య కుట్ర పేరిట విశ్వవిద్యాలయాల్లో మరింత నిర్బంధ వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని పేర్కొంటోంది.
హెచ్‌సీయూ వీసీ అప్పారావుకు భద్రత పెంపు
మావోయిస్టులు హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావు హత్యకు కుట్రపన్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. రోహిత్ వేముల ఘటన అనంతరమే రాష్ట్రం ప్రభుత్వం ఆయనకు ఇద్దరు గన్‌మన్లను కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్‌సీయూలో వీసీ కార్యాలయం, అధికారిక నివాసాల వద్ద ప్రైవేటు సెక్యూరిటీని పెంచారు. గుర్తు తెలియని వ్యక్తులెవరూ లోనికి రాకుండా కట్టుదిట్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment